బంగ్లా గర్జించేనా..


Thu,May 16, 2019 04:13 AM

బంగ్లాదేశ్..యువ క్రికెటర్లకు చిరునామా. బరిలోకి దిగిందంటే గిరిగీసి కొట్లాడే నైజమున్న జట్టు. మూడు దశాబ్దాల క్రితం ఆసియా కప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన బంగ్లా అంచలంచెలుగా ఎదుగుతూ మేటి జట్లకు దీటైన పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది. దినదిన ప్రవర్ధమానంగా తప్పు, ఒప్పులను సరిదిద్దుకుంటూ తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది.ప్రత్యర్థి జట్టు ఎంతటిదైనా వెన్నుచూపని ధీరత్వంతో కడదాకా పోరాడటంలో ముందుండే బంగ్లా టైగర్స్ తమదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా మట్టికరిపించడంలో సిద్ధహస్తులు. నాలుగేండ్లకోసారి వచ్చే ప్రపంచకప్ లాంటి మెగాటోర్నీలపై తమదైన ముద్రవేయడంలో బంగ్లా ఎప్పుడు ముందుంటుంది. ఉడుకు రక్తంతో ఉరకలేసే నవయువకులకు తోడు అనుభవజ్ఞలైన క్రికెటర్ల సమాహారంతో ప్రపంచకప్ బరిలో దిగబోతున్న బంగ్లా టైగర్స్ గర్జిస్తారో లేదో మరికొన్ని రోజుల్లో తేలబోతున్నది.
bangladesh
ప్రపంచ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ది ప్రత్యేకమైన స్థానం. అరంగేట్రం నుంచి ఇప్పటిదాకా ఎన్నో సంచలన విజయాలు ఆ జట్టు సొంతం. క్రికెట్‌ను ప్రాణప్రదంగా భావించే దేశంలో ప్రతిభ కల్గిన ఆటగాళ్లకు అస్సలు కొదువ లేదు. క్రికెట్‌ను నరనరాన జీర్ణించుకున్న నవయువకులు బంగ్లా జట్టు దశదిశను మార్చేయడంలో కీలకమయ్యారు. వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ కుర్ర క్రికెటర్లు తమ సత్తా ఏంటో చాటిచెప్పారు. ముష్ఫీకర్ రహీమ్, ముస్తాఫిజుర్ రెహమాన్, మహ్మదుల్లా, సౌమ్య సర్కార్ లాంటి క్రికెటర్లు మచ్చుకు. వీరికి కెప్టెన్ ముషరఫీ మొర్తజా, ఆల్‌రౌండర్ షకీబల్ హసన్, రూబెల్ హుస్సేన్ తోడైతే బంగ్లా జట్టుకు తిరుగేలేదు. ఈనెల 30న ఇంగ్లండ్ వేదికగా మొదలయ్యే ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ టోర్నీ కోసం ప్రకటించిన 15 మందితో కూడిన బంగ్లా జట్టు యువకులు, అనుభవజ్ఞల కలయికగా కనిపిస్తున్నది.

బలాలు

ముషరఫీ మొర్తజా, షకీబల్ హసన్, తమీమ్ ఇక్బాల్, ముష్ఫీకర్ రహీమ్..బంగ్లా జట్టుకు మూల స్తంభాలు. ఈ నలుగురిలో ఏ ఒక్కరూ కుదురుకున్నా ప్రత్యర్థి జట్టుకు మూడినట్లే. 189 నుంచి 205 అంతర్జాతీయ వన్డేలాడిన అనుభవమున్న ఈ నలుగురు బంగ్లాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించడంలో కీలకమయ్యారు. వెస్టిండీస్ వేదికగా జరిగిన 2007 ప్రపంచకప్‌లో భారత్‌పై గెలిచిన సందర్భం ఇప్పటికి మనందరికి గుర్తుండే ఉంటుంది. నాకౌట్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను బంగ్లా ఓడించడం అప్పట్లో సంచలనం కల్గించింది. బ్యాటింగ్, స్పిన్, సీమ్, కీపింగ్ ఇలా నాలుగు అంశాలను ప్రభావితం చేసే మొర్తజా, షకీబల్, తమీమ్, రహీమ్..రానున్న ప్రపంచకప్‌లో జట్టు విజయాల్లో కీలక భూమిక పోషించనున్నారు. వీరి ప్రదర్శన జట్టు గెలుపు, ఓటములను ప్రభావితం చేసే అవకాశముంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అపార అనుభవమున్న ఈ నలుగురికి ప్రత్యర్థి జట్ల బలాలు, బలహీనతలు ఏంటో బాగా తెలుసు.

ఓపెనింగ్‌లో ఎవరు?

బంగ్లాను ఓపెనింగ్ అంశం ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నది. సీనియర్ తమీమ్ ఇక్బాల్‌కు జోడీగా సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్‌లో ఎవరిని ఓపెనింగ్‌కు దించాలనే దానిపై బంగ్లా టీమ్ మేనేజ్‌మెంట్ సమాలోచనలు చేస్తున్నది. ఓపెనింగ్ స్థానంపై సర్కార్, దాస్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. అయితే 2015 ప్రపంచకప్ నుంచి ఓపెనింగ్‌లో మొత్తం 24 ఇన్నింగ్స్‌ల్లో 36.71 సగటుతో సర్కార్ 771 పరుగులు చేశాడు. ఓపెనింగ్ కంటే మూడో స్థానంలో సర్కార్ 41.66 సగటుతో రాణించాడు. మరోవైపు దాస్ కూడా తానేం తక్కువ కాదన్నట్లు అందివచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. గతేడాది ఆసియాకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన దాస్ సెంచరీ(121)తో విజృంభించాడు. న్యూజిలాండ్ పర్యటనలోనూ ఓపెనర్‌గా వచ్చిన దాస్...అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో తమీమ్‌కు జోడీగా ఎవరు ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

మణికట్టు మాంత్రికులు లేకుండానే

ప్రస్తుత క్రికెట్‌లో మణికట్టు స్పిన్నర్ల హవా దిగ్విజయంగా కొనసాగుతున్నది. సంప్రదాయ స్పిన్నర్లకు భిన్నంగా బంతులు సంధించే మణికట్టు స్పిన్నర్లు..జట్టుకు ఆయువుపట్టులా మారారు. ఎంతలా అంటే 2015 ప్రపంచకప్ నుంచి వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరుగురిలో నలుగురు మణికట్టు స్పిన్నర్లు కావడం విశేషం. ఇది పసిగట్టిన ఆయా క్రికెట్ బోర్డులు యువ స్పిన్నర్లను సానబెడుతూ జాతీయ జట్టుకు అందిస్తున్నాయి. కానీ బంగ్లా మాత్రం సంప్రదాయ స్పిన్నర్లనే నమ్ముకుంది. ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన జట్టులో మణికట్టు స్పిన్నర్ లేడు. జట్టులో షబ్బీర్ రెహమాన్ ఒక్కడే లెగ్‌స్పిన్ బౌలింగ్ వేయగలడు. షకీబల్ హసన్, మెహదీ హసన్ మీద బంగ్లా జట్టు ఆధారపడనుంది.
Abu-Jayed

పటిష్ఠ పేస్ బలగం

బంగ్లా పేస్ దళం పట్టిష్ఠంగా కనిపిస్తున్నది. దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటిన 25 ఏండ్ల యువ ఫాస్ట్‌బౌలర్ అబు జాయెద్‌కు ప్రపంచకప్‌లో కొత్తగా చోటు కల్పించింది. బంగ్లా తరఫున ఐదు టెస్ట్‌లు, ఒక వన్డే, మూడు టీ20 మ్యాచ్‌లాడిన జాయెద్..15 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వేగానికి తోడు స్వింగ్‌తో అదరగొట్టే అబు చేరిక బంగ్లా అదనపు బలమని చెప్పొచ్చు. జాయెద్‌కు తోడు మొర్తజా, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్, సైఫుద్దీన్‌తో మిగతా జట్లకు సవాల్ విసిరేలా కనిపిస్తున్నది. అయితే వైవిధ్యమైన స్వింగ్ బౌలింగ్‌తో అదరగొట్టే ముస్తాఫిజుర్‌పై బంగ్లా భారీ ఆశలు పెట్టుకుంది. జట్టులో ఏకైక లెఫ్టార్మ్ పేసర్ అయిన ముస్తాఫిజుర్‌ను గాయాలు వేధిస్తుండటం కొంతలో కొంత ఆందోళన కల్గించే అంశం. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా తనదైన స్వింగ్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇరుకున పెట్టడంలో ముస్తాఫిజుర్ ఎప్పుడూ ముందుంటాడు. మిడిల్ ఓవర్లలో కెప్టెన్ మొర్తజా.. బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తాడు. దేశవాళీలో మెరుపులు మెరిపించిన సైఫుద్దీన్..అంతర్జాతీయ వేదికలపై తన సత్తాఏంటో నిరూపించుకోవాల్సి ఉంది.

కొదువలేని ఆల్‌రౌండర్లు

బంగ్లా జట్టులో ఆల్‌రౌండర్లకు కొదువ లేదని చెప్పాలి. మొర్తజా, మహ్మదుల్లా, షబ్బీర్, హుస్సేన్, సైఫుద్దీన్ బౌలింగ్‌తో పాటు తమదైన రోజు బ్యాటింగ్‌లోనూ విజృంభించడంలో ముందుంటారు. మరోవైపు జట్టులో సీనియర్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్..అటు బ్యాటింగ్‌కు తోడు ఉపయుక్తమైన బౌలింగ్‌తో జట్టుకు వెన్నెముకగా నిలుస్తాడు. వీరికి తోడు వికెట్‌కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించే లిట్టన్ దాస్, ముష్ఫీకర్..బ్యాట్లు ఝులిపిస్తే బంగ్లాకు తిరుగుండకపోవచ్చు.

బలహీనత

బంగ్లా బలమెంతో..బలహీనతలు జట్టును వేధిస్తున్నాయి. కెప్టెన్ మొర్తజా తరుచూ గాయాల పాలు కావడం అతని ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తుతున్నది. బ్యాటింగ్‌లో తమీమ్, సర్కార్, మహ్మదుల్లా, షబ్బీర్ అహ్మద్, రహీమ్, షకీబల్‌తో పటిష్ఠంగా కనిపిస్తున్నా....అప్పుడప్పుడు పేకమేడను తలపిస్తుంది. వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా..ప్రత్యర్థికి తిప్పలు తప్పకపోవచ్చు. బౌలింగ్ పరంగా దుర్బేద్యంగా కనిపిస్తున్నా..ఫీల్డింగ్‌లో బంగ్లా ఇంకా మెరుగుకావాల్సిన అవసరముంది.

బంగ్లాదేశ్ జట్టు:


మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫీకర్ రహీమ్, మహ్మదుల్లా, షకీబల్, మహ్మద్ మిథున్, షబ్బీర్, మొస్సాదెక్ హుస్సేన్, సైఫుద్దీన్, మెహదీ హసన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్, అబు జాయెద్.

బంగ్లా భారీ విజయం


డబ్లిన్: ముక్కోణపు సిరీస్‌లో బంగ్లాదేశ్ అదరగొడుతున్నది. సిరీస్‌లో ఇప్పటికే ఫైనల్స్‌కు చేరిన బంగ్లా..ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐర్లాండ్ నిర్దేశించిన 293 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 294 పరుగులు చేసింది. లిట్టన్ దాస్(76), తమీమ్ ఇక్బాల్(57), షకీబల్‌హసన్(50) అర్ధసెంచరీలతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించారు. రాంకిన్(2/48)కు రెండు వికెట్లు దక్కాయి. తొలుత స్టిర్లింగ్(130), కెప్టెన్ పోర్టర్‌ఫీల్డ్(94) రాణింపుతో ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 292 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అబు జాయెద్(5/58)కు ఐదు వికెట్లతో విజృంభించాడు.

564

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles