ఆరంభం అదిరింది


Tue,August 20, 2019 01:55 AM

-శ్రీకాంత్, సాయి ప్రణీత్, ప్రణయ్ ముందంజ
-రెండో రౌండ్‌కు మేఘన-పూర్విషా జోడీ
-బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్

పతకమే లక్ష్యంగా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో అడుగిడిన భారత షట్లర్లు తొలి రోజు అంచనాలకు తగ్గట్టే రాణించారు. పురుషుల విభాగంలో మూడున్నర దశాబ్దాలుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న పతకం ఆశలను మోస్తూ తొలిరౌండ్‌లో అదరగొట్టారు. కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్ తొలిరౌండ్‌లో గెలిచి రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. మహిళల డబుల్స్‌లో జక్కంపూడి మేఘన-పూర్విషా జోడీ సత్తాచాటింది.
బాసెల్ (స్విట్జర్లాండ్): బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాయి ప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ విజయం సాధించి ముందడుగేశారు. ప్రపంచ 19వ ర్యాంకర్ సాయి ప్రణీత్ 21-17, 21-16తో ఆంటోనీ హోసూ (కెనడా)ను వరుస గేమ్‌ల్లో చిత్తు చేశాడు. 40 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలిగేమ్ ప్రారంభంలో పోరు హోరాహోరీగా జరిగింది. 8-7కు చేరుకున్న ప్రణీత్ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. కండ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తూ వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించాడు. పదునైన స్మాష్‌లు, చురుకైన డ్రాప్‌లతో ఆకట్టుకున్నాడు. అయితే అంత త్వరగా ఓటమిని అంగీకరించని ఆంటోనీ కడదాక పోరాడాడు. చక్కటి ప్రతిఘటన కనబరుస్తూ ఆధిక్యాన్ని తగ్గించాడు. ఫలితంగా చివరికి ప్రణీత్ 21-17 తేడాతో తొలిగేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆరంభంలో ఇరువురు ఆటగాళ్లు ఆధిక్యం కోసం తీవ్రంగా శ్రమించారు. దీంతో గేమ్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 11-9తో ఆధిక్యం దక్కించుకున్న ప్రణీత్ ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా చకచకా పాయింట్లు సాధించుకుంటూ ఆఖరికి 21-16తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Sai-praneeth

సత్తచాటిన ప్రణయ్..

మరో మ్యాచ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 17-21, 21-10, 21-11 తేడాతో 93వ ర్యాంకర్ ఇటూ హీనో(ఫిన్లాండ్)పై నెగ్గాడు. 59 నిమిషాల పాటు జరిగిన పోరులో తొలి గేమ్ ఆసాంతం తడబడిన ప్రణయ్.. 17-21తో కోల్పోయి ఉత్కంఠ రేపాడు. అయితే రెండో గేమ్‌లో పుంజుకొని 5-5 నుంచి 17పాయింట్లు సాధించి.. ప్రత్యర్థికి ఐదు పాయింట్లు మాత్రమే ఇచ్చి 21-10తో సునాయాసంగా గెలిచాడు. మూడో గేమ్‌లో తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించి ముందడుగేశాడు. రెండో రౌండ్‌లో లిన్‌డాన్ (చైనా)తో ప్రణయ్ తలపడనున్నాడు.

జక్కంపూడి జోరు..

మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో భారత జోడీ జక్కంపూడి మేఘన-ఎస్.పూర్విషా రామ్ 21-10, 21-18 తేడాతో డయానా కోర్లెటో-నిక్టే అలెజాండ్రా సొటోమయోర్(గుటెమల)పై విజయం సాధించి, రెండో రౌండ్‌లో అడుగుపెట్టింది. షిహో తనక-కొహరు యోనెమోటా (జపాన్) ద్వయంతో రెండో రౌండ్‌లో మేఘన-పూర్విషా జోడీ ఢీకొననుంది. తెలంగాణ షట్లర్ ఎన్. సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీ మహిళల డబుల్స్‌లో నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వీరితో పాటు పూజ దండు-సంజనా సంతోష్ ద్వయం కూడా మంగళవారం బరిలో దిగనుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి జంట తొలిరౌండ్ ఆడనుండగా.. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డి, ఎమ్‌ఆర్ అర్జున్-శ్లోక్ రామచంద్రన్, అరుణ్-సన్యమ్ శుక్లా జోడీలు బరిలో దిగనున్నాయి.

పడిలేచిన శ్రీకాంత్..

మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 17-21, 21-16, 21-6 తేడాతో అన్‌సీడెడ్ నాట్ గుయెన్(ఐర్లాండ్)పై చెమటోడ్చి నెగ్గాడు. 66 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్ ప్రారంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన తెలుగు షట్లర్ మధ్యతో గతి తప్పాడు. ఓ దశలో 14-7తో ముందంజలో ఉన్నా.. పదేపదే తప్పిదాలు చేసి గేమ్‌ను 17-21తో కోల్పోయాడు. రెండో గేమ్ ప్రారంభంలోనూ 3-6తో వెనుకబడి ఆందోళన రేకెత్తించిన శ్రీకాంత్.. ఆ తర్వాతి నుంచి అదరగొట్టాడు. ప్రత్యర్థి ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గించుకుంటూ పోతూ చివరికి 21-16తో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో విశ్వరూపం ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకంగా 11వరుస పాయింట్లతో 21-6 తేడాతో కైవసం చేసుకొని రెండో రౌండ్‌లో ప్రవేశించాడు. రెండో రౌండ్‌లో మిషా జిల్‌బెర్మాన్ (ఇజ్రాయిల్)తో శ్రీకాంత్ తలపడనున్నాడు.
Srikanth-Kidambi

337

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles