సూపర్ శ్రీకాంత్


Mon,June 19, 2017 02:20 AM

ఇండోనేషియాలో శ్రీకాంతులు చాంపియన్స్ ట్రోఫీ
ఫైనల్ చేజింగ్‌లోడీలాపడ్డ ఇండియా!
వరల్డ్ హాకీలీగ్‌లో పాక్‌ను చిత్తుచేసిన భారత్
కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన శ్రీకాంత్

ఇటీవల సింగపూర్ ఓపెన్‌తో ఫామ్‌లోకొచ్చిన కిడాంబి శ్రీకాంత్ ఎట్టకేలకు ఈ సీజన్‌లో టైటిల్ సాధించాడు. ఈ తెలుగు షట్లర్ ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. గతరౌండ్లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్‌ను కంగుతినిపించిన శ్రీకాంత్ టైటిల్‌పోరులోనూ అంతేజోష్‌తో విజృంభించాడు. జపాన్ క్వాలిఫయర్ కజుమసా సకాయిని వరుసగేముల్లో చిత్తుచేసి కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

srikanth
బ్యాడ్మింటన్, హాకీలో మోదం.. క్రికెట్‌లో ఖేదం. ఇదీ ఆదివారం జరిగిన అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్‌కు ఎదురైన ఫలితం. తెలుగు కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సింగిల్స్ చాంపియన్‌గా నిలిచి కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్ సొంతం చేసుకోగా.. లండన్ వేదికగా జరిగిన వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత జట్టు 7-1 గోల్స్ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించి క్వార్టర్‌ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇక చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఫైనల్లో దాయాది జట్టు పాకిస్థాన్ చేతిలో పరాభవం ఎదురైంది. పాక్ జట్టు 180 పరుగుల భారీతేడాతో విరాట్‌సేనను ఓడించి తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవతరించింది.
srikanthVN
జకార్త: ఈ ఏడాది సింగపూర్ ఓపెన్‌లో టైటిల్ చేజారితేనేం.. ఆ వెంటనే జరిగిన మరో టోర్నమెంట్‌లో సత్తాచాటాడు శ్రీకాంత్. భారత బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ ఆటగాడిగా వెలుగొందుతున్న ఈ తెలుగు షట్లర్ ఇండోనేషియా గడ్డపై విజయఢంకా మోగించాడు. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ 21-11, 21-19తో జపాన్‌కు చెందిన క్వాలిఫయింగ్ ఆటగాడు కజుమసా సకాయిపై వరుసగేముల్లో గెలుపొంది ఈ వేదికపై తొలిసారి చాంపియన్‌గా నిలిచాడు. ఈ టైటిల్‌తో శ్రీకాంత్ ఇండోనేషియా సూపర్ సిరీస్ నెగ్గిన రెండో భారత షట్లర్‌గా నిలిచాడు.

గతంలో సైనా నెహ్వాల్ ఇక్కడ విజయం సాధించింది. 24ఏండ్ల శ్రీకాంత్‌కిది కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్ కావడం విశేషం. 2014లో చైనా ఓపెన్ నెగ్గిన శ్రీకాంత్.. ఆ తర్వాతి ఏడాది ఇండియా సూపర్ సిరీస్‌లో విజేతగా నిలిచాడు. ఈ ఏడాది సింగపూర్ ఓపెన్‌లో శ్రీకాంత్ ఫైనల్ చేరినా, సహచరుడు సాయి ప్రణీత్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. కానీ, ఈసారి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఫైనల్ ప్రత్యర్థి తనకంటే తక్కువ ర్యాంకరైనా ఏమాత్రం తేలిగ్గా తీసుకోని శ్రీకాంత్ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చాటుకుంటూ ముందుకు సాగాడు. రెండోగేమ్ ఆఖర్లో మినహా ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదుర్కోని శ్రీకాంత్ కేవలం 37 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు.

ప్రధాని అభినందనలు

కంగ్రాట్స్ శ్రీకాంత్.. నీ విజయంతో మేమంతా ఎంతో
సంతోషిస్తున్నాం - ట్విట్టర్‌లో ప్రధాని మోదీ

630

More News

VIRAL NEWS