చిక్కినట్లే.. చిక్కి!


Tue,November 21, 2017 02:24 AM

-భుమీ, షమీ విజృంభణ..
-తృటిలో ఓటమి తప్పించుకున్న లంక
-కోహ్లీ రికార్డు సెంచరీ..
-కోల్‌కతా టెస్ట్ ఉత్కంఠ డ్రా

వారెవ్వా ఏం టెస్ట్. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టిన వైనం. ఆది నుంచి ఆధిక్యం చేతులు మారుకుంటూ వచ్చిన కోల్‌కతా టెస్ట్ ఆఖరికి రంజుగా ముగిసింది. కెప్టెన్ కోహ్లీ రికార్డు సెంచరీ వీరవీహారంతో కుదేలైన లంక ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. లక్ష్యఛేదనలో భువీ, షమీ నిప్పులు
చెరిగే బంతులతో చిగురుటాకులా వణికిపోయింది. పరుగుల ఖాతా తెరువకుండానే వికెట్ల వేట మొదలుపెట్టిన మనోళ్లు పేస్ పవర్ ఏంటో లంకకు రుచిచూపించారు. వరుస విరామాల్లో లంక వికెట్లు కుప్పకూలడంతో చారిత్రక ఈడెన్‌గార్డెన్‌లో కోహ్లీసేన చిరస్మరణీయ విజయం ఖాయమనుకున్న వేళ..
వెలుతురులేమి రూపంలో లంక డ్రాతో బతికిబట్టకట్టింది. మొత్తానికి మనకు చిక్కినట్లే చిక్కి డ్రా అయిన ఈడెన్ టెస్ట్ అభిమానుల మదిలో చిరస్థాయిగా
నిలిచిపోయింది.

virat-kohli
కోల్‌కతా: సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్‌వన్ భారత్..ఆధిపత్యం దిగ్విజయంగా కొనసాగుతూనే ఉన్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న కోహ్లీసేన..లంకతో టెస్ట్‌లో దెబ్బతిన్న బెబ్బులిలా విజృంభించింది. వరుణుడి అండతో పర్యాటక లంక మొదటి మూడు రోజులు ఆధిపత్యం చెలాయిస్తే ఆఖరి రెండు రోజులు భారత్ సమిష్టి ప్రదర్శనతో అదురగొట్టింది. ఫలితంగా ఇరు జట్ల మధ్య ఆద్యంతం ఉత్కంఠ రేపిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యఛేదనలో లంక..భువనేశ్వర్(4/8), మహ్మద్ షమీ(2/34) ధాటికి 26.3 ఓవర్లలో 7 వికెట్లకు 75 పరుగులకు పరిమితమైంది. వీరి విజృంభణతో రెండు పరుగులకే ఓపెనర్లు సమరవిక్రమ(0), కరుణరత్నే(1) వికెట్లు కోల్పోయిన చండిమల్ సేన..ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. వెలుతురు సహకరించి ఉంటే..ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చి ఉండేది. అంతకుముందు 171/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమ్‌ఇండియా..కెప్టెన్ కోహ్లీ(119 బంతుల్లో 104 నాటౌట్, 12 ఫోర్లు, 2సిక్స్‌లు) వీరోచిత సెంచరీతో 352/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. లక్మల్(3/93), శనక(3/76)మూడేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. ఎనిమిది వికెట్లతో రాణించిన స్వింగ్ కింగ్ భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ఈనెల 24న నాగ్‌పూర్‌లో మొదలవుతుంది.
bhuvi

విరాట్ వీరోచితం:

లంకపై 49 పరుగుల ఆధిక్యంతో ఐదో రోజు ఆటను కొనసాగించిన భారత్‌ను ఆదిలోనే సురంగ లక్మల్ దెబ్బకొట్టాడు. పిచ్‌పై తేమను సద్వినియోగం చేసుకుంటూ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ రాహుల్(79), పుజార(22)ను బోల్తా కొట్టించాడు. లక్మల్ బంతిని సరిగ్గా అంచనా వేయని రాహుల్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కోహ్లీ..ఆదిలో కొంత నెమ్మదించినా కుదురుకున్నాక సహజసిద్ధమైన ఆటతీరుతో చెలరేగాడు. గాడిలో పడిందనుకున్న దశలో ఒకే ఓవరల్లో పుజార, రహానే(0)ను లక్మల్ పెవిలియన్‌కు పంపడంతో భారత్ ఒకింత ఒత్తిడిలోకి వెళ్లింది. తొలి ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుత అర్ధసెంచరీతో ఆకట్టుకున్న పుజార మూడోసారి..లక్మల్‌కు తనవికెట్ సమర్పించుకున్నాడు. ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్నా..కోహ్లీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో లంక బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. 251/5 స్కోరుతో లంచ్‌కు వెళ్లిన టీమ్‌ఇండియా..ఆ తర్వాత విరాట్..ధనాధన్ ఇన్నింగ్స్‌తో స్కోరుబోర్డుకు పరుగులు వెల్లువెత్తాయి. అర్ధసెంచరీని 80 బంతుల్లో పూర్తి చేసుకున్న కోహ్లీ..మరో 50 పరుగులను కేవలం 39 బంతుల్లోనే సాధించాడు. ఇక్కడే అర్థమవుతుంది మనోడు ఏ స్థాయిలో చెలరేగాడో. లక్మల్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో తన టెస్ట్ కెరీర్‌లో 18వ సెంచరీని నమోదు చేసుకున్న కోహ్లీ...సింహనాదం చేశాడు. సెంచరీతో మ్యాచ్ గతినే మార్చేసిన కోహ్లీకి అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 50వ శతకం కావడం విశేషం. విరాట్ ఓవైపు పరుగులు వరద పారిస్తున్నా..సహచర బ్యాట్స్‌మెన్ జడేజా(9), అశ్విన్(7), సాహా(5), భువనేశ్వర్(8) ఘోరంగా నిరాశపరిచారు. ఆఖరికి ఫలితం కోసం కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి లంక ముందు లక్ష్యాన్ని నిర్దేశించాడు.
team

భువీ, షమీ విజృంభణ:

భారత్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగుల ఖాతా తెరువక ముందే భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ సమరవిక్రమ(0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇదే ఊపులో కరుణరత్నే(1)ను మహ్మద్ షమీ బౌల్డ్ చేసి రెండో వికెట్‌గా పెవిలియన్ పంపాడు. తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీలతో ఆకట్టుకున్న తిరిమన్నె(7), మాథ్యూస్(12) కూడా నిరాశపరిచారు. భువీ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి తిరిమన్నె ఔట్ కాగా, మాథ్యూస్‌ను ఉమేశ్ వికెట్ల ముందు దొరుకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ చండిమల్(20), డిక్వెల్లా(27) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేసే ప్రయత్నం చేశారు. క్రీజులోకి వచ్చిరాగానే డిక్వెల్లా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. షమీ ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్స్‌లు మలిచి లంక శిబిరంలో జోష్‌ను నింపాడు. అయితే ఓటమి నుంచి గట్టేక్కే ప్రయత్నంలో పదేపదే సమయాన్ని వృథా చేస్తుండటాన్ని గమనించిన షమీ..డిక్వెల్లాపై ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో మైదానంలో ఒకింత ఉద్రిక్తత చోటు చేసుకున్నది. వీరిద్దరు వెంటవెంటనే నిష్క్రమించారు. ఇదే క్రమంలో దిలురువాన్ పెరెర(0)ను భువీ బౌల్డ్ చేయడంతో లంక ఓటమి ఇక ఖాయమనుకున్నారు.

లంకతో రెండో టెస్ట్‌కు విజయ్‌శంకర్

శ్రీలంకతో ఈనెల 24న నాగ్‌పూర్‌లో మొదలయ్యే రెండో టెస్ట్‌కు బీసీసీఐ సోమవారం 14 మందితో జట్టును ప్రకటించింది. ఇందులో ఓపెనర్ ధవన్, భువనేశ్వర్‌లను తప్పిస్తూ తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు చోటు కల్పించింది. ధవన్, భువీల అభ్యర్థన మేరకు వారిని ఎంపిక చేయలేదని బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది.

2

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్లలో సచిన్(100) తర్వాత విరాట్(50)దే రెండో స్థానం. ఆ తర్వాత ద్రవిడ్(48) ఉన్నాడు.

రికార్డుల రారాజు

- ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల రారాజుగా వెలుగొందుతున్నాడు. శ్రీలంకతో తొలి టెస్ట్‌లో శతకాల అర్ధసెంచరీ(50) సాధించి రికార్డుల్లోకెక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టడంతో..అతని అంతర్జాతీయ శతకాల సంఖ్య 50కి చేరింది. టెస్టుల్లో అతనికిది 18వ సెంచరీ. ఓవరాల్‌గా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో కోహ్లీ 8వ స్థానంలో నిలిచాడు. వంద సెంచరీలతో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉండగా...పాంటింగ్ (71), సంగక్కర (63), కలిస్ (62), ఆమ్లా (54), జయవర్దనే (54), లారా (53) కోహ్లీ కంటే (50) ముందు ఉన్నారు.
- టెస్టుల్లో 18వ సెంచరీ సాధించడం ద్వారా కోహ్లీ..భారత మాజీ క్రికెటర్ వెంగ్‌సర్కార్(17)ను అధిగమించాడు. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో కోహ్లీ ఆరో స్థానంలో చేరాడు. సచిన్ (51), ద్రవిడ్ (36), గవాస్కర్ (34), సెహ్వాగ్ (23), అజరుద్దీన్ (22) కోహ్లీ కంటే ముందు వరుసలో ఉన్నారు.
- అంతర్జాతీయ కెరీర్‌లో వేగంగా 50 సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఆమ్లా సరసన చేరాడు. ఈ ఇద్దరూ 348 ఇన్నింగ్సుల్లోనే ఈ ఫీట్‌ను సాధించగా..సచిన్ 376 ఇన్నింగ్సుల్లో, పాంటింగ్ 420, లారా 465 ఇన్నింగ్సుల్లో 50 సెంచరీల మార్క్‌ను చేరుకున్నారు.
- ఈడెన్‌గార్డెన్స్‌లో కోహ్లీకి ఇదే తొలి సెంచరీ...కాగా, ఈ ఏడాది సాధించిన సెంచరీల సంఖ్య 9, అంతకు ముందు కోహ్లీ 2012, 2014లో 8 సెంచరీలు సాధించాడు.
- ఇక గతంలో ఏ ఏడాది లేని విధంగా కోహ్లీ 2017లో 5సార్లు డకౌట్ అయ్యాడు. ఒకే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన తొలి భారత్ కెప్టెన్‌గానూ రికార్డుల్లోకి ఎక్కాడు.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 172 ఆలౌట్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 294 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్(బి) లక్మల్ 79, ధవన్(సి)డిక్వెల్లా(బి)శనక 94, పుజార(సి) పెరెర(బి)లక్మల్ 22, కోహ్లీ 104 నాటౌట్, రహానే(ఎల్బీ) లక్మల్ 0, జడేజా(సి)తిరిమన్నె (బి)పెరెర 9, అశ్విన్ (బి)శనక 7, సాహా(సి)సమరవిక్రమ(బి) శనక 5, భువనేశ్వర్ (సి)పెరెర(బి)గమాగే 8, షమీ 12 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 88.4 ఓవర్లలో 352/8 డిక్లేర్డ్; వికెట్ల పతనం: 1-166, 2-192, 3-213, 4-213, 5-249, 6-269, 7-281, 8-321; బౌలింగ్: లక్మల్ 24.4-4-93-3, గమాగే 23-2-97-1, శనక 22-1-76-3, పెరెర 13-2-49-1, హెరాత్ 6-1-29-0.

శ్రీలంక రెండో ఇన్నింగ్స్: సమరవిక్రమ (బి)భువనేశ్వర్ 0, కరుణరత్నే (బి)షమీ 1, తిరిమన్నె (సి)రహానే(బి)భువనేశ్వర్ 7, మాథ్యూస్ (ఎల్బీ)ఉమేశ్ 12, చండిమల్(బి) షమీ 20, డిక్వెల్లా(ఎల్బీ)భువనేశ్వర్ 27, శనక 6 నాటౌట్, పెరెర(బి)భువనేశ్వర్ 0, హెరాత్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 26.3 ఓవర్లలో 75/7; వికెట్ల పతనం: 1-0, 2-2, 3-14, 4-22, 5-69, 6-69, 7-75; బౌలింగ్: భువనేశ్వర్ 11-8-8-4, షమీ 9.3- 4-34-2, ఉమేశ్ 5-0-25-1, జడేజా 1-0-7-0.

516

More News

VIRAL NEWS