పుణెపై పట్టు


Sun,October 13, 2019 01:14 AM

-దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 275 ఆలౌట్
-సత్తాచాటిన అశ్విన్, ఉమేశ్.. భారీ లక్ష్య నిర్దేశనలో భారత్

భారత బ్యాట్స్‌మెన్ పరుగుల పండుగ చేసుకున్న పిచ్‌పై సఫారీలు ఆపసోపాలు పడ్డారు. ఉమేశ్, షమీ పేస్‌కు.. అశ్విన్ టర్న్ తోడవడంతో దక్షిణాఫ్రికా కోలుకోలేకపోయింది. సీనియర్లు డుప్లెసిస్, డికాక్ కాస్త తెగువ చూపినా..అద్భుతాలు మాత్రం చేయలేకపోయారు. ఆఖర్లో కేశవ్ మహారాజ్, ఫిలాండర్ పోరాడటం వల్ల సరిపోయింది కానీ, లేకుంటే ఇప్పటికే మ్యాచ్ భారత్ వశమయ్యేదే. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దక్కించుకున్న విరాట్ సేన నాలుగో రోజు ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడిస్తుందా..లేక అలిసి ఉన్న బౌలర్లకు విశ్రాంతి నిచ్చేందుకు ఓ రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేస్తుందా అనేదే ఇక తేలాల్సి ఉంది.
TeamIndia
పుణె: రెండో టెస్టుపై టీమ్‌ఇండియా పూర్తిగా పట్టుబిగించింది. బ్యాట్స్‌మెన్ వీరోచిత ఇన్నింగ్స్‌కు బౌలర్ల శ్రమ తోడవడంతో మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది. తొలిరోజే 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా శనివారం కూడా తమ వైఫల్యం కొనసాగించి.. చివరకు 105.4 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన సఫారీలను.. చివర్లో కేశవ్ మహారాజ్ (132 బంతుల్లో 72; 12 ఫోర్లు), ఫిలాండర్ (192 బంతుల్లో 44 నాటౌట్; 6 ఫోర్లు) ఆదుకున్నారు. టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధిస్తుందనుకుంటే.. దక్షిణాఫ్రికా తోకతో కొట్టింది. వైజాగ్‌లో ముత్తుస్వామి, డెన్ పీట్ చూపిన తెగువను ఇక్కడ కేశవ్, ఫిలాండర్ రిపీట్ చేశారు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను తలపిస్తూ 9వ వికెట్‌కు రికార్డు స్థాయిలో 109 పరుగులు జోడించారు. భారత గడ్డపై తొమ్మిదో వికెట్‌కు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. గతంలో (2001, కోల్‌కతా టెస్టు) స్టీవ్ వా, గెలెస్పీ జంట 9వ వికెట్‌కు అత్యధికంగా 268 బంతులు ఎదుర్కొని 133 పరుగులు చేసింది. తాజా ఇన్నింగ్స్‌లో ఫిలాండర్, మహారాజ్ ద్వయం 259 బంతుల్లో 109 రన్స్ చేసింది. దీంతో భారత్‌కు 326 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ (4/69), ఉమేశ్ యాదవ్ (3/37), మహమ్మద్ షమీ (2/44) రాణించారు.

డుప్లెసిస్, డికాక్ పోరాటం

ఓవర్‌నైట్ స్కోరు 36/3తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. నైట్‌వాచ్‌మన్ నోర్జే (3)ను షమీ ఔట్ చేస్తే.. బౌండరీలతో జోరు కనబర్చిన డిబ్రుయన్ (30; 6 ఫోర్లు)ను ఉమేశ్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో సఫారీలు 53 పరుగులకే సగం వికెట్లు కోల్పోయారు. ఈ దశలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (117 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్), డికాక్ (31; 7 ఫోర్లు) సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. కాస్త కుదురుకున్నాక ఎదురుదాడికి దిగింది. ఇషాంత్ ఓవర్‌లో డుప్లెసిస్ 2 ఫోర్లు బాదితే.. అశ్విన్ బౌలింగ్‌లో డికాక్ కూడా 2 బౌండ్రీలు కొట్టాడు. ముఖ్యంగా జడేజాను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడిన డుప్లెసిస్.. అతడి బౌలింగ్‌లో స్ట్రయిట్ సిక్సర్‌తో మరింత జోరు పెంచాడు. కాసేపటికి జడేజా వేసిన ఓకే ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన ఫాఫ్.. 64 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అశ్విన్ విడగొట్టాడు. ఆరో వికెట్‌కు 75 పరుగులు జోడించాక డికాక్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.

35 ఓవర్లు.. 61 పరుగులు

లంచ్ తర్వాత ముత్తుస్వామి (7)ని జడేజా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. భారత స్పిన్నర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో పరుగుల వేగం మందగించింది. ఒక వైపు డుప్లెసిస్ పోరాటం కొనసాగిస్తుంటే.. మరో ఎండ్‌లో ఫిలాండర్ అతడికి చక్కటి సహకారం అందించాడు. ఖాతా తెరిచేందుకు 22 బంతులు తీసుకున్న అతడు.. అచ్చమైన టెస్టు బ్యాట్స్‌మన్‌ను తలపించాడు. అయితే ఇన్నింగ్స్ భారాన్ని మోస్తున్న డుప్లెసిస్‌ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో రహానె ఒడిసి పట్టుకున్నాడు. దీంతో ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసినట్లే అనిపించినా.. టెయిలెండర్లు అనూహ్యంగా పోరాడారు. కేశవ్ మహారాజ్, ఫిలాండర్ భారత బౌలర్లను విసిగిస్తూ.. వికెట్ కోల్పోకుండా టీ విరామానికి వెళ్లారు.

తొమ్మిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో..

చివరి సెషన్‌లో బంతి కాస్త టర్న్ అవుతున్నా.. సఫారీలు మాత్రం మొండిగా పాతుకుపోయారు. షమీ బౌలింగ్‌లో ఫిలాండర్ 2 ఫోర్లు కొడితే.. జడేజాకు కేశవ్ అదే శిక్ష వేశాడు. మహారాజ్ భుజం గాయంతో బాధపడుతున్నప్పటికీ.. నొప్పిని పంటి బిగువున పెట్టి పోరాడిన తీరు ఆకట్టుకుంది. దీంతో భారత కెప్టెన్.. అశ్విన్‌ను రంగంలోకి దించాడు. అయితే బౌలర్‌తో సంబంధంలేకుండా విరుచుకుపడుతున్న కేశవ్.. యాష్ బౌలింగ్‌లోనూ రెండు బౌండరీలు బాది సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 9వ వికెట్‌కు 109 పరుగులు జోడించాక ఎట్టకేలకు అశ్విన్ ఈ జోడీని విడగొట్టాడు. లెగ్‌స్లిప్‌లో రోహిత్ శర్మ పట్టిన చురుకైన క్యాచ్‌కు కేశవ్ పెవిలియన్ బాటపట్టాడు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు 43.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం విశేషం. కాసేపటికే రబాడ (2)ను కూడా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అశ్విన్.. దక్షిణాఫ్రికా పోరాటానికి తెరదించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ సేన ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం పక్కా అనుకుంటే.. ఆఖరి వరుస బ్యాట్స్‌మెన్ పోరాటం టీమ్ మేనేజ్‌మెంట్‌ను పునరాలోచనలో పడేసింది. ఇదే టార్గెట్‌తో ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించాలా లేక బౌలర్లకు విశ్రాంతి నిస్తూ.. మరికొన్ని పరుగులు జతచేసి సఫారీల ముందు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించాలా అని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నది.

మొన్న కోహ్లీ.. నేడు రోహిత్..

వైజాగ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎదురైన అనుభవమే.. తాజా టెస్టులో రోహిత్ శర్మ చవిచూశాడు. మూడో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో రక్షణ వలయాన్ని ఛేదించుకొని లోపలికి వచ్చిన ఓ అభిమాని రోహిత్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు ఒక్కసారిగా కాళ్లు పట్టుకొని లాగడంతో రోహిత్ కిందపడిపోయాడు. అయితే కామెంటరీ బాక్స్‌లో ఉన్న లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ మాత్రం ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెక్యూరిటీ సిబ్బంది ఉన్నది ఉచితంగా మ్యాచ్‌ను వీక్షించేందుకు కాదు. ప్రేక్షకుల కదలికలపై ఓ కన్నేసి ఉంచాల్సిందిమాని మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తుండటం వల్లే ఇలాంటి సంఘటనలో పునరావృతం అవుతున్నాయి అని సన్నీ అన్నాడు.
rohit

-ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. కుంబ్లే (84), శ్రీనాథ్ (64), హర్భజన్ (60) ముందున్నారు.

-సఫారీలపై భారత్‌కు లభించిన రెండో అత్యధిక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం. 2009-10 పర్యటనలో భాగంగా కోల్‌కతా టెస్టులో లభించిన 347 పరుగుల ఆధిక్యం టాప్‌లో ఉంది.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 601/5 డిక్లేర్డ్,

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: ఎల్గర్ (బి) ఉమేశ్ 6, మార్క్మ్ (ఎల్బీ) ఉమేశ్ 0, డిబ్రుయన్ (సి) సాహా (బి) ఉమేశ్ 30, బవుమా (సి) సాహా (బి) షమీ 8, నోర్జే (సి) కోహ్లీ (బి) షమీ 3, డుప్లెసిస్ (సి) రహానే (బి) అశ్విన్ 64, డికాక్ (బి) అశ్విన్ 31, ముత్తుస్వామి (ఎల్బీ) జడేజా 7, ఫిలాండర్ (నాటౌట్) 44, కేశవ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 72, రబాడ (ఎల్బీ) అశ్విన్ 2, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 105.4 ఓవర్లలో 275 ఆలౌట్. వికెట్ల పతనం: 1-2, 2-13, 3-33, 4-41, 5-53, 6-128, 7-139, 8-162, 9-271, 10-275, బౌలింగ్: ఇషాంత్ 10-1-36-0, ఉమేశ్ 13-2-37-3, జడేజా 36-15-81-1, షమీ 17-3-44-2, అశ్విన్ 28.4-9-69-4, రోహిత్ 1-1-0-0.

465

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles