సెమీస్‌లో సింధు


Sat,April 13, 2019 02:14 AM

PV-Sindhu
- సైనా, శ్రీకాంత్ ఔట్
సింగపూర్: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారీ అంచనాలతో బరిలోకి దిగిన పీవీ సింధు చెమటోడ్చి సెమీస్‌లోకి ప్రవేశించగా, సైనా నెహ్వాల్, శ్రీకాంత్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో నాలుగోసీడ్ సింధు 21-13, 17-21, 21-14తో కాయ్ యన్‌యాన్ (చైనా)పై గెలిచింది. తద్వారా ఈ సీజన్‌లో రెండోసారి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. 59 నిమిషాల హోరాహోరీ పోరులో ప్రతి పాయింట్ కోసం ఇరువురు తీవ్రంగా పోరాడారు. తొలి గేమ్‌ను 5-5తో మొదలుపెట్టిన సింధు.. ఏ దశలోనూ వెనుదిరిగి చూసుకోలేదు. అయితే రెండో గేమ్‌లో ఊహించని విధంగా దూసుకొచ్చిన చైనీస్ ప్లేయర్ 11-6తో ఆధిక్యంలోకి వెళ్లింది.

సింధు స్ఫూర్తిదాయకంగా పోరాడుతూ 15-16తో దూసుకొచ్చినా చివర్లో తడబడింది. నిర్ణాయక మూడో గేమ్‌లో పూర్తి భిన్నంగా ఆడిన తెలుగమ్మాయి బ్రేక్ వరకు 11-5 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత కూడా అదే జోరును చూపెడుతూ గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో మ్యాచ్‌లో ఆరోసీడ్ సైనా 8-21, 13-21తో రెండోసీడ్ నజోమి ఒకుహర (జపాన్) చేతిలో ఓడింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒకుహర ఆద్యంతం ఆధిపత్యం చూపెట్టింది. 9-0తో తొలి గేమ్‌ను మొదలుపెట్టిన జపాన్ అమ్మాయి.. సైనాకు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. కేవలం 8 పాయింట్లే ఇచ్చింది. రెండో గేమ్‌లో సైనా 4-0తో ముందంజ వేసినా.. ఒకుహర 6-6, 11-8 ఆధిక్యంలోకి వెళ్లి గేమ్‌ను కాపాడుకుంది.
పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో శ్రీకాంత్ 18-21, 21-19, 9-21తో కెంటో మెమోటో (జపాన్) చేతిలో, సమీర్ వర్మ 10-21, 21-15, 15-21తో చో తియాన్ చెన్ (చైనీస్‌తైపీ) చేతిలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా 14-21, 16-21తో డెచ్‌పోల్-సప్‌శ్రీ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశారు.

225

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles