నేటి నుంచి ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ


Tue,January 22, 2019 01:16 AM

Saina

-బరిలో శ్రీకాంత్, సైనా, సింధు

జకార్తా: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత స్టార్ షట్లర్లు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో బరిలోకి దిగుతున్నారు. మలేషియా ఓపెన్ సెమీస్ చేరిన సైనా, పీబీఎల్‌లో రాణించిన సింధు టైటిల్ ఆశలతో టోర్నీలో అడుగుపెడుతుండగా..పురుషుల సింగిల్స్‌లో కిడాంబి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఫైనల్లో వరుసగా ఎదురవుతున్న ఓటమిలకు చెక్ పెడుతూ సింధు, గత నెలలో ప్రపంచ టూర్ ఫైనల్ టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. పీబీఎల్ తర్వాత మలేషియా ఓపెన్‌లో పాల్గొనకుండా విశ్రాంతి తీసుకున్న సింధు ఈ టోర్నీతో మళ్లీ కోర్టులో అడుగుపెట్టనుంది. తొలిరౌండ్‌లో చైనా షట్లర్ లీ గ్జిరుయ్‌తో సింధు తలపడనుంది. క్వార్టర్ ఫైనల్ చేరితే ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్‌తో సింధు తలపడే అవకాశముంది. క్వాలిఫయర్‌తో తొలిరౌండ్‌లో తలపడనున్న సైనాకు క్వార్టర్స్‌లో అకానే యమగుచి ఎదురయ్యే అవకాశముంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో కిడాంబితోపాటు సమీర్‌వర్మ, సాయి ప్రణీత్, హెచ్‌ఎస్ ప్రణయ్ టోర్నీలో పాల్గొంటున్నారు. తొలిరౌండ్‌లో మలేషియా ఆటగాడు లీ డారెన్‌తో శ్రీకాంత్ తలపడనున్నాడు. ఒలింపిక్ చాంపియన్ చెన్ లాంగ్‌తో ప్రణీత్, బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్‌డాన్‌తో సమీర్ వర్మ, చైనీస్ తైపీకి చెందిన చౌ తియాన్‌ను ప్రణయ్ ఢీకొట్టనున్నారు. పురుషుల డబుల్స్‌లో తొలిరౌండ్‌లో భారత్‌కే చెందిన సాత్విక్ రాజ్ రాంకిరెడ్డి, చిరాగ్‌శెట్టి జోడీతో సుమిత్ రెడ్డి, మను అత్రి జోడీ తలపడనుంది. మహిళల డబుల్స్‌లో థాయిలాండ్‌కు చెందిన జోంగ్‌కొల్పాన్ కితితారకుల్ , రవీంద జోడీతో ఏడోసీడ్ అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడీ తొలిరౌండ్‌లో పోటీపడనుంది.

195

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles