సింధుకు షాక్


Fri,November 16, 2018 12:51 AM

క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, సమీర్-హాంకాంగ్ ఓపెన్
srikanth
కోవ్‌లూన్(హాంకాంగ్): మహిళల సింగిల్స్‌లో భారత్ పోరు ముగిసింది. ఇప్పటికే తొలిరౌండ్‌లోనే హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ వెనుదిరగగా..రెండో రౌండ్‌లో పీవీ సింధు అనూహ్య ఓటమితో హాంకాంగ్ ఓపెన్ నుంచి వైదొలిగింది. ఈ టోర్నీలో మూడోసీడ్‌గా బరిలోకి దిగిన ప్రపంచ నంబర్ 4 సింధు 24-26, 20-22 స్కోరుతో కొరియాకు చెందిన హున్ జీ సంగ్ చేతిలో పరాజయం పాలైంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ 18-21, 30-29, 21-18స్కోరుతో భారత్‌కే చెందిన హెచ్‌ఎస్ ప్రణయ్‌ని హోరాహోరీ పోరాటంలో ఓడించి క్వార్టర్స్ చేరాడు. ఒలింపిక్ చాంపియన్ చెన్‌లాంగ్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత్‌కే చెందిన సమీర్‌వర్మ వాకోవర్ లభించడంతో క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు.

ఉత్కంఠను అధిగమించి..


పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ మధ్య పోరు మరింత హోరాహోరీగా సాగింది. తొలిగేమ్‌లో ప్రణయ్ ఒత్తిడిని తట్టుకుని 18-21 స్కోరుతో గెలుపొంది మ్యాచ్‌లో పై చేయిని ప్రదర్శించాడు. కాగా, రెండో గేమ్ మాత్రం టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. సుదీర్ఘ ర్యాలీలు.. వరుసగా పాయింట్లు సాధిస్తూ ప్రతి నిమిషానికీ ఆధిక్యం చేతులు మారింది. సుదీర్ఘంగా సాగిన రెండోగేమ్‌లో 30-29 పాయింట్ల తేడాతో శ్రీకాంత్ కైవసం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడోగేమ్‌కు మళ్లించాడు. మ్యాచ్ విజేతను నిర్ణయించే మూడోగేమ్‌లోనూ భారత షట్లర్లు అద్భుత పోరాటంతో అలరించారు.చివరి గేమ్‌లో 16-16తో స్కోరుతో శ్రీకాంత్‌ను నిలువరించినా అప్పటికే అలసిన షట్లర్ 18-21 తేడాతో పరాజయం పాలయ్యాడు. దీంతో శ్రీకాంత్ క్వార్టర్స్ చేరుకున్నాడు. కాగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్, అశ్విని పొన్నప్ప జోడీ 17-21,11-21 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన యాంగ్, యా చింగ్ జోడీ చేతిలో పరాజయం పాలు కాగా.. పురుషుల డబుల్స్‌లో సుమిత్‌రెడ్డి, మనుఅత్రి జోడీ 16-21,15-21 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన హుయ్ లీ, యాంగ్ లీ జంట చేతిలో ఓటమితో పోరాటం ముగించారు.

278

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles