మళ్లీ మనోహర్‌కే పట్టం


Wed,May 16, 2018 01:00 AM

ఐసీసీ చైర్మన్‌గా రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక
shashank-manohar
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్వతంత్ర చైర్మన్‌గా శశాంక్ మనోహర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేండ్ల కిందట తొలిసారి ఎన్నికైన ఆయన మరో రెండేండ్ల పాటు ఇదే పదవిలో కొనసాగనున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకా రం చైర్మన్ పదవికి ఐసీసీ డైరెక్టర్లు తమ అభ్యర్ధులను నామినేట్ చేయొచ్చు. ఇలా నామినేట్ అయిన వారికి రెండు సభ్య దేశాల మద్దతు ఉండాలి. అయితే ఈసారి ఎన్నికల్లో మనోహర్ మినహా ఇంకెవ్వరూ నామినేషన్లు వేయలేదు. దీంతో ఐసీసీ కౌన్సిల్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా మనోహర్‌ను ఎన్నుకున్నారు. ఇండిపెండెంట్ అడిట్ కమిటీ చైర్మన్ ఎడ్వర్డ్ క్విన్లాన్ ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. వాస్తవానికి గత నెలలో కోల్‌కతాలో జరిగిన త్రైమాసిక సమావేశంలోనే మనోహర్‌కు రెండోసారి పగ్గాలు అప్పగించాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అధికారింగా ప్రకటించారు. ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా 2016లో బాధ్యతలు స్వీకరించిన మనోహర్.. ఎన్నో కఠినమైన సవాళ్లను ఎంతో నేర్పుగా పరిష్కరించారు.

2014లో ఏర్పాటు చేసిన బిగ్-3 పెత్తనానికి ముగింపు పలుకుతూ బోర్డు పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఐసీసీకి తొలి మహిళా డైరెక్టర్‌ను కూడా నియమించారు. తనను రెండోసారి ఎన్నుకున్నందుకు ఐసీసీ బోర్డు డైరెక్టర్లకు మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ ఇదే పదవిలో కొనసాగుతున్నందుకు చాలా గర్వంగా సంతోషంగా ఉంది. నాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. గత రెండేండ్లలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. క్రికెట్ కోసం మేం ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చాం అని మనోహర్ పేర్కొన్నారు. రాబోయే రెండేండ్లలో క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రపంచ స్థాయిలో వ్యూహాలను అమలు చేస్తామన్నారు. ఆటను కాపాడటంతో పాటు అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు.

501

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles