శరద్ రికార్డు పసిడి


Fri,October 12, 2018 12:21 AM

హైజంప్‌లో ఆసియా రికార్డుతో స్వర్ణం కైవసం
పారా ఆసియా క్రీడలు

sharadkumar
జకార్తా: పారా ఆసియన్ క్రీడల హైజంప్‌లో భారత పారా అథ్లెట్లు అదరగొట్టారు. అందుబాటులో ఉన్న మూడు పతకాలనూ భారత అథ్లెట్లు అందుకోవడం విశేషం. గురువారం జరిగిన పురుషుల హైజంప్ టీ42/63 విభాగంలో శరద్ కుమార్ స్వర్ణపతకం సాధించాడు. తద్వారా ఈ క్రీడలలో రెండో స్వర్ణం అందుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో అదరగొట్టిన 26 ఏండ్ల శరద్ 1.90 మీటర్ల ఎత్తు లంఘించి ఆసియా క్రీడల చరిత్రలో కొత్త రికార్డు నమోదు చేస్తూ పసిడి పతకం అందుకున్నాడు. రెండేండ్ల వయసులో పక్షవాతంతో శరద్ ఒక కాలు పీలగా మారినా అద్భుతమైన నైపుణ్యం అంతకుమించిన శక్తిని ప్రదర్శించాడు. రియోలో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన భారత పారా హైజంపర్ వరుణ్ భాటి 1.82 మీటర్లతో రెండోస్థానంతో రజతం సాధించాడు. రియో క్రీడల్లో స్వర్ణం గెలిచిన తంగవేలు మరియప్పన్ 1.67 మీటర్ల దూరం అధిగమించి మూడోస్థానంతో కాంస్య పతకం గెలుచుకున్నాడు. దీంతో మూడు పతకాలు భారత్‌కే దక్కాయి. అద్భుతమైన సామర్థ్యం ప్రదర్శించిన శరద్ బీహార్ రాష్ట్ర అథ్లెట్. రెండేండ్ల వయసులో పక్షవాతం కారణంగా ఎడమ కాలు పీలగా మారిపోయింది. కానీ..వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపించాడు. హైజంప్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ అందుకున్నాడు. తాజా ప్రదర్శనతో మరోమారు హైజంప్‌లో తనకు ఎదురులేదని నిరూపించాడు.

జావెలిన్‌త్రోయర్ సుందర్‌కు రజతం


పురుషుల ఎఫ్ 46 విభాగంలో భాగంగా జావెలిన్ త్రో పోటీపడిన భారత అథ్లెట్ సుందర్ సింగ్ గుజార్ రెండోస్థానంతో రజత పతకం అందించాడు. టోర్నీకి ముందు భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) సాయంతో ఫిన్‌లాండ్‌లో శిక్షణ తీసుకున్న గుజార్ ఈటెన్ 61.84 మీటర్ల దూరం విసిరి రెండోస్థానంతో పతకం దక్కించుకున్నాడు. గాయంతో బాధపడుతూనే ఆసియా క్రీడలలో పాల్గొన్న స్టార్ పారా అథ్లెట్ దేవేంద్ర ఝజారియా నాలుగోస్థానంతో పతకం చేజార్చుకున్నాడు. మూడోస్థానంలో నిలిచిన రింకు కాంస్యంతో మెరిశాడు. రింకు 60.92 మీటర్ల దూరం ఈటెను విసిరి కెరీర్ బెస్ట్ సాధించడంతోపాటు పతకం గెలుచుకున్నాడు. పురుషుల 400మీ పరుగు టీ13 విభాగంలో అనిల్ కుమార్ కాంస్యం గెలిచాడు. 52సెకన్లలో రేసు పూర్తి చేసి మూడోస్థానంతో పతకం ఒడిసిపట్టాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో ఆనందన్ గుణేశన్ కుమార్ 400మీటర్ల పరుగు టీ45/46/47 విభాగంలో రజతం, వినయ్ కుమార్ కాంస్యం గెలిచాడు. పురుషుల క్లాసిఫికేషన్ 400మీ పరుగులో సందీప్ మూడోస్థానంతో కంచు పతకం అందించగా.. మహిళల 400మీ పరుగులో జయంతి బెహరా రజతం అందుకుంది. టీ/12 దృష్టి మాంద్యం విభాగం 400మీటర్ల క్లాసిఫికేషన్ పరుగుపందెంలో రాధా వెంకటేశ్ కాంస్యం గెలుచుకుంది. 400మీ ప్రీస్టయిల్ ఎస్10 విభాగంలో జరిగిన ఈత పోటీలలో స్వప్నిల్ పాటిల్ భారత్‌కు కాంస్యం అందించాడు. గురువారం మొత్తం 13 పతకాలు అందగా..భారత్ 8 స్వర్ణ, 17 రజత, 25 కాంస్యాలతో ఓవరాల్‌గా పతకాల పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతున్నది.

176

More News

VIRAL NEWS

Featured Articles