చెలరేగిన షెఫాలీ, స్మృతి


Mon,November 11, 2019 03:56 AM

Shafal
విండీస్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం
గ్రాస్‌ఇస్లెట్(సెయింట్ లూసియా) : 15ఏండ్ల షెఫాలీ వర్మ(49 బంతుల్లో 73 ; 6ఫోర్లు, 4సిక్సర్లు), స్టార్ ప్లేయర్ స్మృతి మంధన(46బంతుల్లో 67 ; 11ఫోర్లు) అర్ధశతకాలతో చెలరేగడంతో వెస్టిండీస్‌పై భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో విండీస్‌పై టీమ్‌ఇండియా 84 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఓపెనర్లు షెఫాలీ, స్మృతి విజృంభించి 143 పరుగుల ఓపెనింగ్ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత బౌలర్లు శిఖా పాండే(2/22), రాధా యాదవ్(2/10), పూనమ్ యాదప్(2/24) సమిష్టిగా రాణించడంతో విండీస్ విలవిల్లాడి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 101 పరుగులే చేయగలిగింది. వెస్టిండీస్ ప్లేయర్లలో షెమైన్ క్యాంప్‌బెల్(33) మినహా మరెవరూ 20 పరుగుల మార్క్‌ను దాటలేకపోయారు. బ్యాటింగ్‌లో చెలరేగి తొలి అర్ధశతకాన్ని నమోదు చేసిన షెఫాలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

సచిన్ రికార్డు బ్రేక్ చేసిన షెఫాలీ

అంతర్జాతీయ స్థాయిలో అర్ధ శతకం సాధించిన అతిపిన్న వయసు భారత ప్లేయర్‌గా షెఫాలీ వర్మ(15ఏండ్ల 285 రోజులు) రికార్డు సృష్టించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట మూడు దశాబ్దాల పాటు ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 16ఏండ్ల 214 రోజుల వయసులో మాస్టర్ బ్లాస్టర్.. టెస్టుల్లో తొలి అర్ధశతకాన్ని సాధించాడు.

656

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles