నంబర్‌వన్‌కు షాక్


Tue,January 22, 2019 01:26 AM

-హాలెప్‌ను ఓడించిన సెరెనా
-ప్లిస్కోవా, ఒసాకాతో కలిసి క్వార్టర్స్‌లోకి ప్రవేశం
-రావోనిక్, నిషికోరి కూడా..

తన మునుపటి ఫామ్‌ను అందుకున్న అమెరికా నల్ల కలువ సెరెనా, సెర్బియా యోధుడు జొకోవిచ్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తమ రాకెట్ పవర్‌ను చూపెట్టారు. ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైనా.. చివర్లో నిలదొక్కుకున్న జొకో క్వార్టర్స్ బెర్త్‌ను దక్కించుకోగా.. ప్రపంచ నంబర్‌వన్‌కు షాకిచ్చిన సెరెనా... కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు మరింత చేరువైంది. పురుషుల సీడెడ్ ఆటగాళ్లలో జ్వరేవ్, సిలిచ్, కోరిక్‌కు చుక్కెదురు కాగా, మహిళలు తమకంటే తక్కువ స్థాయి ప్రత్యర్థులపై విజయాలు సాధించి ముందంజ వేశారు.
serena
మెల్‌బోర్న్: అంచనాలకు అనుగుణంగా ఆడిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దూసుకుపోతున్నది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 16వ సీడ్ సెరెనా 6-1, 4-6, 6-4తో ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హాలెప్ (రొమేనియా)కు షాకిచ్చి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మూడుసెట్ల థ్రిల్లింగ్ పోరాటంలో.. అమెరికన్ తన సర్వీస్ పవరెంటో చూపెట్టింది. 2017 సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత హాలెప్‌తో మొదటిసారి తలపడినా.. ఆటతీరులో ఏమాత్రం మార్పు రాలేదని స్పష్టం చేసింది. రెండేండ్ల కిందట 23వ గ్రాండ్‌స్లామ్ ఖాతాలో వేసుకున్న 37 ఏండ్ల సెరెనా.. ఈ టోర్నీలో హాలెప్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన వాటిలో ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. గంటా 47నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మాత్రం రెండోసెట్ కోల్పోయింది. ఆరంభంలో సెరెనా నెమ్మదిగా ఆడటంతో.. రొమేనియా ప్లేయర్ ఓ డబుల్ ఫాల్ట్‌తో మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. కానీ రెండో గేమ్‌లో తన మార్క్ షాట్లు చూపెట్టిన సెరెనా.. నెట్ వద్ద ఓవర్‌హెడ్ స్మాష్‌లను అద్భుతంగా రిటర్న్ చేసింది. ఇక్కడి నుంచి హాలెప్ సర్వీస్‌లను బ్రేక్ చేయడంతో పాటు తన సర్వీస్‌ను కాపాడుకుంది. బలమైన 10 విన్నర్లు సంధించి కేవలం 20 నిమిషాల్లోనే తొలిసెట్‌ను కైవసం చేసుకుంది. రెండోసెట్ ప్రారంభంలో హాలెప్ మెరుగ్గా ఆడింది. మూడో గేమ్‌లో తన సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనాను తర్వాతి గేమ్‌లో అడ్డుకుంది. బేస్‌లైన్ వద్ద స్థిరంగా ఆడుతూ సుదీర్ఘమైన ర్యాలీలతో ఆకట్టుకుంది.

ఎక్కువగా బంతిని కార్నర్లకు కొట్టి సెరెనాను మైదానం మొత్తం పరుగులు పెట్టించింది. పదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్‌ను చేజిక్కించుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్‌లో ఇరువురు సర్వీస్‌లను నిలబెట్టుకున్నా.. ఆరో గేమ్‌లో మ్యాచ్ టర్న్ అయ్యింది. హాలెప్ మూడు బ్రేక్ పాయింట్లను కాచుకున్నా.. సెరెనా పట్టువదలకుండా పోరాడి ఐదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకుని కెరీర్‌లో 8వ ఆస్ట్రేలియన్ టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేసింది. మరోవైపు తాజా ఓటమితో హాలెప్ టాప్ ర్యాంక్‌కు ముప్పు ఏర్పడింది. మ్యాచ్ మొత్తంలో సెరెనా 9 ఏస్‌లు, 2 డబుల్ ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేసింది. హాలెప్ 2 ఏస్‌లు, 2 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో సీడెడ్ క్రీడాకారిణిలు అంచనాలను అందుకున్నారు. నాలుగోసీడ్ నవోమి ఒసాకా (జపాన్) 4-6, 6-3, 6-4తో 13వ సీడ్ సెవస్తోవా (లాత్వియా)పై, ఆరోసీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6-2, 1-6, 6-1తో మాడిసన్ కీస్ (అమెరికా)పై, ఏడోసీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్) 6-3, 6-1తో 18వ సీడ్ ముగురుజా (స్పెయిన్)పై గెలిచి క్వార్టర్స్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు.

ఐదు గంటల మారథాన్..


మరో మ్యాచ్‌లో నిషికోరి (జపాన్) 6-7 (8/10), 4-6, 7-6 (7/4), 6-4, 7-6 (10-8)తో పాబ్లో కారెన్ బుస్టా (స్పెయిన్)పై చెమటోడ్చి నెగ్గాడు. 5 గంటల 5 నిమిషాల పోరాటంలో అంపైర్ తప్పిదం బుస్టా కొంప ముంచింది. ఐదోసెట్ చివరి టైబ్రేక్‌లో బుస్టా 8-5 ఆధిక్యంలో ఉన్న దశలో అంపైర్ రాంగ్ కాల్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన స్పెయిన్ ప్లేయర్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దీని ప్రభావం తర్వాతి పాయింట్లపై పడటంతో కోలుకోలేకపోయాడు. ఓడిన తర్వాత ఆగ్రహంతో కిట్ బ్యాగ్‌ను తీసుకుని మైదానం నుంచి వెళ్లిపోయాడు. 15 ఏస్‌లతో విజృంభించిన నిషికోరి 67 అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను సాగదీశాడు.
Milos-Raonic

రాకెట్ విరగ్గొట్టి..


ఇతర మ్యాచ్‌ల్లో మిలోస్ రావోనిక్ (కెనడా) 6-1, 6-1, 7-6 (7/5) అలెగ్జాండర్ జ్వరేవ్ (జర్మనీ)పై, 22వ సీడ్ బటిస్టా అగుట్ (స్పెయిన్) 6-7 (6/8), 6-3, 6-2, 4-6, 6-4తో 6వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలిచారు. అయితే ఓటమిని తట్టుకోలేకపోయిన జ్వరేవ్.. మైదానంలో తన అసహనాన్ని చూపెట్టాడు. తన కంటే తక్కువ ర్యాంక్ ప్రత్యర్థి చేతిలో పరాజయం పాలైన అతను రాకెట్‌ను ఎనిమిదిసార్లు నేలకు బలంగా కొట్టాడు. దీంతో రాకెట్ ముక్కలుగా కాగా, ప్లేయర్ అనుచిత ప్రవర్తనకు అందరూ విస్తుపోయారు. కెరీర్‌లో 15సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో బరిలోకి దిగినా.. 14సార్లు క్వార్టర్స్ చేరడంలో విఫలమయ్యాడు. దీంతో అందని ద్రాక్షగా మారిన స్లామ్ టైటిల్ ఈసారి కూడా దక్కదని తేలడంతో తన చికాకును రాకెట్‌పై చూపెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట్లో వైరల్‌గా మారింది.

క్వార్టర్స్‌లో జొకోవిచ్


ఏడోసారి టైటిల్ కోసం వేట మొదలుపెట్టిన జొకోవిచ్ (సెర్బియా).. ప్రిక్వార్టర్స్‌లో 6-4, 6-7 (5/7), 6-2, 6-3తో 15వ సీడ్ మెద్వదేవ్ (రష్యా)పై నెగ్గాడు. 3 గంటల 15 నిమిషాలు జరిగిన ఈ పోరులో సెర్బియా ప్లేయర్ రెండో సెట్ కోల్పోయాడు. ఈ టోర్నీలో సెట్ చేజార్చుకోవడం వరుసగా ఇది రెండోసారి. రెండోసెట్ టైబ్రేక్‌లో మెద్వదేవ్ బలమైన సర్వీస్‌లతో ఆకట్టుకున్నా... చివరి రెండు సెట్లలో జొకోవిచ్ దూకుడు ముందు ఆగలేకపోయాడు. క్రాస్‌కోర్టు షాట్స్‌తో సూపర్ రిటర్న్స్ చేసిన టాప్‌సీడ్ ప్లేయర్ రెండుసార్లు మెద్వదేవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి మూడోసెట్‌ను చేజిక్కించుకున్నాడు. నాలుగోసెట్‌లో ఓసారి సర్వీస్‌ను చేజార్చుకున్నా వెంటనే పుంజుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో మెద్వదేవ్ 18 ఏస్‌లు సంధించినా.. సెకండ్ సర్వీస్‌లో పాయింట్లు రాబట్టలేకపోయాడు. 38 విన్నర్లతోనే సరిపెట్టుకున్నాడు. జొకోవిచ్ 43 విన్నర్లతో పాటు 50సార్లు అనవసర తప్పిదాలు చేశాడు.
Novak-Djokovic

1074

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles