చరిత్రకు అడుగు దూరంలో..


Fri,July 12, 2019 03:07 AM

-వింబుల్డన్ ఫైనల్లో సెరెనా..
-స్వితోలినాను చిత్తు చేసిన హలెప్..
-ఫైనల్ చేరిన తొలి రొమేనియా మహిళగా రికార్డు

మరో గ్రాండ్‌స్లామ్ టోర్నీ గెలిచి టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ మార్గ్గరెట్ కోర్ట్ రికార్డును సమం చేయాలని పట్టుదలగా ఉన్న సెరెనా విలియమ్స్ స్థాయికి తగ్గ ప్రదర్శనతో వింబుల్డన్ తుదిపోరుకు చేరింది. సెమీస్‌లో ప్రత్యర్థి స్ట్రికోవాను గంటలోపే మట్టికరిపించింది. మరో మ్యాచ్‌లో స్వితోలినాను సునాయాసంగా ఓడించి వింబుల్డన్ సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి రొమేనియా మహిళగా సిమోనా హలెప్ రికార్డు సృష్టించింది.
Serena
లండన్ : 37 ఏండ్ల వయసులో టెన్నిస్‌కోర్టులో మెరుపు వేగంతో పరుగెడుతూ... బంతిని బలంగా బాదుతూ.. ప్రత్యర్థులను మట్టికరిపిస్తున్న అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ వింబుల్డన్ గ్లాండ్‌స్లామ్ టైటిల్‌ను ఎనిమిదోసారి కైవసం చేసుకునేందుకు అడుగుదూరంలో నిలబడిం ది. గురువారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సెరెనా 6-1, 6-2తో బార్బోరా స్ట్రికోవా(చెక్‌రిపబ్లిక్)పై సునాయాసంగా గెలిచి ఫైనల్లో ప్రవేశించింది. స్ట్రికోవా కేవలం 1ఏస్ సహా 8 విన్నర్లను సాధించగా.. సెరెనా మొత్తం 4ఏస్‌లు, 28 విన్నర్లు బాది సత్తా చాటింది. 59నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి తుదిపోరుకు అర్హత సాధించింది. వింబుల్డన్ ఫైనల్ చేరడం సెరెనాకు ఇది ఓవరాల్‌గా 11వ సారి కాగా.. ఇప్పటిదాకా ఏడుసార్లు టైటిల్‌ను ముద్దాడింది. శనివారం జరిగే ఫైనల్‌లో గెలిచి.. టెన్నిస్ ఆల్‌టైం గ్రేట్ మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న మహిళల సింగిల్స్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల(24) రికార్డును సమం చేయాలని సెరెనా(23) పట్టుదలగా ఉంది.

తొలి రొమేనియన్ మహిళగా హలెప్..

మరో సెమీస్‌లో 8వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై 2018 ఫ్రెంచ్ ఓపెన్ విజేత, 7వ సీడ్ సిమోనా హలెప్ అలవోక విజయం సాధించింది. 6-1, 6-3తేడాతో గంటా 13 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి తొలిసారి వింబుల్డన్ ఫైనల్‌కు చేరింది. అలాగే ఈ ఘనత సాధించిన మొదటి రొమేనియా మహిళగా హలెప్ చరిత్ర సృష్టించింది. మ్యాచ్ మొత్తం మీద 26 విన్నర్లు సహా ప్రత్యర్థి స్వితోలినా సర్వీస్‌ను ఆమె ఐదుసార్లు బ్రేక్ చేసింది. ప్రారంభం నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఏ దశలోనూ తగ్గకుండా తొలి సెట్‌ను 6-1తో, రెండో సెట్‌ను 6-3తో కైవసం చేసుకొని హలెప్ సత్తా చాటింది. శనివారం జరిగే మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో సెరెనా విలియమ్స్, హలెప్ తలపడనున్నారు.

నేటి పురుషుల సెమీస్‌లో..
జొకోవిచ్ X బటిస్టా
ఫెదరర్ X నాదల్
సాయంత్రం 5.30 గంటల నుంచి

halep

206

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles