ఒకే రాష్ట్రం ఒకే ఓటుకు కత్తెర!


Fri,August 10, 2018 12:37 AM

-తీర్పును సవరించిన సుప్రీం కోర్టు
-కొత్త రాజ్యాంగ ముసాయిదాకుసవరణలతో ఆమోదం
-రెండు, మూడు అంశాల్లో బీసీసీఐకి ఊరట
ఎంతకూ తెగని సీరియల్ మాదిరిగా కొనసాగుతున్న జస్టిస్ లోధా సిఫారసుల అమలుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. మూడు కీలక నిబంధనలపై ఇన్నాళ్లూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చిన బీసీసీఐకి సుప్రీంకోర్టు కొద్దిగా ఉపశమనం కలిగించింది. కొత్త రాజ్యాంగ ముసాయిదాను అమలు చేయాల్సిందేనన్న అత్యున్నత ధర్మాసనం కూలింగ్ పీరియడ్, ఒక రాష్ట్రం, ఒక ఓటు వంటి అంశాలపై కొద్దిగా సడలింపులు ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ ఆగ్రహంతో ఉన్న ఆఫీస్ బేరర్లు తాజా ఉత్తర్వులపై ఎలా స్పందిస్తారో చూడాలి..!
supreme-court
న్యూఢిల్లీ: జస్టిస్ లోధా కమిటి సిఫారసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీసీసీఐకి సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. కమిటీ చేసిన కొన్ని కీలక ప్రతిపాదనలను సవరిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును కొద్దిగా మార్చింది. అలాగే పరిపాలన కమిటీ (సీవోఏ) రూపొందించిన కొత్త రాజ్యాంగ ముసాయిదాకు సవరణలతో కూడిన ఆమోదం తెలిపింది. అన్ని రాష్ట్ర సంఘాలు కొత్త రాజ్యాంగాన్ని 30 రోజుల్లోగా అమలు చేయాలని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగాన్ని అమలు చేయడంలో జాప్యం జరిగితే.. గతంలో బోర్డు నుంచి నిధులను రాకుండా చేసిన నిబంధనను మళ్లీ తెరపైకి తీసుకొస్తామని హెచ్చరించింది. లోధా కమిటీ 2015లో రూపొందించిన సిఫారసులను యధావిధిగా ఆమోదిస్తూ 18 జూలై 2016లో సుప్రీం ఆదేశాలు జారీ చేయడంతో మొదలైన సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గురువారం సుదీర్ఘంగా సాగిన విచారణలో అత్యున్నత న్యాయస్థానం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఇందులో రైల్వేస్, సర్వీసెస్, యూనివర్సిటీలకు బీసీసీఐలో ఉన్న శాశ్వాత సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించింది. బీసీసీఐ ఆఫీస్ బేరర్ల వయసు, పదవీకాలం, కూలింగ్ పీరియడ్, ఒకే రాష్ట్రం, ఒకే ఓటు వంటి నిబంధనలను కొద్దిగా సవరించింది.

ఓటు హక్కు పునురుద్ధరణ

ఒక రాష్ట్రంలో ఎన్ని సంఘాలున్నా.. ఒకే ఓటు హక్కు ఉండాలని కమిటీ చేసిన సిఫారసును ధర్మాసనం పక్కనబెట్టింది. ఫలితంగా ముంబై, సౌరాష్ట్ర, వడోదర, విదర్భకు శాశ్వత సభ్యత్వంతో పాటు ఓటు హక్కును కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ముంబై వంటి సంఘాలకు ఓటింగ్ హక్కును కల్పించి వాటి వారసత్వాన్ని కాపాడాలి. రాజ్యాంగ ముసాయిదా కూడా దీనినే ప్రతిపాదించింది. బీసీసీఐ ప్రతి అనుబంధ సంఘానికి ఓటు హక్కు ఉండాలన్న మా ప్రతిపాదనను సుప్రీం ఆమోదించింది అని సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ సంతోషం వ్యక్తం చేశారు. తాజా ఆదేశాల ప్రకారం ఆఫీస్ బేరర్లు వరుసగా రెండుసార్లు పదవులు చేపట్టే అవకాశం కలిగింది. మూడేండ్ల పదవీకాలం తర్వాత కచ్చితంగా కూలింగ్ పీరియడ్ అమలు చేయాలని లోధా చేసిన ప్రతిపాదనను సుప్రీంకోర్టు సడలించింది. ఏ వ్యక్తి అయినా రాష్ట్ర సంఘం లేదా బీసీసీఐలో వరుసగా రెండుసార్లు (6 ఏండ్లు) పదవులు చేపట్టొచ్చని ఆదేశాలు జారీ చేసింది. తర్వాత కూలింగ్ పీరియడ్ అమలు చేయాలని సూచించింది. క్రికెట్ పరిపాలన అనేది కొద్ది మంది చేతుల్లోనే ఉండకూడదంటే కచ్చితంగా ఈ నిబంధనలను అమలు చేయాల్సిందేనని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. బీసీసీఐ కొత్త రాజ్యాంగ ముసాయిదాను గుర్తించాలని తమిళనాడు రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్‌ను ఆదేశించిన సుప్రీం.. ఏమైనా ఫిర్యాదులుంటే నాలుగు వారాల్లోగా నివేదికను సమర్పించాలని సూచించింది. బీసీసీఐలో పదవులు చేపట్టే ఆఫీస్ బేరర్లకు గరిష్ట వయోపరిమితిని 70 ఏండ్లుగా నిర్దేశించింది. దీనిని దాటిన వారు బోర్డులో ఎలాంటి పదవులు చేపట్టకూడదని లోధా సిఫారసను యధాతధంగా ఉంచింది.

ఐదుగురు సెలక్టర్లు..

జట్లను ఎంపిక చేసే సెలెక్షన్ కమిటీలో ముగ్గురు మాత్రమే ఉండాలన్న లోధా సిఫారసును కూడా సుప్రీంకోర్టు సవరించింది. జాతీయస్థాయిలో మ్యాచ్‌లు ఎక్కువగా జరుగనున్న నేపథ్యంలో ఐదుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీని కొనసాగించాలని బీసీసీఐకి ఆదేశాలిచ్చింది. ప్రతి మ్యాచ్‌ను చూసి ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి రావడం, పనిభారం పెరుగడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెలువరించింది. భారత్‌లో 28 జట్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతున్నాయి. రంజీ, దేవధర్‌లాంటి తొమ్మిది ఫస్ట్‌క్లాస్ టోర్నీలు ఉన్నాయి. దేశవాళీ మ్యాచ్‌లను సెలెక్టర్లు తప్పక చూడాల్సిందే అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తామని ప్రతి సభ్యుడు వ్యక్తిగతంగా సమ్మతి ధ్రువీకరణ పత్రాన్ని 30 రోజుల్లోగా సీవోఏకు అందజేయాలని సూచించింది. దీనిపై స్టేటస్ నివేదికను కోర్టు ముందుంచాలని సీవోఏను ఆదేశించింది. రాష్ట్ర సంఘం లేదా బీసీసీఐలో పని చేస్తున్న ఆఫీస్ బేరర్.. ఇతర కమిటీల్లో ఉండరాదని స్పష్టం చేసింది. జనరల్ బాడీ, అపెక్స్ కౌన్సిల్ బీసీసీఐలో ప్రొఫెషనలిజాన్ని తీసుకురావాలని, అత్యున్నత పదవుల్లో కొనసాగే వారిని పారదర్శకంగా ఎంపిక చేయాలని చెప్పింది. ఎపెక్స్ కౌనిల్స్‌లో మొత్తం 9 మంది సభ్యులుంటారు. ఇందులో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ఓ సభ్యుడ్ని జనరల్ బాడీ ఎన్నుకుంటుంది. 70 ఏండ్లకు మించిన వారు, ప్రజా సేవకులు, బీసీసీఐ, రాష్ర్టా బాడీల్లో ఉండరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

vinod-rai

తీర్పు అద్భుతం: రాయ్

మరోవైపు సుప్రీం తాజా తీర్పును సీవోఏ చీఫ్ వినోద్ రాయ్ స్వాగతించారు. గౌరవ కోర్టు ఇచ్చిన ఆదేశాలు చాలా బాగున్నాయి. ఆఫీస్ బేరర్లు వరుసగా రెండుసార్లు పదవుల్లో కొనసాగేందుకు నాకెలాంటి అభ్యంతరం లేదు. విరామం ముందు పదవీకాలం ఆరేండ్లు ఉండాలని నేనే ప్రతిపాదించా. దీనిపై ఏకాభిప్రాయం రాకపోవడంతో ధర్మాసనం జోక్యం చేసుకున్నది. కొత్త రాజ్యాంగం అమలుకు నిర్ధిష్ట కాలపరిమితిని విధించడం గొప్ప విషయం. దీంతో ఎన్నికలకు మార్గం సుగమమైంది. కొన్ని సంఘాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం కూడా మంచి నిర్ణయం అని రాయ్ పేర్కొన్నారు. సంస్కరణలు అమలు చేసే విషయంలో సుప్రీం జారీ చేసిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ పేర్కొంది.

279

More News

VIRAL NEWS

Featured Articles