సౌరభ్ పసిడి గురి..


Fri,November 9, 2018 12:42 AM

-10మీ ఎయిర్ పిస్టల్ జూనియర్ పురుషుల విభాగంలో స్వర్ణం
- ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్స్
saurabh-chaudhary
కువైట్ సిటీ: భారత టీనేజ్ షూటర్, సౌరభ్ చౌదరి (16) ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్స్‌లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు. దాదాపు పోటీ పడిన ప్రతి టోర్నీలోనూ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ మోత మోగిస్తున్న సౌరభ్ గత కొన్ని నెలల ఫాంను కొనసాగిస్తూ మరో వ్యక్తిగత స్వర్ణం ఖాతాలో వేసుకున్నాడు. గురువారం జరిగిన ఆసియా ఎయిర్ గన్ చాంపియన్‌షిప్స్ లో భాగంగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగంలో తొలి స్థానంతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. తొలుత అర్జున్ సింగ్ చీమా, అన్మోల్ జైన్‌లతో కలిసి 1731 పాయింట్లతో టీమ్ విభాగంలో పసిడి అందుకున్నాడు. అనంతరం వ్యక్తిగత విభాగంలో 8 మందితో కలిసి ఫైనల్ చేరిన సౌరభ్ ఇక్కడా గురితప్పలేదు. ఫైనల్స్‌లో ప్రత్యర్థులపై పైచేయిని చాటుకున్నాడు. మొత్తం 239.8 పాయింట్లు స్కోర్ చేసి స్వర్ణం గెలుచుకున్నాడు. జకార్తాలో ముగిసిన ఆసియా క్రీడలతోపాటు సెప్టెంబర్‌లో జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్, యూత్ ఒలింపిక్స్‌లోనూ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణాలు కైవసం చేసుకున్నాడు. తాజాగా కువైట్ సిటీలోనూ జూనియర్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణం గెలుచుకుని కొన్ని నెలల వ్యవధిలోనే నాలుగు పసిడి పతకాలు గెలిచి అరుదైన రికార్డును దక్కించుకున్నాడు. 237.7 పాయింట్లతో భారత్‌కే చెందిన అర్జున్ రెండోస్థానంలో నిలిచి రజతం దక్కించుకోగా.. 218 పాయింట్లతో చైనీస్ తైపీకి చెందిన హుయాంగ్ వీ మూడోస్థానంతో కాంస్యం ఒడిసిపట్టాడు. అర్హత టోర్నీలో భారత షూటర్లు అదరగొట్టగా.. ఫైనల్స్‌లో అన్మోల్ 195.1పాయింట్లతో నాలుగోస్థానంలో నిలవడంతో భారత షూటింగ్ త్రయం క్లీన్‌స్వీప్ చేజారింది.

185

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles