సింధు ముందడుగు


Thu,November 14, 2019 12:13 AM

Sindhu

-తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సైనా, సాయి ప్రణీత్‌

హాంకాంగ్‌: ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు హాంకాంగ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేయగా.. ఫామ్‌లేమితో సతమతమవుతున్న సైనా నెహ్వాల్‌తో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆరో సీడ్‌ సింధు 21-15, 21-16తో వరుస గేమ్‌ల్లో కిమ్‌ గా యిన్‌ (కొరియా)పై విజయం సాధించింది. రెండో రౌండ్‌లో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)తో ఆమె తలపడనుంది. మరో మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ సైనా నెహ్వాల్‌ 13-21, 20-22తో వరుస గేమ్‌ల్లో సియా యన్‌ యన్‌ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. ఇటీవల చైనా ఓపెన్‌లోనూ యన్‌ యన్‌ చేతిలోనే సైనా తొలి రౌండ్‌లో పరాజయం పాలైంది. గత ఆరు టోర్నీల్లో ఐదింట సైనా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడం గమనార్హం. పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో సాయిప్రణీత్‌ 21-11, 18-21, 12-21 తేడాతో మూడో సీడ్‌ షీయు కీ (చైనా) చేతిలో పోరాడి ఓడగా.. పారుపల్లి కశ్యప్‌ 21-18, 16-21, 21- 10తో కెంటా నిషిమోట (జపాన్‌)పై, సౌరభ్‌ వర్మ 21-11, 21-15తో బ్రైస్‌ లివెర్‌డెజ్‌ (ఫ్రాన్స్‌)పై, హెచ్‌ ఎస్‌ ప్రణయ్‌ 21-17, 21-17తో హుయాంగ్‌ యు షియాంగ్‌ (చైనా)పై విజయాలు సాధించారు. సమీర్‌ వర్మ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగియగా.. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప ద్వయం 13-21, 12-21 తేడాతో మైకెన్‌-సారా తిగేసెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడింది. ఎన్నో అంచనాల మధ్య బరిలో దిగిన పురుషుల డబుల్స్‌ జోడీ రాంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి 21-17, 16-21, 17-21తో జపాన్‌ జోడీ తరుకో హోకీ-యుగో కోబయాషి చేతిలో ఓడి నిరాశ పరిచింది.

జనవరి 20 నుంచి పీబీఎల్‌-5

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఐదో సీజన్‌ వచ్చే ఏడాది జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 9 వరకు జరుగనుంది. అంతర్జాతీయ స్టార్లు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. చెన్నై, ఢిల్లీ, లక్నో, బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగుతాయి.

160

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles