సైనా మరోసారి


Thu,November 7, 2019 03:56 AM

saina

-తొలి రౌండ్‌లోనే నెహ్వాల్ ఓటమి
-ప్రణీత్, కశ్యప్ ముందంజ చైనా ఓపెన్

ఫిజౌ (చైనా): భారత స్టార్ షట్లర్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ స్థాయికితగ్గ ఆట ప్రదర్శించలేక మరోసారి విఫలమైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిబాట పట్టింది. బుధవారం ఇక్కడ జరిగిన పోరులో సైనా 9-21, 12-21తో అన్‌సీడెడ్ చై యన్‌యన్ (చైనా) చేతిలో కనీస పోరాటం కనబరచకుండానే పరాజయం పాలైంది. కేవలం 24 నిమిషాల్లోనే ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ప్రారంభం నుంచి తడబడిన సైనా.. 0-3తో వెనుకబడి ఒక్కసారి కూడా ప్రత్యర్థి పాయింట్ల దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. రెండో గేమ్ ప్రారంభంలో 3-3తో నిలిచినా ఆ తర్వాత చైనా ప్లేయర్‌కు సైనా పోటీ ఇవ్వలేకపోయింది. ఓ దశలో వరుసగా ఎనిమిది పాయింట్లు సమర్పించుకొని పోరాటం లేకుండానే వరుస గేమ్‌ల్లో ఓడి వెనుదిరిగింది. గత నెల జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్స్ వరకు వెళ్లిన నెహ్వాల్.. అంతకు ముందు జరిగిన మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైంది.
kashyap
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో... సైనా భర్త, వ్యక్తిగత కోచ్ పారుపల్లి కశ్యప్ 21-14, 21-13తో సితికోమ్ తమాసిన్ (థాయ్‌లాండ్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ 15-21, 21-12, 21-10తో టామీ సుగియత్రో (ఇండోనేషియా)పై విజయం సాధించి ముందడుగేశాడు. ప్రిక్వార్టర్స్‌లో నాలుగోసీడ్ అంటోసెన్ (డెన్మార్క్)తో అతడు తలపడనున్నాడు. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కిరెడ్డి జంట 14-21, 14-21తో చైనీస్ తైపీ ద్వయం వాంగ్ చిలిన్ - చెంగ్ చియా చేతిలో పరాజయం చెందింది. రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లిన్‌డాన్ (చైనా) 21-19, 12-21, 12-21 తేడాతో తన దేశానికే చెందిన చెన్ లాంగ్ చేతిలో ఓడి, టోక్యో ఒలింపిక్స్ అర్హతను సంక్లిష్టం చేసుకున్నాడు.

341

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles