సైనా సూపర్


Sun,February 17, 2019 02:28 AM

-నాల్గోసారి జాతీయ చాంపియన్‌షిప్ కైవసం
ఫైనల్లో సింధుపై గెలుపు లక్ష్యసేన్‌కు రన్నరప్

ఆటలో ఎవరికి వారే సాటి.. పరాయి ప్రత్యర్థిని పడగొట్టడంలోనూ ఇద్దరు దిట్టలే..కానీ పరస్పరం తలపడినప్పుడు మాత్రం సింధు ఆధిక్యానికి సైనా గండికొడుతూనే ఉంది. తాజాగా జరిగిన సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోనూ తెలుగమ్మాయిపై మరోసారి ఆధిపత్యాన్ని చూపెట్టిన సైనా.. నాల్గోసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఈ ఏడాది అటు అంతర్జాతీయ, ఇటు జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించిన సైనా.. ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి ముందు కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. మరోవైపు రన్నరప్‌తో రిపెట్టుకున్నా.. మైదానంలో సింధు చూపిన తెగువ ఆకట్టుకుంది. ఇక పురుషుల సింగిల్స్‌లో యువ ఆటగాడు లక్ష్యసేన్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
saina-sindhu
గువాహటి: బలమైన స్మాష్‌లు, సుదీర్ఘమైన ర్యాలీలతో చెలరేగిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్.. నాల్గోసారి జాతీయ చాంపియన్‌షిప్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సైనా 21-18, 21-15తో టాప్‌సీడ్ సింధుపై గెలిచింది. సైనా గతంలో 2006, 2007,2018లో విజేతగా నిలిచింది. నాగ్‌పూర్‌లో జరిగిన టైటిల్ పోరులో, గతేడాది గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ ఫైనల్లోనూ సింధుపై చూపెట్టిన ఆధిపత్యాన్ని సైనా మరోసారి పునరావృతం చేసింది. 2017లో జరిగిన ఇండియా ఓపెన్ ఫైనల్లో మాత్రం సైనా.. సింధు చేతిలో ఓడింది. విజేతగా నిలిచిన సైనాకు రూ. 3.25 లక్షలు, రన్నరప్ సింధుకు రూ. 1.70 లక్షల ప్రైజ్‌మనీ లభించాయి.

జోరే.. జోరు

44 నిమిషాల పాటు జరిగిన మహిళల టైటిల్ పోరులో సైనా తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించగా, సింధు స్ట్రోక్స్‌లో పదును తగ్గింది. చాలా రిటర్న్స్‌ను కోర్టు మధ్యలోకి కొట్టి సైనా పని సులువు చేసింది. అలాగే బ్యాక్‌లైన్ షాట్స్‌ను సరిగా అంచనా వేయలేకపోయింది. ఆరంభంలో అనవసర తప్పిదాలు చేసిన సైనా 3-4తో వెనుకబడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న సింధు చకచకా పాయింట్లతో 7-5 ఆధిక్యంలోకి వెళ్లినా ఆ తర్వాత కొట్టిన కొన్ని షాట్లు వైడ్‌గా వెళ్లడంతో సైనా 10-11తో దూసుకొచ్చింది. రిటర్న్స్‌లో పదేపదే తప్పిదాలు చేసి సింధు బ్రేక్ వరకు 11-15తో వెనుకబడింది. ఈ దశలో సింధు కొట్టిన సూపర్ క్రాస్‌కు రెండు పాయింట్లు వచ్చినా.. అవతలి వైపు సైనా పట్టు వదలకుండా పోరాడి 18-15తో నిలిచింది. ఈ దశలో లైట్లలో సమస్య వల్ల కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత సింధు స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో సైనా ఆధిక్యాన్ని కాస్త తగ్గించింది. అయినా బలమైన ర్యాలీలతో హడలెత్తించిన సైనా వరుసగా మూడు మ్యాచ్ పాయింట్లతో గేమ్‌ను చేజిక్కించుకుంది.
saurabh

అవకాశాలు వృథా..

రెండో గేమ్‌ను కసిగా మొదలుపెట్టిన సింధు 3-3, 5-5తో స్కోరును సమం చేసింది. కానీ ప్రత్యర్థి షాట్లలో కచ్చితత్వం లోపించడం, రిటర్న్స్ పదేపదే వైడ్‌గా వెళ్లడంతో పుంజుకున్న సైనా 11-9 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కడి నుంచి స్కోరును సమం చేసేందుకు సింధు క్రాస్ కోర్టు స్మాష్‌లు, విన్నర్ల వైపు మొగ్గింది. కానీ సైనా తెలివిగా నెట్ వద్ద డ్రాప్ షాట్స్ వేస్తూ ఆధిక్యాన్ని కాపాడుకుంది. సైనా కొట్టిన బ్యాక్‌లైన్ షాట్లను సింధు సరిగా అంచనా వేయలేక వరుసగా పాయింట్లు సమర్పించుకుంది. దీంతో పెద్దగా ప్రతిఘటన లేకుండా సైనా గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్‌లో శిఖా గౌతమ్-అశ్విని భట్ 21-16, 22-20తో మేఘన-పూర్విషాపై గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
doubles

సౌరభ్ హ్యాట్రిక్

పురుషుల సింగిల్స్‌లో మధ్యప్రదేశ్ ప్లేయర్ సౌరభ్ వర్మ హ్యాట్రిక్ టైటిల్స్‌ను సాధించాడు. ఫైనల్లో సౌరభ్ 21-18, 21-13తో లక్ష్యసేన్‌పై గెలిచాడు. 2011, 2017లో సౌరభ్ విజేతగా నిలిచాడు. 44 నిమిషాల ఏకపక్ష పోరు లో 17 ఏండ్ల లక్ష్యసేన్ శక్తి మేరకు శ్రమించి నా.. అనుభవరాహిత్యం వెంటాడింది. తొలి గేమ్‌లో 6-6, 15-15 వద్ద స్కోరు సమం చేసినా.. ఆ తర్వాత గాడి తప్పాడు. ఈ దశలో సౌరభ్ వరుసగా మూడు పాయింట్లు నెగ్గినా.. లక్ష్యసేన్ ఒక్కో పాయింట్‌కే పరిమితమయ్యాడు. రెండో గేమ్‌లో సౌరభ్ దూకుడు పెంచడంతో లక్ష్యసేన్ 4-4, 7-7తో స్కోరు సమం చేసి వెనుకబడ్డాడు. 8-7 స్కోరు వద్ద సౌరభ్ వరుసగా ఐదు పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత ఒకటి, రెండు నెగ్గినా.. చివర్లో మళ్లీ వరుస పాయింట్లతో హోరెత్తించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను ప్రణవ్ చోప్రా-చిరాగ్ శెట్టి గెలుచుకున్నారు. ఫైనల్లో ఈ ఇద్దరు 21-13, 22-20తో అర్జున్-రామచంద్రన్‌పై నెగ్గారు. మిక్స్‌డ్‌లో మను అత్రి-మనీషా 18-21, 21-17, 21-16తో రోహన్ కపూర్-కుహు గార్గ్‌పై గెలిచి టైటిల్ విజేతగా నిలిచారు.

480

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles