ఇటు ఆనందం అటు కన్నీటి బాష్పాలు


Mon,July 9, 2018 03:59 AM

నవ్వినా..ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి.. ఫిపా ప్రపంచకప్‌లో ఓటమితోఆతిథ్య రష్యా విలపించగా..విజయంతో క్రొయేషియా ఆనందబాష్పాలు రాల్చింది. అసమాన పోరాటంతో రష్యా ..పట్టువిడువని క్రొయేషియా జట్ల మధ్య మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠను కలిగించి మునివేళ్లపై నిలబెట్టింది.. ప్రథమార్థంలో 1-1.. రెండో అర్ధభాగంలో స్కోరు చేయడంలో విఫలం..అదనపు సమయంలో చెరో గోల్ నమోదుతో 2-2తో మళ్లీ స్కోర్లు సమం.. పలు నాటకీయ పరిణాలు చోటు చేసుకున్న ఈ మ్యాచ్ ఫలితం చివరకు షౌటౌట్‌లో తేలింది. ఒత్తిడి తట్టుకుని షౌటౌట్‌లో రష్యా పోరాటానికి తెర దించుతూ విజయంతో క్రొయేషియా
సెమీస్ చేరగా.. రష్యా క్వార్టర్‌ఫైనల్ చేరిన ఆనందంతో టోర్నీ నుంచి వైదొలిగింది..

AFP
సోచి, జూలై 8: విజయం కోసం మ్యాచ్ చివరివరకూ హోరాహోరీ పోరాటం చేసినా రష్యా జట్టుకు నిరాశ తప్పలేదు. క్రొయేషియాతో జరిగిన క్వార్టర్‌ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో 3-4 గోల్స్‌తో ఓటమిపాలైన రష్యా..టోర్నీ నుంచి నిష్క్రమించింది. నిర్ణీత సమయంలో 1-1 గోల్స్‌తో రెండు జట్లూ సమవుజ్జీలుగా నిలువగా.. అదనపు సమయంలోనూ చెరోగోల్ కొట్టి 2-2తో స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది..శనివారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా రెండుజట్లు విజయం కోసం కొదమసింహాల్లా తలపడ్డాయి.. 1998 అరంగేట్రంలోనే ఫిఫా ప్రపంచకప్ సెమీస్ చేరిన క్రొయేషియా అద్భుత పోరాటంతో రష్యాను నిలువరించేందుకు ప్రయత్నించింది. మరోవైపు పోరాడితే పోయేదేమీ లేదన్నట్లుగా సొంత ప్రేక్షకుల మద్దతుతో రష్యా జట్టు ..క్రొయేషియాను వణికించింది.

అప్పట్లో సోవియట్ యూనియన్ జట్టుగా బరిలోకి దిగిన 1970లో క్వార్టర్ ఫైనల్ చేరగా..మళ్లీ ఇన్నేండ్లకు సొంతగడ్డపై క్వార్టర్స్ చేరిన రష్యా పోరాటంతో ఫ్యాన్స్ మనసులు గెలిచింది. తనకన్నా ఎన్నో రెట్లు మెరుగైన ప్రతర్థి అయినా తొలిగోల్ మాత్రం రష్యానే కొట్టడం విశేషంస్టార్ మిడ్‌ఫీల్డర్ డెనిస్ చెర్షెవ్ ఆట 31వ నిమిషంలో గోల్‌తో రష్యాకు 1-0 ఆధిక్యం అందుకుంది. చెర్షెవ్‌కు ఈ టోర్నీలో ఇది నాలుగో గోల్. కానీ ఈ ఆనందం వారికి ఎంతోసేపు నిలవలేదు. 39వ నిమిషంలో ఫార్వర్డ్ ఆటగాడు ఆండ్రెజ్ క్రామరిక్ గోల్ కొట్టడంతో క్రొయేషియా జట్టు 1-1తో స్కోరు సమం చేసింది. ప్రథమార్ధంలో ఇరుజట్లూ మరో గోల్ కొట్టకపోవడంతో 1-1తో బ్రేక్ తీసుకున్నాయి..
AFPJN

క్రొయేషియాదే విజయం..

ద్వితీయార్థంలో రెండు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడటంతో మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది. రష్యా గోల్‌పోస్ట్‌పై క్రొయేషియన్లు పదేపదే దాడులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇరు జట్లు ఒక్కగోల్ కూడా సాధించకపోవడంతో మ్యాచ్ అదనపు సమయానికి వెళ్లింది.. అదనపు సమయం (101వ నిమిషంలో) క్రొయేషియా డిఫెండర్ డొమగొజ్ విడా అద్భుతమైన గోల్ సాధించి తమ జట్టుకు 2-1తో ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం బంతిని నియంత్రణలోకి తీసుకున్నక్రొయేషియన్లు చాలాసేపు రష్యాకు గోల్ కొట్టే అవకాశం ఇవ్వకుండా ప్రతిఘటించారు. మరో పదిహేను నిమిషాల తర్వాత రష్యా డిఫెండర్ మారియో ఫెర్నాండెజ్ 115వ నిమిషంలో ఫ్రీకిక్ అవకాశాన్ని హెడర్ ద్వారా గోల్‌పోస్టులోకి పంపడంతో స్కోరు 2-2 గోల్స్‌తో ఇరుజట్ల స్కోర్లు సమమయ్యాయి.
Danijel-Suba
దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించాల్సి వచ్చింది. అయితే పెనాల్టీ షూటౌట్‌లో స్పాట్‌కిక్స్‌ను గోల్స్‌గా మలచడంలో మారియో ఫెర్నాండెజ్‌తోపాటు రష్యాకు చెందిన మరో ఆటగాడు ఫెదొర్ స్మొలొవ్ కూడా విఫలమయ్యాడు. దీంతో క్రొయేషియా జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ప్రపంచకప్ సాకర్ టోర్నీలో క్రొయేషియా సెమీస్‌కు చేరడం 1998 తర్వాత ఇదే తొలిసారి. ఫైనల్‌లో స్థానం కోసం క్రొయేషియా జట్టు మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో బుధవారం ఇంగ్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నది.

543

More News

VIRAL NEWS