బట్లర్.. బాదేశాడు!


Sun,April 14, 2019 03:05 AM

-ముంబైకి చెక్ పెట్టిన రాజస్థాన్
-4 వికెట్ల తేడాతో రాయల్స్ విజయం
-డికాక్ పోరాటం వృథా

188 పరుగుల లక్ష్యం.. ఓ రకంగా చెప్పాలంటే ముంబై బౌలర్ల ముందు రాజస్థాన్‌కు ఇది చాలా పెద్ద లక్ష్యం. బంతికో ఫోర్ బాదే పవర్ హిట్టర్లు లేరు.. వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తే సూపర్ రన్నర్లూ లేరు. అసలు సిసలైన ఆల్‌రౌండర్లు అందుబాటులో లేరు. ఇన్ని బలహీనతల మధ్య.. ఏ రకంగా చూసినా.. ఏ క్షణమైనా ఫలితం తారుమారయ్యే పరిస్థితుల నడుమ బట్లర్ (43 బంతుల్లో 89; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) ముంబై పాలిట హిట్లర్‌గా మారాడు. ఆర్చర్ వేసిన ఓ ఓవర్‌లో 28 పరుగులు రాబట్టి విధ్వంసానికి పరాకాష్టగా మారాడు. ఓవరాల్‌గా కొండంత లక్ష్యాన్ని మంచులా కరిగించి రాజస్థాన్‌కు రెండో విజయాని అందించాడు.
Jos-Buttler
ముంబై: చివరి ఓవర్ వరకు ఉత్కంఠ ఊపేసిన మ్యాచ్‌లో రాజస్థాన్ సమిష్టిగా చెలరేగింది. పటిష్ఠమైన ముంబై బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ వీరోచిత విజయాన్ని అందుకుంది. లక్ష్య ఛేదనలో బట్లర్ ఊచకోత కోయడంతో.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో ముంబైకి చెక్ పెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ (32 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్), డికాక్ (52 బంతుల్లో 81; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. 11వ ఓవర్‌లో రోహిత్ ఔటైన తర్వాత ఇన్నింగ్స్ కాస్త గాడి తప్పింది. స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ (16), పొలార్డ్ (6) వెనుదిరిగారు. అయితే డికాక్ స్థిరంగా ఆడటంతో ముంబై రన్‌రేట్ ఎక్కడా తగ్గలేదు. హార్దిక్ పాండ్యా (11 బంతుల్లో 28 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) స్పిన్నర్లను లక్ష్యంగా చేసుకుని భారీ సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. ఈ ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 27 పరుగులు జత చేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది.

భయపెట్టిన బట్లర్...

188 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రహానే (21 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్) ఓ మాదిరిగా ఆడినా.. బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్‌తో ఖాతా తెరిచిన అతను.. నీళ్లు తాగినంత సులువుగా సిక్సర్ల జడివాన కురిపించాడు. రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు, తర్వాతి ఓవర్‌లో సిక్స్, ఫోర్ బాదాడు. సహచరుడిని చూసి స్ఫూర్తి చెందిన రహానే.. ఐదో ఓవర్‌లో 4, 6, 4తో 17 పరుగులు పిండుకున్నా డు. తర్వాతి ఓవర్ లో చెరో ఫోర్ బాదడంతో పవర్‌ప్లేలో రాజస్థాన్ 59 పరుగులు చేసింది. కానీ ఏడో ఓవర్ తొలి బంతికి రహానే ఎల్బీగా వెనుదిరగడంతో తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అప్పటివరకు కాస్త సం యమనంతో ఆడిన బట్లర్ ఒక్కసారిగా శివాలెత్తాడు. 8 బంతుల్లో 4 సిక్సర్లు కొట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. శామ్సన్ (31) నిలకడగా ఆడినా.. బట్లర్ 13వ ఓవర్‌లో మ్యాచ్ మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆర్చర్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ వరుసగా 6, 4, 4, 4, 4, 6తో 28 పరుగులు రాబట్టాడు. అదే ఊపులో మరో షాట్‌కు ప్రయత్నించి తర్వాతి ఓవర్‌లో చాహర్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. బట్లర్, శామ్సన్ మధ్య రెండో వికెట్‌కు 87 పరుగులు జతయ్యాయి.

de-Kock
స్మిత్ (12) ఓ మాదిరిగా ఆడటంతో 16 ఓవర్లు ముగిసేరికి స్కోరు 168/2కు చేరింది. రాజస్థాన్ విజయం నల్లేరు మీద నడకే అనుకుంటున్న తరుణంలో ముంబై బౌలర్లు చెలరేగిపోయారు. 8 బంతుల తేడాలో శామ్సన్, త్రిపాఠి (1), లివింగ్‌స్టోన్ (1) ఔట్ చేసి ఉత్కంఠ తీసుకొచ్చారు. గెలువాలంటే 12 బంతుల్లో 14 పరుగులు కావాలి. ఆశ పెట్టుకున్న స్మిత్.. 19వ ఓవర్ తొలి బంతికే వెనుదిరగడంతో విజయం ముంబై వైపు మొగ్గింది. క్రీజులో ఉన్న గోపాల్ (13 నాటౌట్).. ఆరో బంతికి ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ ఇషాన్ కిషన్ మిస్ చేశాడు. ఈ ఓవర్‌లో బుమ్రా 8 పరుగులు ఇవ్వడంతో విజయసమీకరణ 6 బంతుల్లో 6 పరుగులుగా మారింది. అప్పటికీ ముంబైపైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ హార్దిక్ వేసిన ఆఖరి ఓవర్‌లో గోపాల్ ఓ ఫోర్ కొట్టడంతో రాజస్థాన్ ఆనందంలో మునిగిపోగా, ముంబై నిరాశగా వెనుదిరిగింది.

ముంబై @ 200

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టీ20 చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (200) ఆడిన జట్టుగా రికార్డు సృష్టించింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో ఈ ఫీట్‌ను సాధించింది. ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్‌లో సోమర్‌సెట్ (199) పేరిట ఉన్న రికార్డును అధిగమించింది. హాంప్‌షైర్ (194), రాయల్ చాలెంజర్స్ (188), ససెక్స్, కోల్‌కతా (187) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

స్కోరు బోర్డు

ముంబై ఇండియన్స్: రోహిత్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 47, డికాక్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 81, సూర్యకుమార్ (బి) కులకర్ణి 16, పొలార్డ్ (బి) గోపాల్ (బి) ఆర్చర్ 6, హార్దిక్ నాటౌట్ 28, ఇషాన్ (సి) బట్లర్ (బి) ఉనాద్కట్ 5, కృనాల్ నాటౌట్ 0,
ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 20 ఓవర్లలో 187/5. వికెట్లపతనం: 1-96, 2-117, 3-136, 4-163, 5-175.
బౌలింగ్: గౌతమ్ 3-0-39-0, కులకర్ణి 4-0-38-1, ఆర్చర్ 4-0-39-3, ఉనాద్కట్ 4-0-36-1, గోపాల్ 4-0-21-0, లివింగ్‌స్టోన్ 1-0-13-0.

రాజస్థాన్ రాయల్స్: రహానే (సి) యాదవ్ (బి) కృనాల్ 37, బట్లర్ (సి) యాదవ్ (బి) చాహర్ 89, శామ్సన్ ఎల్బీ (బి) బుమ్రా 31, స్మిత్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 12, త్రిపాఠి (సి) హార్దిక్ (బి) కృనాల్ 1, లివింగ్‌స్టోన్ (బి) కృనాల్ 1, గోపాల్ నాటౌట్ 13, గౌతమ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 19.3 ఓవర్లలో 188/6.
వికెట్లపతనం: 1-60, 2-147, 3-170, 4-171, 5-174, 6-174.
బౌలింగ్: బెహ్రెన్‌డార్ఫ్ 3-0-31-0, జోసెఫ్ 3-0-53-0, చాహర్ 4-0-34-1, బుమ్రా 4-0-23-2, కృనాల్ 4-0-34-3, హార్దిక్ 1.3-0-11-0.

293

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles