మళ్లీ హిట్


Sun,January 13, 2019 02:35 AM

Rohit
టీమ్ ఇండియాలో రోహిత్‌శర్మ ప్రత్యేకం.. హిట్‌మ్యాన్ అంటూ అభిమానులంతా ముద్దుగా పిలుచుకునే సొగసరి ఓపెనర్ పొట్టి ఫార్మాట్‌లో ఎదురులేని బ్యాట్స్‌మన్.. క్రీజులో కుదురుకున్నాడంటే విలయం.. సిక్సర్లు బాదడం ఇంత తేలికా.. బౌండరీలు కొట్టడం ఇంత సులువా అనిపించేలా అతని షాట్లు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.. క్రీజులో కుదురుకుంటే చాలు.. అతని చేతిలోని బ్యాట్ మంత్రదండాన్ని తలపిస్తూ పరుగుల ప్రవాహాన్ని సృష్టిస్తుంది.. వేదిక ఏదైనా..పిచ్ ఎలాంటిదైనా .. బౌలర్ ఎవరైనా సరే అతని ముందు బలాదూరే! 2015 నుంచి ప్రతి ఏడాది భారత్ తరఫున తొలి వన్డే సెంచరీ అతనిదే.. నాలుగేండ్ల ఆనవాయితీని కొనసాగిస్తూ.. ఈ ఏడాదీ వన్డే ఫార్మాట్‌లో టీమ్ ఇండియా తరఫున తొలిసెంచరీ నమోదు చేశాడు.. ఆస్ట్రేలియా గడ్డపై నాలుగు వన్డే శతకాలు సాధించిన తొలి విదేశీ ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

సిడ్నీ క్రికెట్ మైదానంలో రోహిత్ శర్మ మరోమారు చెలరేగాడు. సిడ్నీ మైదానంలో రికార్డులు బద్దలు కొడుతూ ఫైటింగ్ సెంచరీతో అభిమానులను అలరించాడు. భారీ సెంచరీతో కడదాకా శ్రమించినా తొలివన్డేలో భారత్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయినా..అసమాన పోరాటంతో హిట్‌మ్యాన్ ఆకట్టుకోవడం అభినందనీయం.. క్రీజులో కుదరుకోకముందే టాపార్డర్ వికెట్లు టపాటపా రాలాయి. 4 పరుగులకు 3 వికెట్లు..ఈ దశలో ధోనీ అండగా అతను మెల్లిగా తన పని మొదలు పెట్టాడు. 18వ బంతికి సిక్సర్‌తో పరుగుల ఖాతా తెరిచాడు. మెల్లిగా ఆడుతూ క్రమంగా జోరు పెంచాడు. ఒకవైపు ఆస్ట్రేలియా బౌలర్లు లైన్ తప్పకుండా బంతులేస్తున్నా సహనం కోల్పోలేదు.. సాధికారితతో కూడిన బ్యాటింగ్..నియంత్రణతో కూడిన షాట్లు.. ఎక్కడా తడబాటు కానరాలేదు.. టీమ్ ఇండియాను దెబ్బతీసిన బెహెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో కొట్టిన స్కూప్ షాట్ అద్భుతం.. ఆఫ్‌స్టంప్ లోగిలో పడిన బంతిని అలా ముందుకు వంగి కీపర్ వెనుకగా షాట్ ఆడాడు..

అంతేకాదు స్టొయినిస్ బౌలింగ్‌లో బౌన్సర్‌ను పుల్ షాట్‌తో ప్రేక్షకుల్లో పడేయగా..లియాన్ బౌలింగ్‌లో క్రీజుదాటి ముందుకు వచ్చి ఆడిన భారీషాట్ 98 మీటర్ల దూరం దూసుకెళ్లింది. కళాత్మక షాట్లు.. అద్భుతమైన డ్రైవ్‌లు.. కళ్లుచెదిరే ఫ్లిక్ షాట్లు.. ఒత్తిడిలోనూ అతను ఆడిన తీరుతో అతని సత్తా ఏంటో తెలిపింది. 110 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. ఒకవైపు వికెట్లు పడుతున్నా..అండగా నిలిచేవారు కరువైనా పోరాటాన్ని కొనసాగించాడు. ఈ సెంచరీతో రోహిత్ పలు కొత్త రికార్డులను నమోదు చేశాడు. సిడ్నీ వన్డేలో చేసిన 133 పరుగులతో వన్డేల్లో అత్యధికంగా 125+స్కోర్లు చేసిన బ్యాట్స్‌మన్‌గా సచిన్ (19) తర్వాతి స్థానంలో నిలిచాడు. రోహిత్ 14 సార్లు చేయగా కోహ్లీ(13), జయసూర్య(10), క్రిస్‌గేల్(10) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

రిచర్డ్స్ రికార్డ్ బ్రేక్

సిడ్నీ వన్డే సెంచరీతో రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు నమోదు చేశాడు. వన్డేల్లో ఆసీస్ గడ్డపై నాలుగు సెంచరీలు నమోదు చేసిన తొలి విదేశీ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్(3సెంచరీలు) పేరిట ఉండేది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసీస్ గడ్డపై రెండు సెంచరీలు సాధించాడు. ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు (70 ఇన్నింగ్స్)సాధించిన మాస్టర్ సచిన్ అత్యధిక సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా తొలిస్థానంలో నిలవగా.. 7సెంచరీలతో (29ఇన్నింగ్స్) రోహిత్ రెండోస్థానంలో కొనసాగుతున్నాడు.

సెంచరీ చేస్తే ఓటమే!

ఆసీస్ గడ్డపై రోహిత్‌శర్మ సెంచరీ చేస్తే మ్యాచ్ ఓడిపోయినట్లే.. ఇదే సెంటిమెంట్ సిడ్నీ వన్డేలోనూ కొనసాగడం విశేషం. అద్భుత బ్యాటింగ్‌తో రోహిత్‌శర్మ నాలుగు సెంచరీలు చేసినా.. ప్రతి మ్యాచ్‌లోనూ భారత్ ఓడడం గమనార్హం.. దీంతో ఈ విషయాన్ని సామాజికమాధ్యమాల్లో సరదాగా అభిమానులు షేర్ చేస్తున్నారు..

1 అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 1000 విజయాలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. 1877లో ఇంగ్లండ్‌పై
టెస్ట్ గెలిచిన ఆసీస్..తాజాగా సిడ్నీలో భారత్‌పై 1000వ విజయాన్ని అందుకుంది.
Rohit1

409

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles