ట్రిపుల్ డబుల్


Thu,December 14, 2017 01:19 AM

-రోహిత్‌శర్మ మూడో ద్విశతకం ..
-లంకపై రెండోది
-రెండో వన్డేలో భారత్ ఘన విజయం

వంద మంది చేస్తే యుద్ధం.. అదే ఒక్కడు చేస్తే అద్భుతం. శతకం కొడితే పోరాటం.. అదే ద్విశతకం బాదితే మహాద్భుతం..! ఇలాంటి మహాద్భుతాలు.. మూడు! శత్రువులతో పోరాడేవాడు సైనికుడు.. ఎదురెళ్లి యుద్ధం చేసే వాడు సాహసికుడు. కానీ.. ఈ ఇద్దర్నీ మించిన యోధుడు మన రోహితుడు. ఒకర్ని ఒకసారి కొట్టడం గెలుపు, అదే ఒకర్ని రెండుసార్లు కొట్టడం దండయాత్ర. లంకపై నీవు సాగించిన ఈ ద్విశతక దండయాత్ర అజరామరం! ఓటమి వైఫల్యాన్ని చూపెట్టిన వేళ.. ప్రతీకారం పోరాటాన్ని నేర్పిన క్షణం. ఆత్మవిశ్వాసం స్ఫూర్తినిచ్చిన సమయం. గెలుపు సందేహం దోబుచూలాడుతున్న తరుణంలో.. సెలయేరులా మొదలైంది.. నీ ఆట. ఏరులా పారింది...బౌండరీల మోత వరదలా సాగింది.. పరుగుల వేట ఉప్పెనలా ముంచెత్తింది..సిక్సర్ల జాతర. అందుకే..మొహాలీ గడ్డపై చేసిన ట్రిపుల్ డబుల్ విన్యాసం చిరస్మరణీయం. లంక బౌలర్లను చీల్చిచెండాడుతూ సాగిన నీ ఆట మాటలకందని అద్భుతం. రికార్డు డబుల్ సెంచరీతో భారత్‌కు భారీ స్కోరు కట్టబెట్టావు. ధర్మశాల పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటూ ప్రత్యర్థి లంకను చిత్తుచిత్తుగా ఓడించి సిరీస్‌లో నిలబెట్టావు. బ్యాటింగ్‌లోనే కాదు నాయకునిగా ముందుండి నడిపించి ఔరా అనిపించావు..హ్యాట్సాఫ్ రోహిత్‌శర్మ.
rohith-sharma
మొహాలీ: సిరీస్‌లో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో భారత్ జూలు విదిలిచ్చింది. ధర్మశాల ఓటమి మిగిల్చిన కసిని కడుపులో నింపుకున్న టీమ్‌ఇండియా.. మొహాలీలో శ్రీలంకను చెడుగుడు ఆడుకుంది. తాము మనస్సు పెట్టి ఆడితే ప్రపంచంలో ఏ జట్టు తమకు ఎదురురాదు అన్న రీతిలో మనోళ్లు చెలరేగిన తీరుకు లంకేయులు తోకముడిచారు. అన్నింటా ఆధిపత్యం ప్రదర్శించిన రెండో వన్డేలో భారత్ 141 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ప్రత్యర్థి లంకకు టాస్ కోల్పోయి బ్యాటింగ్‌కు దిగిన భారత్..కెప్టెన్ రోహిత్‌శర్మ(153 బంతుల్లో 208నాటౌట్, 13 ఫోర్లు, 12సిక్స్‌లు) ద్విశతకంతో నిర్ణీత 50 ఓవర్లలో 392/4 భారీ స్కోరు సాధించింది. రోహిత్‌కు తోడు ధవన్(68), శ్రేయాస్ అయ్యర్(88) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. పెరెర(3/80) మూడు వికెట్లు పడగొట్టాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన లంక 50 ఓవర్లలో 251/8 స్కోరుకే పరిమితమైంది. మాథ్యూస్(132 బంతుల్లో 111 నాటౌట్, 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. చాహల్(3/60) మూడు వికెట్లతో విజృంభించగా, బుమ్రా (2/43), భువనేశ్వర్(1/40), హార్దిక్(1/39), సుందర్(1/65) రాణించారు. డబుల్ సెంచరీతో మ్యాచ్‌ను ఏకపక్షం చేసిన రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఈనెల 17న విశాఖపట్నంలో జరుగుతుంది.
dhawan

ఆచితూచి ఆడుతూ:

టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ తిసార పెరెర..భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ధర్మశాల తరహాలో పిచ్‌పై తేమ పరిస్థితులను సద్వినియోగం చేసుకుందామనుకున్న లంక ఆశలు నెరవేరలేదు. తొలి పవర్‌ప్లే 10 ఓవర్లపాటు లంక బౌలర్లను ఓపెనర్లు ధవన్, రోహిత్ ఆచితూచి ఆడారు. దీంతో వికెట్ కోల్పోకుండా 33 పరుగులకే పరిమితమైంది. ఇక్కణ్నుంచి ధవన్ గేర్ మార్చాడు. తన సహజశైలిలో లంక బౌలింగ్‌ను ఆడుకున్నాడు. నువాన్ ప్రదీప్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో వరుస బౌండరీలతో హోరెత్తించాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. మరోవైపు రోహిత్ తొలుత నెమ్మదిగా ఆడినా..ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పాడు. ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న దశలో పతిరన బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన ధవన్..తిరిమాన్నెకు చిక్కడంతో 115 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
iyer

రోహిత్ వీరవీహారం:

రోహిత్‌శర్మకు శ్రేయాస్ అయ్యర్ జతకలువడంతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. మొదట వీరిద్దరు ైస్ట్రెక్ రొటేట్ చేసుకుంటూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశారు. తొలి వన్డేలో విఫలమైన అయ్యర్..సాధికారిక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఇదే అదనుగా అయ్యర్‌ను అండగా చేసుకున్న రోహిత్..లంక బౌలర్లను లక్ష్యంగా చేసుకున్నాడు. ఎదురైన బౌలర్‌ను దునుమాడుతూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 115 బంతుల్లో తన కెరీర్‌లో 16వ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ తర్వాత రోహిత్‌ను ఆపడం లంక కెప్టెన్‌కు తలకు మించిన భారమైంది. బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకుండా పోయింది. లక్మల్ వేసిన ఇన్నింగ్స్ 44వ ఓవర్లో రోహిత్ నాలుగు భారీ సిక్స్‌లతో 26 పరుగులు పిండుకున్నాడు. దీంతో స్కోరు అమాంతం 300లకు చేరుకుంది. ఇక్కడి నుంచి రోహిత్..హిట్‌మ్యాన్ తరహాలో బౌండరీల వర్షం కురిపించాడు. దొరికిన బౌలర్‌ను దొరికినట్లు..కుమ్మేశాడు. ఓ వైపు అయ్యర్, ధోనీ(7) ఔటైనా తన జోరు మాత్రం ఈ ముంబైకర్ ఆపలేదు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ తొలి బంతినే సిక్స్‌గా మలిచిన శర్మ..మూడో బంతికి డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఇదే ఓవర్ చివరి బంతికి హార్దిక్(8) ఔటయ్యాడు. మొత్తమ్మీద రోహిత్‌శర్మ బ్యాటింగ్ మోతతో ఆఖరి 10 ఓవరల్లో 147 పరుగులు జతకలిశాయి.
double-centuries

మాథ్యూస్ పోరాటం వృథా:

భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యఛేదనకు కోసం బరిలోకి దిగిన లంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 15 పరుగులకే ఓపెనర్ ఉపుల్ తరంగ(7) వికెట్‌ను హార్దిక్ పాండ్యా పడగొట్టి ఖాతా తెరిచాడు. ఇక్కణ్నుంచి ఏ ఒక్కరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. ఓ వైపు సీనియర్ మాథ్యూస్ అజేయ సెంచరీతో ఆఖరి దాకా క్రీజులో నిలిచిన లాభం లేకపోయింది. మిగతా వారి నుంచి సహకారం కరువవడంతో మాథ్యూస్ సెంచరీ ఒంటరి పోరాటం వృథా అయ్యింది. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో చాహల్ లంక పతనంలో కీలకంగా వ్యవహరించగా, బుమ్రా రెండు వికెట్లు తీశాడు.
rohith-couple

శ్రీమతి డబుల్ బహుమతి..

టీమ్‌ఇండియా సొగసరి బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మ తన భార్య రితికాకు జీవితాంతం గుర్తుండిపోయే కానుకను అందించాడు. దిగ్గజాలెందరికో అనితర సాధ్యమైన వన్డేల్లో డబుల్ సెంచరీ రికార్డును ముచ్చటగా మూడోసారి అందుకున్న రోహిత్ మొహాలీలో అద్భుత ఫీట్‌ను ఆవిష్కరించాడు. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల సునామీ సృష్టించిన ఈ ముంబైకర్ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. చరిత్రలోకెక్కిన ఈ అరుదైన సందర్భాన్ని రెండో వివాహ వార్షికోత్సవం నాడు(బుధవారం) రితికాకు బహుమతిగా ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో డబుల్ సెంచరీ మార్క్ అందుకోగానే గ్యాలరీలో కూర్చుకున్న రితిక వైపు చూస్తూ రోహిత్ ముద్దులు విసిరాడు. దీంతో ఒకింత భావోద్వేగానికి లోనైన రితిక..చెమర్చిన కండ్లతో చప్పట్లు కొడుతూ లేచి నిలబడి భర్తను అభినందించింది. ఇదిలా ఉంటే ట్విట్టర్‌లో రోహిత్‌ను అభిమానులు తమ సందేశాలతో ముంచెత్తారు.

3:

వన్డేల్లో రోహిత్‌శర్మ డబుల్ సెంచరీల సంఖ్య

3:

భారత్ తరపున వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రోహిత్(16 సెంచరీలు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇతని కంటే ముందు సచిన్(49), కోహ్లీ (32), గంగూలీ (22) ఉన్నారు.

45:

ఒక క్యాలెండర్ ఇయర్‌లో(2017) భారత్ తరపున వన్డేల్లో సాధించిన అత్యధిక సిక్సర్ల సంఖ్య రోహిత్ పేరిట నమోదైంది.

812:

సెంచరీలు చేసిన తర్వాత రోహిత్ సాధించిన పరుగులు (16 ఇన్నింగ్సుల్లో). 2001 నుంచి ఇదే అత్యధికం. కోహ్లీ 32 ఇన్నింగ్సుల్లో 665 పరుగులతో రెండోస్థానంలో ఉన్నాడు.

107:

చివరి పది ఓవర్లలో (36 బంతుల్లో) రోహిత్ సాధించిన పరుగుల సంఖ్య. గతంలో డబుల్ సెంచరీ సాధించినపుడు చివరి 10 ఓవర్లలో (44 బంతుల్లో)110 పరుగులు చేశాడు.

6: ఈ ఏడాది రోహిత్ సెంచరీల సంఖ్య. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో గంగూలీ (6), సచిన్ (6) సరసన నిలిచాడు.

67:

నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో(32 బంతుల్లో) రోహిత్ సాధించిన పరుగుల సంఖ్య. ఒక బౌలర్ నుంచి అత్యధిక పరుగులు పిండుకున్న బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.ఇతని కంటే ముందు డివిలీయర్స్ ( హోల్డర్ బౌలింగ్‌లో 21 బంతుల్లో 76 పరుగులు) ఉన్నాడు.

100:

టీమ్‌ఇండియా వన్డేల్లో 300, అంతకు పైగా పరుగులు సాధించడం ఇది వందోసారి. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. ఆస్ట్రేలియా(96 సార్లు) రెండో స్థానంలో ఉంది.

364:

మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్ అందించిన పరుగుల సంఖ్య (రోహిత్ 208, ధావన్ 68, అయ్యర్ 88) భారత్ తరపున ఇదే అత్యధికం, కాగా ఓవరాల్‌గా మూడోది.

స్కోరుబోర్డు

భారత్: రోహిత్‌శర్మ 208 నాటౌట్, ధవన్(సి)తిరిమాన్నె(బి)పతిరన 68, అయ్యర్ (సి/సబ్) డిసిల్వా(బి) పెరెర 88, ధోనీ(ఎల్బీ) 7, హార్దిక్ (సి)తిరిమాన్నె(బి) పెరెర 8; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 50 ఓవర్లలో 392/4; వికెట్ల పతనం: 1-115, 2-328, 3-354, 4-392; బౌలింగ్: మాథ్యూస్ 4-1-9-0, లక్మల్ 8-0-71-0, పెరెర 8-0-80-3, ఫెర్నాండో 10-0-106-0, ధనంజయ 10-0-51-0, పతిరన 9-0-63-1, గుణరత్నె 1-0-10-0.
శ్రీలంక: గుణతిలక(సి)ధోనీ(బి) బుమ్రా 16, తరంగ(సి)కార్తీక్ (బి) హార్దిక్ 7, తిరిమాన్నె(బి) సుందర్ 21, మాథ్యూస్ 111 నాటౌట్, డిక్వెల్లా(సి)సుందర్(బి)22, గుణరత్నె (స్టంప్/ధోనీ) (బి)చాహల్ 34, పెరెర(సి) ధోనీ(బి)చాహల్ 5, పతిరన(సి)ధవన్(బి) భువనేశ్వర్ 2, ధనంజయ(సి)రోహిత్‌శర్మ(బి)బుమ్రా 11, లక్మల్ 11 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 50 ఓవర్లలో 251/8; వికెట్ల పతనం: 1-15, 2-30, 3-62, 4-115, 5-159, 6-166, 7-180, 8-207; బౌలింగ్: భువనేశ్వర్ 9-0-40-1, హార్దిక్ 10-0-39-1, బుమ్రా 10-0-43-2, సుందర్ 10-0-65-1, చాహల్ 10-0-60-3, అయ్యర్ 1-0-2-0.

3694

More News

VIRAL NEWS