స్పష్టత వచ్చినట్లే!


Fri,January 11, 2019 03:22 AM

-ఫాం కోల్పోతే ఎవరి స్థానానికీ హామీ లేదు
-ప్రపంచ కప్ జట్టుపై రోహిత్ వ్యాఖ్య

rauyudu
సిడ్నీ: ప్రపంచకప్ ఆడే భారత జట్టుపై పూర్తి స్పష్టత వచ్చినట్లేనని వన్డే జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. శనివారం నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా.. గురువారం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్ సమయానికి టీమ్ ఇండియా 13 వన్డేలు ఆడనుందని, ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతున్న జట్టే ప్రపంచకప్ బరిలోకి దిగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అలా అని జట్టులో ఎవరి స్థానానికీ హామీ లేదని చెబుతూ ఫామ్ కోల్పోతే జట్టులో చోటు గల్లంతవుందని రోహిత్ స్పష్టం చేశాడు. గాయాలు, ఫామ్ కోల్పోవడం వంటివి జరుగకపోతే తప్ప జట్టులో ఒకటి రెండు మార్పులు కూడా చోటు చేసుకోకపోవచ్చని రోహిత్ తెలిపాడు.

రాయుడు భేష్

భారత జట్టును వేధిస్తున్న నం 4 సమస్యకు రాయుడు పరిష్కారం చూపించాడని రోహిత్‌శర్మ చెప్పా డు. దాదాపు మూడేండ్లుగా ఈ స్థానంలో 11 మందిని పరిశీలించగా..వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో రాణించడం ద్వారా రాయుడు నిలదొక్కుకున్నాడు. ఈ సిరీస్‌లో అతడు ఒక సెంచరీ, అర్థసెంచరీ సహా కీలక సమయం లో బ్యాట్‌ను ఝులింపించి నాలుగోస్థానంలో సరైనోడు అనిపించుకున్నాడు. అతని ఆటతీరుపై కెప్టెన్ కోహ్లీ , కోచ్ రవిశాస్త్రి సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్ నిర్మించడంలోనూ పరిస్థితులకు తగినట్లుగా బ్యాటింగ్ చేస్తూ నాలుగోస్థానానికి అతికినట్లుగా రాయుడు సరిపోయాడు. ప్రపంచకప్ కోసమే రాయుడు రంజీలకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

ఒకటి రెండు మార్పులు మినహా..

ప్రపంచకప్ టోర్నీ బరిలో దిగే జట్టు ఎంపికలో ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్ ప్రభావితం చేస్తుందని రోహిత్ చెప్పాడు. ప్రపంచకప్ టోర్నీకి ముందు టీమ్‌ఇండియా 13 వన్డేల్లో తలపడనుంది. ఆసీస్‌లో మూడు, న్యూజిలాండ్‌లో 5 వన్డేలతోపాటు సొంతగడ్డపై ఆసీస్‌తో మరో ఐదువన్డేలు ఆడబోతున్నాం. ఇవికాకుండా టీ20లతో పాటు ఐపీఎల్ కూడా ఆడాల్సి ఉంది. ఆటగాళ్లు గాయాలపాలవకుండా ఫిట్‌నెస్‌తో ఉండేందుకు ప్రయత్నించాలి అన్నాడు. వ్యక్తిగత మెరుపుల వల్ల ఒకట్రెండు మ్యాచ్‌ల్లో గెలవొచ్చేమో కానీ, చాంపియన్‌గా నిలవాలంటే సమిష్టి కృషి అవసరమవుతుందన్నాడు. జట్టు కష్టకాలంలో బాధ్యత తీసుకోవడానికి ప్రతి ఆటగాడు సిద్ధంగా ఉంటే నిలకడగా విజయాలు లభిస్తాయని స్పష్టంచేశాడు. గతేడాది ఆసియా కప్ టోర్నీలో టాపార్డర్ విఫలమైనా మిడిలార్డర్ మెరుపులతో జట్టు విజేతగా నిలిచిందని గుర్తుచేశాడు. అంతేకాదు సొంతగడ్డపై జరిగిన సిరీస్‌లోనూ టీమిండియా సమిష్టిగా రాణించి వెస్టిండీస్‌ను ఓడించిందని వెల్లడించాడు.
rohit

వాళ్లు లేకున్నా

పేస్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఎప్పుడూ బలహీనంగా లేదని రోహిత్ చెప్పాడు. ప్రస్తుత వన్డే సిరీస్‌లో స్టార్ పేసర్లు మిషెల్ స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ లేకున్నా వారి బౌలింగ్ బలహీనం కాదన్నాడు. 2016లో భారత్ పర్యటించిన సమయంలో వీరు ముగ్గురూ ఆడక పోయినా 1-4తో వన్డే సిరీస్‌ను ఆసీస్ గెలుచుకుంది. వారి బౌలింగ్ బలంగా ఉందని చెప్పేందుకు ఇది ఓ ఉదాహరణ. వారిని ఒత్తిడిలోకి నెట్టి విజయం సాధించేందుకు మేం ప్రయత్నిస్తాం అని స్పష్టం చేశాడు.

మహీ.. మార్గదర్శి

మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జట్టుకు మార్గదర్శిలాంటి వాడని. అతని నుంచి యువ ఆటగాళ్లు స్ఫూర్తి పొందుతారని రోహిత్‌శర్మ అన్నాడు. వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలో ధోనీ పాత్ర కీలకమన్నాడు. మహీ గొప్ప ఫినిషర్. అతని సామర్థ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను జట్టులో ఉండటం చాలా అవసరం. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే ధోనీ వికెట్ల వెనుక ఉంటే జట్టుకు కొండంత అండ. తన సలహాలతో యువ ఆటగాళ్లకు ఎంతో తోడ్పడతాడు. స్పిన్నర్లు చహల్, కుల్దీప్ యాదవ్ విజయవంతమవడంలో ధోనీ పాత్ర ఎంతో ఉంది. లోయర్‌ఆర్డర్ బ్యాటింగ్ చేయాలంటే ధోనీ తరువాతే ఎవరైనా. మహీ ఫినిషింగ్ నైపుణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా ధోనీ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

స్థానం పదిలం చేసుకుంటా

టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటానని రోహిత్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. చివరిటెస్ట్‌లో ఆడకపోవడం బాధించినా బిడ్డను చూసుకోవడం సంతోషం కలిగించిందని చెప్పుకొచ్చాడు. సిడ్నీ టెస్ట్ ముగిసిన అనంతరం ఆసీస్‌లో తొలి సిరీస్ విజయాన్ని సభ్యులతో కలిసి పంచుకోవడం ఆనందం కలిగించిందన్నాడు. టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే వ్యూహాత్మకంగా ఆడాలి. చిన్నచిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని పూర్తిచేస్తూ ముందుకు సాగాలి. ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మేం ఇలాగే ఆడి ఫలితాన్ని సాధించాం. ఒక ఆటగాడిలోని అసలు సత్తా సంప్రదాయ ఫార్మాట్‌లోనే బయటపడుతుంది. అందుకే టెస్ట్ క్రికెట్ ఆడేలా నా ఆటతీరును మార్చుకుని జట్టులో స్థానం సుస్థిరం చేసుకుంటాను అని పేర్కొన్నాడు.

ఆరోస్థానం ..అదో పరేషాన్!

ఆసీస్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ను ఆరో నంబర్ పరేషాన్ చేస్తున్నది. ఈ స్థానంలో ఎవరిని ఆడించాలన్న సందిగ్ధం తీరకుండా ఉన్నది. 2011 ప్రపంచకప్ అనంతరం ఈ స్థానంలో ఎవరిని ఆడించినా అనుకున్నంతగా ఎవరూ రాణించలేదు. కాగా, కేదార్ జాదవ్ మాత్రం ఆరోస్థానంలో మెరుపులతో టీమ్ ఇండియాకు కొరత తీర్చేలా కనిపించాడు. కానీ వరుసగా గాయాలకు గురికావడం, ఫిట్‌నెస్ లేకపోవడం టీమ్ ఇండియాకు శాపంగా మారుతున్నది. ధోనీతో కలిసి కష్టకాలంలోనూ భారత్‌కు కేదార్ విజయాలను అందించడం తెలిసిందే. అంతేకాదు తన మిస్టరీ స్పిన్‌తో వికెట్లు తీయగల జిత్తులమారి జాదవ్ పరుగులనూ నియంత్రించడంలోనూ దిట్ట. ఇదే స్థానం కోసం కేదార్ జాదవ్‌తోపాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా పోటీ పడుతున్నాడు. కాగా,మహిళలపై అనుచిత వ్యాఖ్యలతో పాండ్యా ఆడడం అనుమానంలో పడడంతో టీమ్ ఇండియాను ఆందోళనకు గురవుతున్నది. ఇప్పటికే ధోనీ అంతంతమాత్రం ఫాంతో కొనసాగుతుండగా.. ఆరోస్థానంపై మూడు సిరీస్‌లలో అంచనాకు రాలేకపోతే భారత్ ప్రపంచకప్ అవకాశాలకు గండిపడే అవకాశం ఉంది.

558

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles