ఫెదరర్ పాంచ్

Tue,March 21, 2017 12:48 AM

స్విస్ మాస్టర్‌దే పారిబస్ ఓపెన్
FEDERERఇండియన్ వెల్స్: వయసు పెరుగుతున్నా, ఆటలో మాత్రం వన్నె తరుగకుండా చెలరేగుతున్నాడు రోజర్ ఫెదరర్. ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గి జోరుమీదున్న స్విస్ మాస్టర్ తాజాగా పారిబస్ ఓపెన్‌లోనూ చాంపియన్‌గా నిలిచి పూర్వపువైభవాన్ని చాటుతున్నాడు. తన దేశానికే చెందిన సహచరుడు స్టానిస్లాస్ వారింకాతో జరిగిన సింగిల్స్ ఫైనల్‌ఫైట్‌లో ఫెదరర్ 6-4, 7-5తో విజయం సాధించి ఐదోసారి ఇక్కడ విజేతగా నిలిచాడు. దీంతో జొకోవిచ్ తర్వా త ఈ వేదికపై ఐదుసార్లు టైటిల్ నెగ్గిన రెండో ఆటగాడిగా ఫెదరర్ నిలిచాడు. అంతేకాదు, ఈ విజయంతో అత్యధిక వయసులో ఎలైట్ మాస్టర్స్ టైటిల్ నెగ్గిన తొలి ఆటగానిగానూ 35ఏండ్ల ఫెదరర్ రికార్డు సృష్టించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను రష్యన్ క్రీడాకారిణి ఎలెనా వెస్నీనా గెలుచుకుంది. నువ్వానేనా అన్నట్లు సాగిన ఫైనల్లో వెస్నీనా 6-7(6/8), 7-5, 6-4తో రష్యాకే చెందిన కుజ్నెత్సోవాపై గెలిచింది.

ఫెదరర్ 6వ ర్యాంక్‌కు
పారిబస్ ఓపెన్ నెగ్గడంతో ఫెదరర్ ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నాలుగుస్థానాలు మెరుగుపరుచుకొని 6వ ర్యాంకులో నిలిచాడు. ముర్రే టాప్‌ర్యాంకును నిలబెట్టుకోగా.. జొకోవిచ్, వారింకా, నిషికొరి, రవోనిక్ వరుసగా 2,3,4,5 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. మహిళల్లో జర్మన్ ఏస్ కెర్బర్ మళ్లీ టాప్‌ర్యాంకును దక్కించుకుంది.

392

More News

మరిన్ని వార్తలు...