ఫెదరర్‌కు షాక్


Thu,July 12, 2018 01:14 AM

Federer
లండన్: కీలక సమయంలో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకోలేకపోయిన డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెదరర్.. వింబుల్డన్ నుంచి నిష్క్రమించాడు. తొమ్మిదో టైటిల్ కోసం బరిలోకి దిగిన ఈ టాప్‌సీడ్ ప్లేయర్.. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో 6-2, 7-6 (7/5), 5-7, 4-6, 11-13తో ఎనిమిదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడాడు. 2013 తర్వాత ఆరంభ రౌండ్లలోనే ఓడటం ఫెదరర్‌కు ఇదే తొలిసారి. రెండు సెట్లు ఆధిక్యంలో ఉండి మ్యాచ్ ఓడటం 2011 తర్వాత ఇదే మొదటిసారి. నాలుగు గంటల 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు గెలిచి జోరుమీదున్న స్విస్ స్టార్‌కు మూడోసెట్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఫెదరర్‌తో గతంలో తలపడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క సెట్ కూడా గెలువలేకపోయిన అండర్సన్.. ఈ మ్యాచ్‌లో భారీ ఏస్‌లతో విరుచుకుపడ్డాడు. కీలకమైన మూడోసెట్‌లో 5-4 ఆధిక్యంలో ఉన్న దశలో ఫెదరర్ మ్యాచ్ పాయింట్ కోసం కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్‌ను అండర్సన్ సమర్థంగా అడ్డుకున్నాడు.

ఆ వెంటనే సర్వీస్ నిలబెట్టుకుని సెట్‌ను గెలిచాడు. నాలుగోసెట్ నుంచి ఫెదరర్ ఆట పూర్తిగా గాడి తప్పింది. ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లలో ఏమాత్రం మెరుగు కనిపించలేదు. ఏడో గేమ్‌లో స్విస్ ప్లేయర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అండర్సన్ సెట్ స్కోరును సమం చేశాడు. నిర్ణయాత్మక ఐదోసెట్‌లో 3-4తో వెనుకబడ్డ ఫెదరర్ వచ్చిన బ్రేక్ పాయింట్లను కాపాడుకోలేక మూల్యం చెల్లించుకున్నాడు. ఓవరాల్‌గా దిగ్గజాన్ని ఓడించిన అండర్సన్.. 1983 తర్వాత సెమీస్‌కు చేరిన నాలుగో దక్షిణాఫ్రికా ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో జొకోవిచ్ (సెర్బియా) 6-3, 3-6, 6-2, 6-2తో నిషికోరి (జపాన్)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు.

352

More News

VIRAL NEWS

Featured Articles