కొత్త కొత్తగా..


Tue,July 18, 2017 12:47 AM

మళ్లీ పాత ఫెదరర్ కనిపించాడు. తన ఆటలోని అందాన్ని తిరిగి చూపించాడు. చూడముచ్చటైన బ్యాక్‌హ్యాండ్ షాట్లు, బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లు, పదునైన సర్వీస్‌లు, అద్భుతమైన గ్రౌండ్‌స్ట్రోక్‌లతో అలరించాడు. వయసు పైబడింది, తన పనైపోయిందంటూ విమర్శించిన వారికి వింబుల్డన్ టైటిల్‌తో ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ సాధించి అదిరిపోయే రీతిలో బదులిచ్చాడు. ఓవరాల్‌గా 19వ గ్రాండ్‌స్లామ్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచి తానెప్పటికీ టెన్నిస్ మాస్టర్‌ననే చాటుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల యోధుడిగా నిలిచిన ఫెదరర్, ఇప్పటికే టెన్నిస్‌లో అన్ని రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. మరిప్పుడు.. ఇంకా అతను సాధించడానికి ఏం మిగిలి ఉంది..? వెంటనే ఆటకు గుడ్‌బై చెబుతాడా ? అంటే.. ఆ ప్రసక్తే లేదంటున్నాడు ఫెదరర్. మరో మూడువారాల్లో 36వ బర్త్‌డే సెలెబ్రేట్ చేసుకోనున్న ఈ స్విస్ దిగ్గజం.. ఈ విజయాలతో ఇప్పుడే కొత్తకొత్తగా ఆట మొదలుపెట్టినట్లుందంటున్నాడు.
trophy
ఫెదరర్ ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అప్పుడెప్పుడో ఐదేండ్లక్రితం వింబుల్డన్ వేదికపై చివరి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఫెదరర్.. ఇప్పుడు అనూహ్యంగా కుర్రాళ్లకు దీటుగా ఆడుతూ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు కొట్టడమేంటని అంతా నోళ్లెళ్లబెట్టారు. నిజమే.. రఫెల్ నాదల్, నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రే ఉన్నట్టుండి ఒకస్థాయికి వెళ్లి, ఇప్పుడు ఒక్కో మెట్టు దిగుతుంటే.. ఇందుకు భిన్నంగా ఫెదరర్ మాత్రం ఇప్పుడు ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతున్నాడు. నిన్నటిదాకా తనకంటే తక్కువ ర్యాంకర్లు, కుర్రాళ్ల చేతిలో ఓటములు చవిచూసిన ఫెదరర్.. ఇప్పుడు కొత్త ఉత్సాహంతో వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. ఇందుకు అతను ఎంతో శ్రమించాడు. తన లోపాలేంటో తెలుసుకున్నాడు. కొత్తకొత్తగా ఆటను ప్రారంభించాడు. ఇప్పుడు పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. తానేమీ ఇంకా కుర్రాడిని కాదన్న విషయాన్ని గ్రహిస్తూ, ప్రతి టోర్నీలోనూ ఆడాల్సిన అవసరం లేదంటూ ఎంపికచేసుకున్న ఈవెంట్లపైనే దృష్టి సారించాడు. ఎర్రమట్టిలో తనకంత వర్కవుటవదనుకొని క్లేకోర్టు ఈవెంట్లకు దాదాపుగా దూరమయ్యాడు. హార్డ్‌కోర్టు, గ్రాస్‌కోర్టులపైనే ప్రణాళికలు రచించుకున్నాడు.

ఫలితం రాబట్టాడు. ఈ ఏడాది నాదల్‌పై వరుసగా నాలుగు విజయాలు నమోదుచేయడమే ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు తాను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ప్పుడు కూడా నాదల్‌పై అంతగా విజయాలు సాధించలేకపోయాడు. కానీ, ఈసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నాదల్‌ను చిత్తుచేసి మరీ ఐదేండ్ల తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్‌ను కొట్టాడు. ఆ వెంటనే సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ అయిన ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఇది తన ప్రణాళికలో భాగమే. వింబుల్డన్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాడు. ఫేవరెట్లనుకున్న డిఫెండింగ్ చాంపియన్ ముర్రే, జొకోవిచ్, నాదల్, వారింకాలు ఫైనల్‌కు ముందే వెనుదిరిగితే, ఫెదరర్ మాత్రం ఒక్కసెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరాడు. టైటిల్‌పోరులోనూ అదేజోరుతో విజృంభించి ప్రత్యర్థి సిలిచ్‌ను వరుససెట్లలో చిత్తుచేసి రికార్డుస్థాయిలో ఎనిమిదో వింబుల్డన్‌ను ముద్దాడాడు. ఈ క్రమంలోనే అత్యధిక వింబుల్డన్‌లు నెగ్గిన సంప్రాస్ రికార్డును అధిగమించి మరే ఆటగాడు తనకు సాటిరారని చాటుకున్నాడు. ఇప్పుడు ఫెదరర్ విజయాల్లో కీలకపాత్ర బ్యాక్‌హ్యాండ్ షాట్లదే. బేస్‌లైన్ నుంచి అతను సంధించే బ్యాక్‌హ్యాండ్ షాట్లకు ప్రత్యర్థుల వద్ద సమాధానమే ఉండట్లేదు. ఒకప్పుడు అలవోకగా ఐదుసెట్ల మ్యాచ్‌లను ఆడగల్గిన ఫెదరర్.. మధ్యలో గాయం కారణంగా తడబాటుకు గురయ్యాడు. కానీ, మోకాలి గాయానికి శస్త్రచికిత్స తర్వాత అతని ఆటతీరు పూర్తిగా మెరుగైంది. ఇప్పుడు కోర్టులో మరింత చురుకుగా కదులుతున్నాడు. తన షాట్లను సులభంగా ఆడగలుగుతున్నాడు. ప్రత్యర్థి అనుభవజ్ఞుడైనా, కుర్రకారైనా వరుససెట్లలో ఓడిస్తూ మునపటిస్థాయిలో విజృంభిస్తున్నాడు.

మీరు నవ్వొద్దు.. నేను ఈ మాట చెబుతున్నందుకు. నేనసలు కలగనలేదు.. ఏదో ఒకరోజు వింబుల్డన్ లెజెండ్ అవుతానని. కానీ, అనుకోనిది ఇప్పుడు జరుగుతున్నది. 16 ఏండ్ల క్రితం ఇక్కడ పీట్ (సంప్రాస్)ను ఓడించాక నేనింతగా విజయవంతమవుతానని అప్పుడు అనుకోలేదు. ఎనిమిదో వింబుల్డన్ కొట్టాలని నేను లక్ష్యంగా పెట్టుకోలేదు. టెన్నిస్ ఆడడమంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఇలాగే ఆడుతూ ఉండాలని అనుకునే వాణ్ని. ఈ ఏడాది నాకు అద్భుతమనుకోవాలి. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఫామ్‌లోకి రావడం.. ఇలా వెంటవెంటనే గ్రాండ్‌స్లామ్స్ కొట్టడం మధురంగా ఉంది. ఆస్వాదించినంత కాలం ఆడుతూనే ఉంటా. మిమ్మల్ని ఇలా అలరిస్తూనే ఉంటాను.
- రోజర్ ఫెదరర్

నంబర్‌వన్ దిశగా..


వరుస గ్రాండ్‌స్లామ్స్ విజయాలతో పునరుత్తేజంతో కనిపిస్తున్న స్విస్ మాస్టర్ రోజర ఫెదరర్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకునే దిశగా అడుగులేస్తున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఫెదరర్ రెండుస్థానాలు ఎగబాకి 3వ ర్యాంక్‌లో నిలిచాడు. గతేడాదిని 16వ ర్యాంకుతో ముగించిన ఫెదరర్.. కొద్దికాలంలోనే టాప్-3లోకి చేరడం అతని అత్యుత్తమఫామ్‌ను తెలియజేస్తున్నది. ఆండీ ముర్రే టాప్‌ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, నాదల్ రెండోర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక జొకోవిచ్ మూడు నుంచి నాలుగోర్యాంక్‌కు పడిపోయాడు. వింబుల్డన్ మహిళల విజేత గార్బినె ముగురుజ మళ్లీ టాప్‌టెన్‌లోకి వచ్చింది. ఏకంగా 10స్థానాలు మెరుగుపరుచుకొని 5వ ర్యాంక్‌లో నిలిచింది. కొత్తగా కరోలినా ప్లిస్కోవా నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ఇప్పటిదాకా నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగిన కెర్బర్ 3వ ర్యాంక్‌కు పడిపోగా, హాలెప్ 2వ ర్యాంక్‌లో ఉంది. వింబుల్డన్ రన్నరప్ వీనస్ విలియమ్స్ 11 నుంచి 9వ ర్యాంక్‌కు ఎగబాకింది.

234
Tags

More News

VIRAL NEWS