ఫెదరర్‌తో ఆడనున్న సుమిత్


Sun,August 25, 2019 02:00 AM

Sumith-nagal

-తొలిసారి గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాకు చేరిన నాగల్

న్యూయార్క్: భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ చక్కటి ప్రదర్శనతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. యూఎస్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నీలో అదిరిపోయే ఆటతో ఆల్‌టైమ్ గ్రేట్ రోజర్ ఫెదరర్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. పురుషుల సింగిల్స్ అర్హత పోటీల చివరి రౌండ్‌లో నాగల్ 5-7, 6-4, 6-3తో జొయో మెనేజెస్ (బ్రెజిల్)పై గెలిచి మెయిన్ డ్రాలో అడుగుపెట్టాడు. ఈ దశాబ్దంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు చేరిన ఐదో భారత ఆటగాడిగా సుమిత్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు సోమ్‌దేవ్ దేవ్ బర్మన్, యూకీ బాంబ్రీ, సాకేత్ మైనేని, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ మాత్రమే మెయిన్ టోర్నీలో ఆడారు. 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్ కోల్పోయిన 22 ఏండ్ల నాగల్ ఆ తర్వాత విజృంభించాడు. వరుస సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో 190వ స్థానంలో ఉన్న సుమిత్ యూఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లో మూడో ర్యాంకర్, 20 గ్రాండ్‌స్లామ్‌ల విజేత రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)తో తలపడనున్నాడు. చిన్నప్పటి నుంచి తాను దైవంలా ఆరాధించే ఆటగాడితో ఆడనుండటం చాలా ఆనందంగా ఉందని ఈ యువ సంచలనం పేర్కొన్నాడు. ఇది నాకు చాలా పెద్ద ఘనత. ప్రతి ఒక్కరు దీని గురించే కలలు కంటారు. క్వాలిఫయర్స్‌లో నా ప్రదర్శన సంతృప్తినిచ్చింది. ఫెదరర్‌తో ఆడనుండటంతో నాకు మాటలు రావడంలేదు. ఏదో ఒకరోజు టెన్నిస్ దేవుడితో కలిసి ఆడతానని అనుకునేవాడిని. అది ఈ రోజు నిజమైంది అని నాగల్ పేర్కొన్నాడు.

580

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles