ప్రపంచకప్ జట్టులో పంత్‌కు చోటివ్వాలి: ఫరూక్ ఇంజినీర్


Fri,January 11, 2019 03:16 AM

farokh
ముంబై: ఆసీస్‌తో జరిగిన టెస్ట్‌సిరీస్‌లో దుమ్మురేపిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్‌లో చాలా మెరుగుపడాల్సి ఉందని భారత దిగ్గజ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ తెలిపాడు. ఆసీస్ గడ్డపై అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న భారత వికెట్ కీపర్‌గా కొత్త రికార్డు నమోదు చేసిన పంత్‌ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేయవద్దన్నాడు. వికెట్ కీపింగ్‌లో సాంకేతిక తప్పులను సరిదద్దుకునేలా అతనికి సలహాలు అందించాలని, పొగడ్తలు కాకుండా పంత్‌ను ప్రోత్సహించడం మేలని సూచించాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో మహేంద్ర సింగ్ ధోనీతోపాటు రిషబ్ పంత్‌నూ తుదిజట్టులో ఆడించాలని ఫరూక్ డిమాండ్ చేశాడు. వికెట్ కీపింగ్‌లో తప్పులు చేస్తున్నా.. బ్యాటింగ్‌లో మాత్రం అతను అద్భుతంగా ఆడుతున్నాడని ప్రశంసించాడు. తప్పులను సవరించుకుంటే పంత్ గొప్ప కీపర్ అవుతాడని గతంలో తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు. ప్రపంచకప్ జట్టులో ధోనీని ఎంపిక చేసేందుకు పంత్‌ను తప్పిస్తారా? అతను చాలా అద్భుతంగా ఆడతున్నాడు. సెలక్టర్లు ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో తేల్చుకునేందుకు డైలమాలో పడే అవకాశం వచ్చింది. కీపింగ్‌లో మెరుగుపడేందుకు అతనికి మరికొంత సమయం పడుతుంది. నేను పంత్‌పై మరిన్ని విమర్శలు గుప్పించడం లేదు. వికెట్ కీపింగ్ చేసే సమయంలో తన పాదాలను కదిలించకుండా బంతిని అందుకునేందుకు అతని శరీరం వేగంగా ప్రతిస్పందిస్తుంది అని ఫరూక్ పేర్కొన్నాడు.

443

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles