అశ్విన్, గిబ్స్ ట్విట్టేసుకున్నారు..!


Tue,February 20, 2018 02:59 AM

ashwin
న్యూఢిల్లీ: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హర్షెల్ గిబ్స్ మధ్య ట్వీట్ల తూటాలు పేలాయి. ఇద్దరు సామాజిక మాధ్యమం ట్విట్టర్ వేదికగా ఒకరినొకరు మాటలు విసురుకున్నారు. అసలు విషయానికొస్తే.. ప్రముఖ క్రీడా ఉత్పత్తుల సంస్థ నైకీకి సంబంధించి అశ్విన్ మొదట ట్వీట్ చేశాడు. నైకీ విడుదల చేసిన కొత్త షూస్ తనకు ఎంతో నచ్చాయని, ఇప్పటివరకు చూసిన వాటిలో ఇవి చాలా సౌకర్యవంతంగా ఉన్నాయని రాసుకొచ్చాడు. దీనికి గిబ్స్ ఒకింత వ్యంగ్యంగా ట్వీట్ చేయడం వివాదానికి కారణమైంది. ఈ కొత్త వాటితోనైనా ఇంకాస్తా వేగంగా పరుగెడుతావు అనుకుంటున్నా అని రాశాడు.

గిబ్స్ సందేశంపై నొచ్చుకున్న అశ్విన్ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. నీ అంత వేగంగా పరుగెత్తలేకపోవచ్చు. నీ అంత ప్రతిభ లేదు. నైతికతతో ఆటడమే నాకు తెలుసు. నీలాగా మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసి కడుపు నింపుకోవడం తెలియదు అని ట్వీట్ చేశాడు. అయితే ఇది కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారడంతో అశ్విన్ ఆ సందేశాన్ని తొలిగించాడు. మరోవైపు గిబ్స్ స్పందిస్తూ అసలు ఒక జోక్‌ను ఎలా తీసుకోవాలో నీకు తెలియదు అని అన్నాడు. అప్పటికే ట్వీట్ వివాదంగా మారడంతో అశ్విన్ దిద్దుబాటకు పూనుకున్నాడు. నేను చేసిన ట్వీట్ జోక్ అనుకున్నా. కానీ నువ్వు, అందరూ ఎలాగా అర్థం చేసుకున్నారో చూడు. దీనిపై ఓసారి భోజనం చేసుకుంటూ మాట్లాడుకుందాం అని అశ్విన్ రాశాడు. ఇద్దరు క్రికెటర్ల మధ్య వివాదానికి ఇలా ముగింపు పడింది.

1730

More News

VIRAL NEWS

Featured Articles