అవసరమైన ఆయుధాలున్నాయి


Wed,May 15, 2019 08:44 AM

Ravi-Shastri
- వన్డే వరల్డ్‌కప్‌పై భారత కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్య

న్యూఢిల్లీ: వరల్డ్‌కప్ నెగ్గేందుకు అవసరమైన ఆయుధ సంపత్తి భారత్ వద్ద ఉందని ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. పరిస్థితులకు అనుగుణంగా తుదిజట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు. మన వద్ద చక్కటి జట్టుంది. నాలుగో స్థానం గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధంగా ఉండే ఆటగాళ్లు మన వద్ద ఉన్నారు. వన్డే ప్రపంచకప్ నెగ్గేందుకు అవసరమైన ఆయుధాలు ఉన్నాయి. సెలెక్టర్లు మెగాటోర్నీ కోసం సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేశారు. గాయాలతో ఎవరైనా దూరమైతే అప్పుడు చూద్దాం. అదృష్టం కొద్ది కేదార్ జాదవ్‌కు ఫ్యాక్చర్ కాలేదు. ప్రత్యేక పరిశీలనలో ఉన్న అతడు త్వరలోనే కోలుకుంటాడుఅని రవిశాస్త్రి తెలిపాడు. ఇక వరల్డ్‌కప్ కోసం ఏ జట్టు ముందస్తు ప్రణాళికలు వేసుకోదని.. సుదీర్ఘంగా సాగే టోర్నీలో అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కోచ్ అన్నాడు.

ప్రపంచకప్‌లాంటి పెద్ద టోర్నీలకు ముందస్తు ప్రణాళికలు పనిచేయవు. పరిస్థితులకు తగ్గట్లు అప్పటికప్పుడు స్పందించాల్సి ఉంటుంది. నాలుగేండ్ల సమయమనేది సన్నద్ధత కోసమే. విశ్వసమరంలో వెస్టిండీస్ ప్రమాదకర జట్టే. ఇటీవల భారత్‌లో పర్యటించినప్పుడు కూడా విండీస్ గట్టి పోటీనిచ్చింది. అప్పటి జట్టులో గేల్, రస్సెల్ లేరనే అంశాన్ని మర్చిపోకూడదు. అలాంటి జట్టుకు వారిద్దరు తోడైతే విండీస్ బలం ఇంకా పెరుగుతుంది. ఇక డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. గత 25 ఏండ్లలో 5 సార్లు వరల్డ్‌కప్ సొంతం చేసుకున్న ఆసీస్‌ను తక్కువ అంచనా వేయడం చాలా పెద్ద తప్పు. మంచి జోరుమీదున్న ఆ జట్టుకు గత కొంతకాలంగా దూరంగా ఉన్న సీనియర్ ప్లేయర్లు జతవడం అదనపు బలాన్నిచ్చిందిఅని రవిశాస్త్రి అన్నాడు.

393

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles