శాంసన్ షో


Mon,April 16, 2018 12:50 AM

-92 పరుగులతో విధ్వంసం
-బెంగళూరుపై రాజస్థాన్ గెలుపు
samson
బెంగళూరు: సంజూ శాంసన్ సిక్సర్ల సునామీ, స్పిన్నర్ల అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థిగడ్డపై రాయల్‌గా గెలిచింది. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాయల్స్ విధించిన 218 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 198/6 స్కోరుకు పరిమితమైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (30 బంతుల్లో 57; 7ఫోర్లు, 2సిక్స్‌లు) దూకుడుగా ఆడినా, మెకల్లమ్ (4) డికాక్ (26), డివిలియర్స్ (20) నిరాశపరిచారు. టాపార్డర్ కుదురుకుంటున్న సమయంలో రాయల్స్ బౌలర్లు షార్ట్ (1/10), గోపాల్ (2/22) కీలక వికెట్లు పడగొట్టి ఆర్సీబీని దెబ్బతీశాడు. ఆ తర్వాత సుందర్ (35), మన్‌దీప్ సింగ్ (25 బంతుల్లో 47 నాటౌట్; 6ఫోర్లు, ఒక సిక్స్) చివరి వరకు పోరాడి ఆశలు రేకెత్తించినా.. సాధించాల్సిన రన్‌రేట్ భారీగా ఉండటంతో జట్టును గెలిపించలేకపోయారు.అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి ఈ సీజన్‌లో టాప్ స్కోర్ నమోదు చేసింది.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సంజూశాంసన్(45 బంతుల్లో 92 నాటౌట్; 2 ఫోర్లు, 10 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ బౌలింగ్ కుదేలైపోయింది.

ఆరంభంలో కెప్టెన్ రహానే (20 బంతుల్లో 36; 6 ఫోర్లు, ఒక సిక్స్) దూకుడుగా ఆడగా..డార్కీ ష్టార్ట్ (11) మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత శాంసన్, స్టోక్స్ (27) అండతో 12 ఓవర్లలోనే రాయల్స్ స్కోరును వంద పరుగులకు చేర్చాడు. బట్లర్ (23) కాసేపు బ్యాట్ ఝులిపించాడు. ఈ క్రమంలో శాంసన్ 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కెజ్రోలియా వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది స్కోరు వేగాన్ని మరింత పెంచాడు. బట్లర్ సైతం అదే జోరు కొనసాగించబోయి వోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. బట్లర్, శాంసన్ జోడి 4వ వికెట్‌కు 36 బంతుల్లోనే 73 పరుగులు జోడించింది. బట్లర్ అవుటైనప్పటికీ శాంసన్ అదే ఓవర్‌లో వరుసగా ఒక సిక్సర్, రెండు ఫోర్లు బాదాడు. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో త్రిపాఠి, శాంసన్ ఏకంగా 27 పరుగులు పిండుకున్నారు. శాంసన్ వరుసగా రెండు సిక్సర్లు బాది రాయల్స్ స్కోరును 200 పరుగులు దాటించారు.ఆఖరి ఐదు ఓవర్లలో రాయల్స్‌కు 88 పరుగులు వచ్చాయి. ఆర్సీబీ బౌలర్లలో చహాల్, వోక్స్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి.

సంక్షిప్త స్కోర్లు: రాజస్థాన్ : 20 ఓవర్లలో 217/4 (శాంసన్ 92 నాటౌట్; చహాల్ 2/22); బెంగళూరు: 20 ఓవర్లలో 198/6 (కోహ్లీ 57, గోపాల్ 2/22)

452

More News

VIRAL NEWS

Featured Articles