ఫ్రెంచ్ ఓపెన్ విజేత నాదల్


Mon,June 10, 2019 02:25 AM

చరిత్ర సృష్టించిన రఫెల్ నాదల్
12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం

Nadal2
ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో మట్టికోట రారాజు, డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ విజృంభించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాదల్ (స్పెయిన్) 6-3, 5-7, 6-1, 6-1తో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై విజయం సాధించి ఎవరికీ అందని రీతిలో 12వసారి టైటిల్ పట్టేశాడు. ఓవరాల్‌గా నాదల్‌కు ఇది 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం.
మట్టికోర్టు మరోసారి మురిసింది ఆ వీరుడి ఆట చూసి.. ఫ్రెంచ్ టైటిల్ పన్నెండోసారి సంబురపడింది ఆ ఆటగాడి ఎదలో ఒదిగి.. టెన్నిస్ ప్రేమికులు మైమరిచిపోయారు ఆ దూకుడైన ఆటను తిలకించి.. ఎర్రమట్టి కోటలో మకుటం లేని మహరాజు
రఫెల్ నాదల్ మరోసారి గర్జించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో తనకు ఎదురులేదంటూ కదంతొక్కాడు. రొలాండ్ గారోస్ ఉంది తనకోసమే అన్నట్టు చెలరేగాడు. ఫైనల్‌లో బెంబేలెత్తించే ఆటతో వరుసగా రెండోసారి థీమ్‌పై జయకేతనం ఎగురవేశాడు.
ఒకే గ్రామ్‌స్లామ్‌లో 12సార్లు టైటిల్ సాధించి.. ఓవరాల్‌గా ఫెదరర్ రికార్డుకు రెండడుగుల దూరంలో నిలిచాడు.


పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో స్పెయిన్ వీరుడు, డిఫెండింగ్ చాంపియన్ రఫెల్ నాదల్ జైత్రయాత్ర కొనసాగించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో 6-3, 5-7, 6-1, 6-1తో నాలుగో సీడ్ డొమెనిక్ థీమ్(ఆస్ట్రియా)ను మట్టికరిపించి 12వ సారి టైటిల్‌ను ముద్దాడాడు. తొలి సెట్ ఆరంభం నుంచే బలమైన షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. అయితే, ఓ దశలో థీమ్ పుంజుకొని రఫా సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అతనికి ఆ సంతోషం ఎక్కువసేపు నిలువలేదు. వెంటనే తేరుకున్న రఫా దూకుడుగా ఆడాడు. వరుస గేమ్‌లు గెలిచి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్నాడు. మలి సెట్‌లో థీమ్ అనూహ్యంగా విజృంభించాడు.

చక్కటి ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆధిపత్యం ప్రదర్శించాడు. ఐదు ఏస్‌లు కొట్టడంతో పాటు రెండు సార్లు నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 7-5తో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి నాదల్ అసలు ఆట ప్రారంభమైంది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిన రఫా వరుసగా రెండు సెట్లు గెలిచి టైటిల్ చేజిక్కించుకున్నాడు. మ్యాచ్ మొత్తం మీద మూడు ఏస్‌లు, 38విన్నర్లు బాదిన నాదల్.. ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడు సార్లు బ్రేక్ చేసి రికార్డు స్థాయిలో 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఇంతకుముందు 2005 నుంచి 2008 వరకు, 2010-14 మధ్య, 2017,2018లో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు.
Nadal

ఫెదరర్‌కు రెండడుగుల దూరంలో..

కెరీర్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు(20) సాధించిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రికార్డుకు నాదల్ చేరువయ్యాడు. ఈ గెలుపుతో మొత్తం 18గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో రెండు టైటిల్స్ నెగ్గితే ఫెదరర్‌ను చేరుకుంటాడు.
Nadal1

300

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles