కుర్రాళ్ల యుద్ధం నేటి నుంచి అండర్-19 ప్రపంచకప్


Sat,January 13, 2018 03:46 AM

-16 జట్ల పోరాటం.. రేపు భారత్, ఆసీస్ మ్యాచ్
ఒక్క అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రపంచాన్ని ఆకర్షించొచ్చు.. పదునైన బౌలింగ్‌తో క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసుకోవచ్చు.. ఒక్క సంచలనంతో సింగిల్ నైట్‌లోనే స్టార్‌గా మారొచ్చు.. ఒక్క అవకాశంతో ఆకాశానికే నిచ్చెనలు వేయొచ్చు.. ఇక్కడ కొడితే.. స్వదేశంలో జాతీయ జట్టు ద్వారాలు తెరుచుకుంటాయి.. ఇక్కడ ఆడితే.. రాబోయే తరానికి మార్గదర్శకులుగా నిలువొచ్చు.. ఆకాశమే నీ హద్దు.. అవకాశం మాత్రం వదలొద్దు.. కుర్రాళ్ల
మినీ కురుక్షేత్రంగా భావించే అండర్-19 ప్రపంచకప్‌కు నేటి నుంచి తెరలేవనుంది.

nuziland

క్రైస్ట్‌చర్చ్: భవిష్యత్ క్రికెట్‌కు ఆశాకిరణాలు మారాలన్న ఏకైక లక్ష్యంతో ముందడుగు వేస్తున్న యువ క్రికెటర్లకు అండర్-19 ప్రపంచకప్ గొప్ప వేదిక. న్యూజిలాండ్ వేదికగా ఈ మెగా ఈవెంట్ శనివారం ప్రారంభంకానుంది. మొత్తం 16 జట్లు.. 4 గ్రూప్‌లు.. 22 రోజులు పోటీలు.. స్వదేశంలో రికార్డుల బద్దలుకొట్టిన మెరికల్లాంటి కుర్ర క్రికెటర్లెందరో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. క్రైస్ట్‌చర్చ్, క్వీన్స్‌టౌన్, టౌరంగా, వాంగరైలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఫిబ్రవరి 3న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఇది 12వ ప్రపంచకప్ కాగా, ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా చెరో మూడుసార్లు విజేతగా నిలిచాయి. పాకిస్థాన్ రెండుసార్లు, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్ ఒక్కోసారి ట్రోఫీని చేజిక్కించుకున్నాయి. ఈ టోర్నీ 200 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మొదట రౌండ్ రాబిన్ లీగ్, ఆ తర్వాత ప్లేట్ క్వార్టర్ ఫైనల్, సూపర్ లీగ్ క్వార్టర్ ఫైనల్, ప్లేట్ సెమీఫైనల్, సూపర్ లీగ్ ప్లే ఆఫ్ సెమీఫైనల్, వీటితో పాటు జట్ల ప్లే ఆఫ్స్, ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.


ఫేవరెట్‌గా భారత్

దేశవాళీ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించిన ముంబై బ్యాట్స్‌మన్ పృథ్వీ షా నేతృత్వంలోని భారత్ జట్టు ఈ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నది. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉండటంతో అంచనాలు మరింతగా పెరిగాయి. గత వైఫల్యాలను పక్కనబెడుతూ.. తాజా ప్రదర్శనతో కివీస్‌లో తామెంటో నిరూపించుకోవాలని కుర్రాళ్లందరూ గట్టిపట్టుదలతో ఉన్నారు. సీనియర్ జట్టుకు ఆడిన చాలా మంది క్రికెటర్లు ఈ టోర్నీ నుంచే వెలుగులోకి రావడంతో వాళ్లను స్ఫూర్తిగా తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని రెండు చేతుల్లా ఒడిసిపట్టుకుని నూనూగు మీసాలను మెలేయాలని చూస్తున్నారు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగే తమ తొలి మ్యాచ్‌తో భారత్ ఈ టోర్నీని ప్రారంభించనుంది. ఈనెల 16న పపువా న్యూగినియాతో, 19న జింబాబ్వేతో మ్యాచ్‌లు ఆడనుంది. పృథ్వీ షా, శుభమ్ గిల్ ఇప్పటికే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సెంచరీలు చేసి సూపర్ ఫామ్‌లో ఉన్నారు.

పోటీ ఎక్కువే..

తమ దేశాల్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో దుమ్మురేపిన ఆటగాళ్లందరూ ఈ టోర్నీలో ఆడుతుండటంతో గట్టిపోటీ నెలకొంది. పృథ్వీ షా, గిల్ (భారత్), జాసన్ సంగా (ఆస్ట్రేలియా), షహీన్ అఫ్రిది (పాకిస్థాన్), బషీర్ షా (ఆఫ్ఘనిస్థాన్) తమ జట్లలో కీలక ఆటగాళ్లు. అఫ్రిది అరంగేట్రంలోనే (ఖ్వాద్ ఏ ఆజమ్ టోర్నీలో) 8/37తో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసి ఈ ఘనత సాధించిన తొలి పాక్ క్రికెటర్‌గా నిలిచాడు. బసీర్ షా దిగ్గ జక్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టి ప్రపంచ క్రికెట్‌ను తనవైపు తిప్పుకున్నాడు. 17 ఏండ్ల బషీర్ 121.77 సగటుతో బ్రాడ్‌మన్ (95.14)ను అధిగమించిన సంగతి తెలిసిందే. మరోవైపు దిగ్గజ క్రికెటైర్లెన స్టీవ్‌వా కుమారుడు ఆస్టిన్ వా (ఆస్ట్రేలియా), మఖాయ ఎన్తినీ కుమారుడు తండో ఎన్తినీ, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్లాండ్స్ పుత్రరత్నం కూడా ఈ మెగా టోర్నీలో ఆడుతుండడం ప్రత్యేకతను సంతరించుకున్నది.
cup

గ్రూప్-ఎ: కెన్యా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్
గ్రూప్-బి: ఆస్ట్రేలియా, భారత్, పపువా న్యూ గినియా, జింబాబ్వే
గ్రూప్-సి: బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లండ్, నమీబియా
గ్రూప్-డి: ఆఫ్ఘానిస్థాన్, ఐర్లాండ్, పాకిస్థాన్, శ్రీలంక

2238

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles