టైటిల్ లక్ష్యంగా..


Tue,October 22, 2019 01:26 AM

-నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ..
-బరిలో సింధు, సైనా, ప్రణీత్, శ్రీకాంత్

P-V-Sindhu
పారిస్ : ఇటీవలి టోర్నీల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్న పీవీ సింధు, సైనా నెహ్వాల్ సహా భారత షట్లర్లు మరో టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. మంగళవారం ఇక్కడ ప్రారంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ సూపర్ టోర్నీ 750లో బరిలోకి దిగనున్నారు. ప్రపంచ చాంపియన్‌గా అవతరించాక బరిలోకి దిగిన మూడు టోర్నీ (చైనా, కొరియా, డెన్మార్క్ ఓపెన్)ల్లో కనీసం క్వార్టర్ ఫైనల్స్‌కు చేరలేకపోయిన స్టార్ షట్లర్, ఐదో సీడ్ పీవీ సింధు.. ఫ్రెంచ్ టైటిల్ సాధించి ఆ పరాజయాలను మరిపించాలని పట్టుదలగా ఉంది. డెన్మార్క్ ఓపెన్ రెండో రౌండ్‌లో 17ఏండ్ల అమ్మాయి అన్‌సే యంగ్ (డెన్మార్క్) చేతిలో భారత స్టార్ షట్లర్ ఓడిన సంగతి తెలిసిందే. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మిషెల్లీ లీ (కెనడా)తో సింధు తలపడనుంది. గతంలో ఆమె చేతిలో ఈ తెలుగమ్మాయి రెండుసార్లు ఓడింది. ఒకవేళ క్వార్టర్స్‌కు చేరితే అక్కడ టాప్ సీడ్ తైజూ యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడే అవకాశముంది. మరోవైపు గాయాల కారణంగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ సైనా నెహ్వాల్ ఈ టోర్నీలో ఫామ్‌లోకి వచ్చి పూర్వ వైభవాన్ని చాటుకోవాలని భావిస్తున్నది. గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సైనా.. ఈ సారి మొదటి పోరులో చెయుంగ్ గాన్‌యీ (హాంగ్‌కాంగ్)తో పోటీ పడనుంది.
B.-Sai-Praneeth
ప్రణీత్ మళ్లీ డాన్‌తోనే..
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, తెలుగు షట్లర్ సాయిప్రణీత్... మరోసారి దిగ్గజ ప్లేయర్ లిన్‌డాన్ (చైనా)తో తలపడనున్నాడు. డెన్మార్క్ ఓపెన్‌లో డాన్‌ను ప్రణీత్ సునాయాసంగా ఓడించిన విషయం తెలిసిందే. ఇక 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్‌కు తొలి రౌండ్‌లోనే రెండో సీడ్ తౌటెన్ చెన్ (చైనీస్ తైపీ) రూపంలో బలమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. కామన్వెల్త్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ మొదటి పోరులో కాలాంగ్ అన్‌గస్ (హాంగ్‌కాంగ్)ను ఢీకొననుండగా.. కెంటా నిషిమొటో(జపాన్)తో సమీర్ వర్మ తలపడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి - చిరాగ్ శెట్టి తొలి రౌండ్‌లో డచ్ జోడీ జెల్లె మాస్ - రాబిన్‌తో తలపడనున్నారు. మను అత్రీ - సుమీత్ రెడ్డి జోడీ కూడా పోటీలో ఉంది.

386

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles