అయ్యో.. సింధు


Mon,July 22, 2019 03:07 AM

-ఫైనల్లో యమగుచి చేతిలో పరాజయం
-ఇండోనేషియా ఓపెన్

sindhu
జకార్తా: ఈ సీజన్‌తో తొలి టైటిల్ కోసం ఏడు నెలలుగా ఎదురుచూస్తున్న భారత స్టార్ షట్లర్ వీపీ సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో అదిరే ఆటతో ఫైనల్ చేరి టైటిల్‌పై ఆశలు రేపిన ఈ తెలుగు తేజం తుదిపోరులో తడబడింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 15-21, 16-21తో జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో పరాజయం పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. 51 నిమిషాల పాటు సాగిన పోరులో అనవసర తప్పిదాలు చేసిన సింధు అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ ప్రారంభంలో 0-3తో వెనుకబడిన తెలుగమ్మాయి అద్భుత పోరాటంతో ఓ దశలో 5-4తో ముందంజలో నిలిచింది. ఆ తర్వాత ఇరువురు హోరాహోరీగా పోరాడడంతో స్కోరు 8-8తో సమమైంది. ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించిన సింధు సులువుగానే సెట్‌ను సొంతం చేసుకునేలా కనిపించింది. కానీ పట్టు వదలని యమగుచి తిరిగి పుంజుకొని స్కోరును 14-14తో సమం చేసింది.

Akane-Yamaguchi
ఇక అక్కడి నుంచి అటాకింగ్ గేమ్‌పై దృష్టి పెట్టిన జపాన్ షట్లర్.. వరుసగా ఆరు పాయింట్లు సాధించింది. ఆ తర్వాత సింధు ఓ పాయింట్ సాధించినా.. వెంటనే కోలుకున్న జపాన్ స్టార్ ఓ అద్భుతమైన షాట్‌తో తొలిసెట్‌ను 21-15తో కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్ ఆరంభంలో కూడా సింధు 1-4తో బాగా వెనుకబడింది. తడబాటును కొనసాగించి 5-8తో మ్యాచ్‌లో ముందంజ వేయలేకపోయింది. యమగుచి తప్పిదాల కారంణంగా భారత స్టార్ కొన్ని పాయింట్ల సాధించినా ఆధిక్యంలోకి రాలేకపోయిం ది. 11-15తో వెనుకబడిన సమయంలో సింధు మరోసారి పుంజుకొని 15-18కి చేరింది. ఆ తర్వాత యమగుచి బలమైన షాట్లతో విరుచుకపడడంతో ఒక్కపాయింట్ మాత్రమే సాధించిన సింధు.. 16-21తో రెండో గేమ్‌ను కూడా కోల్పోయి.. టైటిల్‌ను చేజార్చుకుంది.

చెన్‌దే పురుషుల సింగిల్స్

పురుషుల సింగిల్స్ ఫైనల్.. చైనీస్ తైపీ ప్లేయర్ చౌ టీన్ చెన్, అండర్స్ అంటోన్సెన్(డెన్మార్క్) మధ్య హోరాహోరీగా సాగింది. 91నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో చెన్ 21-18, 24-26, 21-15తో అంటోన్సెన్‌పై విజయం సాధించి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.

413

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles