స్వర్ణ పోరుకు సై


Sun,August 25, 2019 02:15 AM

-ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్..
-వరుసగా మూడోసారి ఫైనల్ చేరిన సింధు

అంచనాలు ఆకాశాన్నంటిన వేళ.. అనన్య సామాన్య పోరాటంతో దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్ చేరి హ్యాట్రిక్‌నమోదు చేసింది. గత రెండు పర్యాయాలు తుదిమెట్టుపై బోల్తా కొట్టిన తెలుగు తేజం ఈసారి పతకం రంగు మార్చాలనే కసితో.. సెమీ ఫైనల్లో చెన్ యుఫీని చిత్తుకింద కొట్టింది. పదునైన స్మాష్‌లు, సుదీర్ఘ ర్యాలీలు, సూపర్ క్రాస్ కోర్ట్ షార్ట్‌లు ఇలా ఒక్కటేమిటీ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పర్చుకుంటూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన సింధు ఎప్పటి నుంచో కలలు కంటున్న స్వర్ణ సౌరభానికి అడుగు దూరంలో నిలిచింది. ఇక తుదిపోరులో నొజోమీ ఒకుహారాపై కూడా ఇదే జోరు కనబరిస్తే.. తనపై పడ్డ సిల్వర్ స్టార్‌ముద్రను చేరిపేసుకోవడం ఖాయమే. ఔర్ ఎక్ ధక్కా.. స్వర్ణం పక్కా.. శభాష్ సింధు.. ఆల్‌ది బెస్ట్..! మరోవైపు సంచలన ప్రదర్శనతో పురుషుల సింగిల్స్‌లో 36 ఏండ్ల తర్వాత భారత్ నుంచి తొలిసారి సెమీఫైనల్ చేరిన భమిడిపాటి సాయి ప్రణీత్.. ఆ అడ్డుగోడను అధిగమించలేక పోయాడు. ప్రపంచ నంబర్‌వన్ కెంటా మెమోటా చేతిలో ఓడి కాంస్యం చేజిక్కించుకున్నాడు. ఈ మెగాటోర్నీ పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే (1983) తర్వాత భారత్‌కు ఇదే తొలి పతకం.
Sindhu
బాసెల్ (స్విట్జర్లాండ్): పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. వరుసగా మూడోసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. అద్వితీయ ఆటతీరుతో ముందుకు సాగిన సింధు సెమీఫైనల్లో చైనా ప్లేయర్ చెన్ యుఫీను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. శనివారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21-7, 21-14తో ఆల్‌ఇంగ్లం డ్ విజేత, ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫీపై గెలుపొందింది. ప్రపం చ చాంపియన్‌షిప్‌లో 2013, 2014లో కాంస్యాలు నెగ్గిన సింధు.. ఆ తర్వాత 2017, 2018లో రజతాలు గెలుచుకుంది. అందని ద్రాక్షలా ఊరిస్తున్న పసి డి పతకాన్ని కైవసం చేసుకోవాలనే కృతనిశ్చయంతో వరుసగా మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మరో తెలుగు షట్లర్ సాయి ప్రణీత్ 13-21 8-21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటా మెమోటా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. సంచలన విజయాలతో సెమీఫైనల్లో అడుగుపెట్టిన సాయి.. మెమోటాను నిలువరించలేకపోయాడు. ఫలితంగా 36 ఏండ్ల తర్వాత ఈ మెగాటోర్నీలో పురుషుల విభాగంలో పతకం చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరిగే మహిళల సింగి ల్స్ తుదిపోరులో.. 2017 చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ ఒకుహారా (జపాన్)తో సింధు తలపడనుం ది.

ఎక్కడా తగ్గని సింధు..

ఈ టోర్నీ కోసమే రెండు నెలలుగా కఠోర శిక్షణ తీ సుకుంటున్న సింధు.. కీలక మ్యాచ్‌లో ఆదినుంచి ఆధిపత్యం కనబర్చింది. 41 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. తొలి గేమ్ ఆరంభంలోనే 4-1తో ముందంజలో నిలిచిన పీవీ.. కాసేపటికే ఆధిక్యాన్ని 14-3కు పెంచుకుంది. ఓ వైపు సింధు అదరగొడుతుంటే.. చైనా ప్లేయర్ చేసేదేమిలేక చేష్టలుడిగి చూస్తుండిపోయింది. ఒత్తిడిలో కూరుకుపోయిన చెన్ పదే పదే తప్పులు చేస్తుం టే.. సింధు మాత్రం తనకే సాధ్యమైన ఆటతీరుతో ముందుకు సాగింది. అదే ఊపులో 21-7తో గేమ్‌ను సొంతం చేసుకుంది.

ప్రతిఘటన ఎదురైనా..

సింధుకు రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. ఆరంభంలో ఇద్దరూ హోరాహోరీగా పోరాడటంతో ఒక దశలో స్కోరు 3-3తో సమమైంది. క్రాస్ కోర్టు షాట్లతో ప్రత్యర్థిని అలిసిపోయేలా చేయడం.. ఆనక అలవోకగా పాయింట్లు కొల్లగొట్టడం ఇదే స్ట్రాటజీతో రెండో గేమ్‌లో రెచ్చిపోయిన సింధు.. 36 షాట్ల సుదీర్ఘ ర్యాలీతో ఆరో పాయింట్ ఖాతాలో వేసుకుంది. బలమైన బ్యాక్ హ్యాండ్ షాట్లతో రెచ్చిపోయిన సింధు 11-7, 17-9తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో చివరకు 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకుంది.

ఈ విజయంతో నేను సంతోషంగానే ఉన్నాను. కానీ,సంతృప్తిగా లేను. ఇక్కడితోనే అయిపోలేదు మరో మ్యాచ్ మిగిలి ఉంది. అందులోనూ సత్తాచాటి స్వర్ణం నెగ్గడమే నా లక్ష్యం. అది అంత సులువు కాదు. ఈ టోర్నీ కోసం నేను చాలా ఓపిగ్గా.. శ్రద్ధగా సిద్ధమయ్యా. రెండో గేమ్‌లో కొన్ని తప్పిదాలు చేసినా.. ఆధిక్యంలోనే ఉండటంతో నా మనోధైర్యం పెరిగింది. ఆదివారం కూడా ఇదే స్ట్రాటజీతో బరిలో దిగుతా.
- పీవీ సింధు

ప్రణీత్ కాంస్య మెరుపులు

వరుస విజయాలతో సెమీస్ చేరిన తెలుగు షట్లర్ సాయి ప్రణీత్.. ప్రపంచ నంబర్‌వన్ కెంటా మెమోటా చేతిలో ఓడినా.. కాంస్య పతకం చేజిక్కించుకొని అబ్బుర పరిచాడు. 41 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ మెమోటా ముందు ప్రణీత్ నిలువలేకపోయాడు. తొలి గేమ్‌లో ప్రణీత్ 5-3తో ఆధిక్యం కనబర్చి అతిపెద్ద సంచలనం సృష్టించేలా కనిపించాడు. ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చిన ప్రణీత్10-11తో బ్రేక్‌కు వెళ్లాడు. విరామం నుంచి తిరిగొచ్చాక జోరందుకున్న జపాన్ ప్లేయర్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించాడు. ప్రత్యర్థి జోరు ముందు ప్రణీత్ పోరాటం చిన్నబోయింది. ఒత్తిడికి తలొగ్గిన ప్రణీత్ అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. షటిల్‌ను తప్పుగా అంచనా వేస్తూ.. ప్రత్యర్థికి స్కోరు పెంచుకునే అవకాశం ఇచ్చి గేమ్‌ను చేజార్చుకున్నాడు. ఇక రెండో గేమ్ మెదట్లో మంచి షాట్లు కొట్టిన ప్రణీత్ 2-2తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత మెమోటా బలమైన షాట్లకు బదులివ్వలేకపోయిన ప్రణీత్ వెనుకబడిపోగా.. వరుసగా ఏడు పాయింట్లు సాధించిన కెంటా 9-2తో ముందంజలో నిలిచాడు. ఇక అదే ఊపు కొనసాగించిన జపాన్ ప్లేయర్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకున్నాడు.
SaiPraneeth

కెరీర్‌లో ఇదే అత్యుత్తమ టోర్నమెంట్. నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. సెమీస్‌లో మెమోటా బలమైన షాట్లకు సరిగ్గా బదులివ్వలేకపోయా. ఏదో ఒక రోజు అతడిని కచ్చితంగా ఓడిస్తా.
- సాయి ప్రణీత్

799

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles