సింధుకు మళ్లీ షాక్


Wed,November 6, 2019 12:24 AM

-తొలి రౌండ్‌లోనే ఓటమి
-ముందడుగేసిన సాత్విక్ జోడీ

sindhu
ఫుజౌ (చైనా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. ప్రపంచ చాంపియన్ అయ్యాక బరిలో దిగిన అన్ని టోర్నీల్లోలానే బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 చైనా ఓపెన్‌లోనూ తడబాటు కొనసాగించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ ఆరో ర్యాంకర్ సింధు 13-21, 21-18, 19-21తో అన్‌సీడెడ్ చైనీస్ తైపీ ప్లేయర్ పాయ్ యుపో చేతిలో పరాజయం పాలైంది. 74 నిమిషాల పాటు సాగిన పోరు ప్రారంభంలో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన తెలుగమ్మాయి.. ఓ దశలో 12-8కి వచ్చినా ప్రత్యర్థికి వరుసగా ఎనిమిది పాయింట్లు సమర్పించుకొని తొలి గేమ్‌ను కోల్పోయింది. రెండో గేమ్‌లో తైపీ ప్లేయర్‌పై కాస్త పైచేయి సాధించిన సింధు గేమ్ గెలిచింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో పాయ్ యు జోరుతో సింధు 3-11తో వెనుకబడింది.
ఆ తర్వాత వరుసగా ఎనిమిది పాయింట్లు, మరోసారి వరుసగా ఆరుపాయింట్లు సాధించిన తెలుగు షట్లర్ 18-15తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ కీలక తరుణంలో ఒత్తిడిని జయించలేకపోయిన సింధు.. ప్రత్యర్థికి వరుసగా నాలుగు పాయింట్లు ఇచ్చుకొని టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 17-21, 18-21 తేడాతో గెమ్సే (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జోడీ 21-9, 21-15తో అమెరికా ద్వయం ఫిలిప్ -ర్యాన్‌ను ఓడించగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్ - అశ్వినీ పొన్నప్ప 21-19, 21-19తో హర్‌బర్ట్-జోసఫైన్ (కెనడా)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. మహిళల డబుల్స్‌లో ఎన్.సిక్కిరెడ్డి-పొన్నప్ప జోడీ తొలిరౌండ్‌లోనే నిష్క్రమించింది.

272

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles