డేవిస్‌ కప్‌ వేదిక మార్పు లేదు : పీటీఎఫ్‌


Mon,August 12, 2019 02:29 AM

కరాచీ: డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా పోటీల్లో భాగంగా భారత్‌-పాక్‌ మ్యాచ్‌లను తటస్థ వేదికలో నిర్వహిస్తారన్న వాదనలను పాకిస్థాన్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ (పీటీఎఫ్‌) తోసిపుచ్చింది. ఇస్లామాబాద్‌లోనే ఈ మ్యాచ్‌లు జరుగుతాయని, ఇందులో ఎలాంటి మార్పు లేదని ఆదివారం స్పష్టం చేసింది. సెప్టెంబర్‌ 14-15 తేదీల్లో ఇరు దేశాల మధ్య జరిగే పోటీల కోసం ఇస్లామాబాద్‌ క్రీడా ప్రాంగణంలో భద్రత సహా అన్ని ఏర్పాట్లను చేసినట్టు పీటీఎఫ్‌ చీఫ్‌ సలీమ్‌ సైఫుల్లా వెల్లడించారు. భారత జట్టు అభద్రతా భావంతో ఉండేందుకు ఎలాంటి కారణాలు లేవని చెప్పారు. ‘ఇస్లామాబాద్‌ భద్రతతో కూడిన నగరం. భారత ఆటగాళ్లు నాలుగు రోజుల పాటు ఇక్కడ ఉంటారు. వేదికల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశాం. ఇక ఇక్కడ ఆడేందుకు వారికి సమస్యేముంది’అని సైఫుల్లా అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుతో మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరగడంతో మ్యాచ్‌లను తటస్థ వేదికకు మార్చాలని ఐటీఎఫ్‌ను కోరతామని భారత టెన్నిస్‌ ఫెడరేషన్‌ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో అంతర్జాతీయ టెన్నిస్‌ ఫెడరేషన్‌(ఐటీఎఫ్‌) నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని పీటీఎఫ్‌ ప్రకటించింది.

278

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles