యువ భారత సైన్యమిదే..


Tue,December 3, 2019 02:07 AM

-అండర్‌-19 ప్రపంచకప్‌నకు జట్టు ప్రకటన
-కెప్టెన్‌గా ప్రియం గార్గ్‌.. తెలంగాణ ఆటగాడు తిలక్‌వర్మకు చోటు

Priyam-Garg
ముంబై: వచ్చే ఏడాది జరుగనున్న అండర్‌-19 ప్రపంచకప్‌ కోసం ఆలిండియా జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ సోమవారం 15 మందితో కూడిన యువ భారత జట్టును ఎంపిక చేసింది. దీనికి ఉత్తర్‌ప్రదేశ్‌ యువ సంచలనం ప్రియం గార్గ్‌ సారథ్యం వహించనుండగా.. తెలంగాణ బ్యాట్స్‌మన్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2020 జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న ఈ టోర్నీలో భారత్‌.. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలో దిగనుంది. ప్రపంచకప్‌నకు ముందు దక్షిణాఫ్రికా అండర్‌-19 జట్టుతో యువ భారత్‌ తలపడనుంది. సఫారీలతో 3 వన్డేల సిరీస్‌తో పాటు నాలుగు దేశాల వన్డే టోర్నీ కోసం ముందుగానే దక్షిణాఫ్రికాకు పయనమవనుంది. ప్రొటీస్‌తో సిరీస్‌కు ఈ 15 మందితో పాటు హైదరాబాద్‌కు చెందిన మరో ఆటగాడు రక్షణ్‌ కూడా ఎంపికయ్యాడు. మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొననున్నాయి. ఒక్కో గ్రూపులో నాలుగేసి జట్ల చొప్పున మొత్తం 4 గ్రూపులు ఉంటాయి. క్వాలిఫయర్‌ జపాన్‌, న్యూజిలాండ్‌, శ్రీలంకతో కలిసి యువ భారత జట్టు గ్రూప్‌-ఏలో ఉంది. ఇప్పటివరకు 12 సార్లు అండర్‌-19 ప్రపంచకప్‌ జరుగగా.. అందులో భారత్‌ నాలుగు టైటిల్స్‌ పట్టింది. మహమ్మద్‌ కైఫ్‌ (2000), విరాట్‌ కోహ్లీ (2008), ఉన్ముక్త్‌ చంద్‌ (2012), పృథ్వీ షా (2018) దేశానికి ప్రపంచకప్‌ ట్రోఫీలు అందించారు.

భిన్న నేపథ్యాల నుంచి..

ఒకరు పానీపూరి అమ్ముకుంటూ ఇక్కడి వరకు వస్తే.. మరొకరు కన్నతల్లి కలలను నిజం చేస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ప్రస్తుతం యువ జట్టులో ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. అందులో ముఖ్యంగా యశస్వి జైస్వాల్‌ గురించి చెప్పుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 17 ఏండ్ల యశస్వి క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఇళ్లు వదిలి ముంబై చేరాడు. కడుపు నింపుకునేందుకు పానీపూరిలు అమ్ముకున్న ఈ చిన్నోడు.. బ్యాట్‌పడితే బౌండ్రీలే హద్దుగా చెలరేగిపోతున్నాడు. మ్యాచ్‌ ఏదైనా బ్యాట్‌తో అదరగొట్టడమే పనిగా పెట్టుకున్న యశస్వి.. విజయ్‌ హజారే ట్రోఫీలో ముంబై తరఫున డబుల్‌ సెంచరీ చేయడం ద్వారా లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇప్పుడతడికి ప్రపంచకప్‌ రూపంలో మరో చక్కటి అవకాశం దక్కింది. జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన ప్రియం గార్గ్‌ ఈ ఏడాది రంజీల్లో దాదాపు 65 సగటుతో 814 పరుగులు చేశాడు. 18 ఏండ్ల అధర్వ అంకొలేకర్‌ది మరో కథ. పదేండ్ల వయసులోనే తండ్రి చనిపోతే.. తల్లి సంకల్పమే అతడిని ఈ స్థాయికి చేర్చింది. తండ్రి నిర్వర్తించిన బస్సు కండక్టర్‌ ఉద్యోగాన్ని కొనసాగించిన తల్లి.. అన్నీ తానై కొడుకును ముందుకు నడిపించింది. జన్మనిచ్చిన తల్లి కలలను నిజం చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌.. మెగాటోర్నీ వేదికగా చెలరేగిపోవాలని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. కార్గిల్‌ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన యుద్ధ వీరుడి కుమారుడు ధ్రువ్‌ జొరెల్‌ యువ జట్టుకు వికెట్‌ కీపర్‌గా వ్యవహరించనున్నాడు.

భారత అండర్‌-19 జట్టు: ప్రియం గార్గ్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, ఠాకూర్‌ తిలక్‌ వర్మ, దివ్యాన్ష్‌ సక్సేనా, ధ్రువ్‌ చంద్‌ (వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), శషావత్‌ రావత్‌, దివ్యాన్ష్‌ జోషి, శుభంగ్‌ హెగ్డే, రవి బిష్ణోయ్‌, ఆకాశ్‌ సింగ్‌, కార్తీక్‌ త్యాగి, అథర్వ అంకొలేకర్‌, కుమార్‌ కుషాగ్ర (వికెట్‌ కీపర్‌), సుశాంత్‌ మిశ్రా, విద్యాధర్‌ పాటిల్‌.

ఈరోజు కోసమే..


Tilak-Varma
దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఏడాది జరిగే అండర్‌-19 ప్రపంచకప్‌నకు ఎంపిక కావడమే నా ముందున్న లక్ష్యం అని ఈ ఏడాది ఆరంభంలోనే స్పష్టం చేసిన తిలక్‌ వర్మ ఇప్పుడా చాన్స్‌ దక్కించుకున్నాడు. టీమ్‌ఇండియాకు సెలెక్ట్‌ కావాలంటే.. అండర్‌-19, అండర్‌-23, రంజీ, ఐపీఎల్‌ ఇలా అనేక మార్గాలున్నా.. కుర్రాళ్ల ప్రపంచకప్‌లో మెరిస్తే.. అవకాశం దానంతటదే వస్తుందని అతడి నమ్మకం. ఆ లీగ్‌, ఈ లీగ్‌ అని కాకుండా ఆడిన మ్యాచ్‌లన్నింటిలోనూ తనను తాను నిరూపించుకున్న ఈ యువ సంచలనం 2020 అండర్‌-19 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా, గంటల తరబడి క్రీజులో పాతుకుపోయే సామర్థ్యం, వయసుకు మించిన పరిణతి, క్రికెట్‌ పుస్తకాల్లోని ప్రతీ షాట్‌ ఆడగల నేర్పు వెరసి తిలక్‌ను మంచి బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దాయి. అండర్‌-19 స్థాయిలో ఇప్పటికే తన సత్తా ఏంటో చాటిన ఠాకూర్‌.. ఇక మెగాటోర్నీలో మెరువాలని ఆశిద్దాం.

సీకే నాయుడు, శివలాల్‌ యాదవ్‌, ఎంఎల్‌ జయసింహ, అజారుద్దీన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, అంబటి రాయుడు.. ఇలా ఎందరో గొప్ప బ్యాట్స్‌మెన్‌ను జాతీయ జట్టుకు అందించిన హైదరాబాద్‌ గడ్డ ఇప్పుడు మరో ఆణిముత్యాన్ని తీర్చిదిద్దింది. ప్రస్తుతానికి అండర్‌-19 జట్టుకే ఎంపికైనా.. సీనియర్‌ జట్టు తరఫున సత్తాచాటగల అన్ని లక్షణాలున్న ఆ యువ సంచలనం పేరే నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ. మెదక్‌ జిల్లాకు చెందిన నంబూరి నాగరాజు, గాయత్రి దేవిల సంతానమైన తిలక్‌కు చిన్నతనం నుంచి క్రికెటంటే ప్రాణం. ఆ జిజ్ఞాసను పసిగట్టిన తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించడంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన అతడు ఇటీవలి కాలంలో అండర్‌-19 స్థాయిలో దుమ్మురేపుతున్నాడు. దేవధర్‌ ట్రోఫీ, విజయ్‌ హజారే, రంజీ ఇలా జట్టు ఏదైనా.. తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే భారత అండర్‌-19 జట్టు తరఫున అంతర్జాతీయ స్థాయిలో శతకాలతో మెరిసిన తిలక్‌ వర్మ.. అవసరమైతే బంతితోనూ అదరగొట్టగలడు. టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు ఇష్టపడే తిలక్‌.. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొని టీమ్‌ఇండియాకు ఎంపికవడమే తన లక్ష్యమంటున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న తిలక్‌ వర్మ అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికవడం చాలా ఆనందంగా ఉందంటున్నాడు. ప్రపంచకప్‌లో సత్తాచాటేందుకు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.

nagaraju
తిలక్‌కు చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే పిచ్చి. అతడి పట్టుదల చూస్తే ముచ్చటేస్తుంది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ మంచి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు సాధించాడు. తాజాగా అండర్‌-19 ప్రపంచకప్‌లో పా ల్గొనే భారత జట్టుకు ఎంపికవడం మా ఆనందాన్ని రెట్టింపు చేసింది.
- నంబూరి నాగరాజు, తిలక్‌ వర్మ తండ్రి

1032

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles