పాండ్యా, రాహుల్‌పై రెండు వన్డేల నిషేధం?


Fri,January 11, 2019 02:59 AM

-ప్రతిపాదించిన వినోద్ రాయ్
-బీసీసీఐ లీగల్ సెల్ సలహా కోరిన డయానా

న్యూఢిల్లీ: మహిళలను కించపరిచేలా మాట్లాడిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై కఠినచర్యలు తీసుకునే దిశగా బీసీసీఐ ఆలోచనలు కొనసాగుతున్నాయి. టీమ్ ఇండియా క్రికెటర్లు ఇద్దరిపై 2 వన్డేల వేటు వేయాల్సిందిగా గురువారం సీఈవో కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ సిఫారసు చేశారు. సీఈవో కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీ ఈ విషయాన్ని బీసీసీఐ లీగల్ సెల్‌కు పంపిన విషయం తెలిసిందే. అంతేకాదు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరి అభిప్రాయాన్నీ డయానా కోరినట్లు తెలుస్తున్నది. షో సందర్భంగా వారిద్దరూ మహిళలపై చేసిన వ్యాఖ్యలను విన్నాను. సభ్య సమాజం ఆమోదించేలా వారిద్దరి మాటలు లేవు. హార్దిక్ వివరణతో నేను సంతృప్తి చెందలేకపోతున్నాను. క్షమాపణతో ఈ తప్పును కప్పిపుచ్చలేరు అని రాయ్ తీవ్రంగా అన్నారు. ఈ విషయంలో డయానా అభిప్రాయం వెల్లడించిన అనంతరం వారిపై చర్యలను బీసీసీఐ ప్రకటించనుంది.

మీడియాతో మాట్లాడే విషయంలో భారత క్రికెటర్లకు, సహాయక సిబ్బందికి విడివిడిగా నిబంధనలు రూపొందించాలంటూ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి పంపిన మెయిల్‌లో వినోద్‌రాయ్ కోరారు. కాఫీ విత్ కరణ్ షోలో పాండ్యాతోపాటు పాల్గొన్న రాహుల్ .. మహిళల నుద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిగా ఉండను. వారిని అలాగే చూస్తాను. వారితో గడిపిన విషయాన్ని సైతం ఇంటికి వచ్చాక మా అమ్మానాన్నలకు చెబుతా అని పాండ్యా అన్నాడు. ఇదే షోలో రాహుల్ మాట్లాడుతూ 18 ఏండ్ల వయసులోనే నా జేబులో కండోమ్ దొరకడంతో మా అమ్మ ..మా నాన్న దృష్టికి తీసుకెళ్లింది. మొదట మా నాన్న నన్ను తిట్టినా..ఫర్లేదు..రక్షణ కవచం వాడావు అంటూ మెచ్చుకున్నారు అని వ్యాఖ్యానించాడు. ఈ షో ప్రసారం కావడంతో వీరిద్దరి మాటలపై సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం చెలరేగింది. కాంట్రాక్ట్ క్రికెటైర్లె ఉండీ ఇలా మాట్లాడడంపై సీవోఏ కమిటీ నోటీసులు జారీ చేయడంతో హార్దిక్ పాండ్యా ట్విట్టర్ వేదికగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని, మహిళలకు క్షమాపణ చెప్పాడు. కాగా, ఈ విషయంలో క్షమాపణ సరిపోదని, ఆసీస్‌తో సిరీస్‌కు ముందుగానే వీరిద్దరిపై రెండు వన్డేల్లో నిషేధం వేటు వేయాలని వినోద్ రాయ్ సూచించారు.

సస్పెండ్ చేసి విచారించాలి

టీమ్ ఇండియా క్రికెటర్లపై బీసీసీఐ తాత్కాలిక కోశాధికారి అనిరుధ్ చౌదరి మండిపడ్డారు. వీరిద్దరూ నోరు జారడం చూస్తుంటే వారిపై మ్యాచ్ ఫిక్సర్లు వలపన్నే అవకాశాలుంటాయన్నారు. సదరు ఆటగాళ్లను సస్పెండ్ చేసి విచారణ జరపాలని ఈమేరకు డయానా ఎడుల్జీకి రాసిన లేఖలో ఆయన కోరారు. ఇలాంటి షోల్లో మాట్లాడేందుకు ఆటగాళ్లు అనుమతి తీసుకున్నారా? తీసుకుంటే ఎవరి అనుమతి తీసుకున్నారో తెలుసుకోవాలని ఆయన డయానాకు సూచించారు. మరోవైపు రాహుల్, పాండ్యా క్షమాపణ చెబితే సరిపోదని డయానా కూడా తేల్చిచెప్పారు. వారిపై నిషేధం వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

315
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles