ఓటమితో వీడ్కోలు!


Wed,January 11, 2017 01:07 AM

-కెప్టెన్సీకి ధోనీ గుడ్‌బై..ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్‌కు నిరాశ
-3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఎలెవన్ రాయుడి సెంచరీ వృథా
భారత క్రికెట్ చరిత్రలో మరో అంకం ముగిసింది. ఇన్నాళ్లూ కెప్టెన్ అంటే తన పేరే గుర్తుకొచ్చేలా టీమ్ ఇండియాకు చిరస్మరణీయ విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వ పగ్గాలు వదిలేశాడు. వీడ్కోలు మ్యాచ్‌గా జరిగిన వామప్‌లో భారత్ ఓడటం కాస్త నిరాశ కలిగించినా.. గతంలో మాదిరిగానే తన వ్యూహాలతో ఈ జార్ఖండ్ డైనమెట్ మరోసారి ఆకట్టుకున్నాడు. చాలాకాలం తర్వాత తెలుగుతేజం అంబటి రాయుడు సెంచరీతో మెరువడం ఈ మ్యాచ్‌లో విశేషం.
dhoni
ముంబై: ధవన్ దంచాడు.. రాయుడు చెలరేగాడు.. యువరాజ్ మెరిశాడు.. ధోనీ డైనమెట్‌లా పేలాడు.. ఇన్నీ చేసినా.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఎకు ఓటమి తప్పలేదు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (5/60) మినహా మిగతా వారు నిరాశపర్చడంతో భారీస్కోరును కూడా టీమ్ ఇండియా కాపాడుకోలేకపోయింది. దీంతో మంగళవారం జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎలెవన్ జట్టు 3 వికెట్ల తేడాతో భారత్ ఎ జట్టుపై గెలిచింది. ముందుగా భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 304 పరుగులు చేసింది. అంబటి తిరుపతి రాయుడు (97 బంతుల్లో 100 రిటైర్డ్ ఔట్; 11 ఫోర్లు, 1 సిక్స్), ధోనీ (40 బంతుల్లో 68 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ధవన్ (84 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ సింగ్ (48 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు. తర్వాత ఇంగ్లండ్ 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 307 పరుగులు చేసింది. బిల్లింగ్స్ (85 బంతుల్లో 93; 8 ఫోర్లు) ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. హేల్స్ (40), జాసన్ రాయ్ (62) తొలి వికెట్‌కు 95 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత బిల్లింగ్... బట్లర్ (46)తో నాలుగో వికెట్‌కు 79, డావ్‌సన్ (41) ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

రాయుడు జోరు..


RAYUDU
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఎనిమిదో ఓవర్‌లోనే ఓపెనర్ మన్‌దీప్ సింగ్ (8) ఔటవడంతో భారత్ 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన తెలుగుతేజం తిరుపతి రాయుడు సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. చాలాకాలం నుంచి జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న అతను గ్రౌండ్ నలువైపులా షాట్లు కొడుతూ ఇంగ్లీష్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపెట్టాడు. రెండోఎండ్‌లో ధవన్ కూడా సమయోచితంగా స్పందించడంతో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ నిలకడగా సాగింది. అయితే రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించాక ధవన్ వెనుదిరిగాడు. తర్వాత వెటరన్ ఆటగాడు యువరాజ్ వచ్చీ రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
YUVRAJ
రషీద్ వేసిన 34వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు సంధించిన యువీ తాను ఫామ్‌లోకి వస్తే ఎలా ఉంటుందో రుచిచూపెట్టాడు. ఇక అర్ధసెంచరీ పూర్తయిన తర్వాత రాయుడు కూడా విజృంభించాడు. మొయిన్ అలీని లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకుని రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇద్దరు మూడోవికెట్‌కు 91 పరుగులు జోడించారు. ఈ దశలో వచ్చిన ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయినా.. రెండోవైపు ఆరు బంతుల వ్యవధిలో యువీ, శాంసన్ (0) వెనుదిరిగారు. కానీ ధోనీ మాత్రం దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండరీకి తరలించాడు. వోక్స్ వేసిన ఆఖరి ఓవర్‌లో ధోనీ రెండు భారీ సిక్సర్లతో సూపర్ ఫినిషింగ్ ఇవ్వడంతో భారత్ స్కోరు 300లు దాటింది.

968
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS