జొకోవిచ్ జయించెన్


Tue,September 11, 2018 02:27 AM

-యూఎస్ కింగ్ జొకోవిచ్
-యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం
-ఫైనల్లో డెల్‌పొట్రోపై అలవోక విజయం
-14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో సాంప్రస్ సరసన జొకోవిచ్
-ఫైనల్లో డెల్‌పొట్రోపై ఘన విజయం
-మూడోసారి చాంపియన్‌గా నిలిచిన సెర్బియా స్టార్..

djokovic
న్యూయార్క్: తిరిగిలేచిన ఫీనిక్స్ పక్షిలా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో మెరుపులు మెరిపించాడు. అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ చేరిన జొకోవిచ్.. అర్జెంటీనా ఆటగాడు మార్టిన్ డెల్‌పొట్రోను వరుససెట్లలో ఓడిస్తూ యూఎస్ ఓపెన్ టైటిల్‌ను ముచ్చటగా మూడోసారి అందుకున్నాడు. తద్వారా అమెరికా టెన్నిస్ దిగ్గజం పీట్ సంప్రాస్ 14గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల రికార్డును సమం చేశాడు. 20 గ్రాండ్‌స్లామ్స్‌తో అత్యధిక టైటిల్స్ సాధించిన ఫెదరర్ తొలిస్థానంలో కొనసాగుతుండగా..17 టైటిళ్లతో నాదల్ రెండోస్థానంలో నిలిచాడు. 15 ఏండ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 6 ఆస్ట్రేలియన్, 4 వింబుల్డన్, 3 యూఎస్ ఓపెన్, 1 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో 14 గ్రాండ్‌స్లామ్స్ సాధించాడు. నాదల్, ఫెదరర్ తరహాలోనే నాలుగుగ్రాండ్‌స్లామ్స్ (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్‌ఓపెన్) సాధించిన అరుదైన గ్రాండ్‌శ్లామ్ సాధించిన ఆటగాళ్ల సరసన నిలిచాడు.

గాయం నుంచి కోలుకున్న అనంతరం మళ్లీ మునుపటి ఆటతీరుతో చెలరేగుతున్న జొకోవిచ్ ఈ ఏడాది వింబుల్డన్‌తోపాటు చివరి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుని 14 టైటిళ్లతో మూడోస్థానానికి దూసుకువచ్చాడు. సోమవారం జరిగిన ఫైనల్లో 6-3, 7-6 (7/4), 6-3 స్కోరుతో డెల్‌పొట్రోను ఓడించిన జొకోవిచ్ మరోసారి యూఎస్ ఓపెన్ చాంప్‌గా నిలిచాడు. వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్స్ సాధించడంతో జొకోవిచ్(7)ర్యాంకింగ్స్‌లో మరింత ముందుకు దూసుకురానున్నాడు. తాజా గ్రాండ్‌స్లామ్ విజయంతో అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడోస్థానంలో నిలవనున్నాడు.

మునుపటి హవా కొనసాగిస్తూ..

ఒకవైపు వేడి..మరోవైపు భరించలేని ఉక్కబోత..ఐస్ ప్యాక్‌లతో ఉపశమనం పొందుతూ..ప్రతి రౌండ్‌లో విజయంకోసం చెమటోడుస్తూ సెర్బియా స్టార్ జొకోవిచ్ ఫైనల్ చేరుకోగా..మరోవైపు మోకాలిగాయంతో స్పెయిన్‌స్టార్ నాదల్ సెమీస్ పోరుకు ముందు టోర్నీ నుంచి తప్పుకోవడంతో డెల్‌పొట్రో సెమీస్‌లో శ్రమించకుండానే ఫైనల్ చేరుకున్నాడు. దీంతోపాటు అతనికి అదనపు విశ్రాంతి కూడా లభించడంతో ఈ పోరులో జొకోవిచ్‌కు కష్టాలు తప్పవని అంతా భావించారు. అంతేకాదు 2009లో యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలిసారే గ్రాండ్‌స్లామ్ విజయంతో మురిసినా మోచేతి గాయంతో వెనుకబడి మళ్లీ తాజాగా యూఎస్ ఓపెన్‌లోనే ఫైనల్ చేరాడు. దీంతో వీరిద్దరి పోరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నా..డెల్‌పొట్రో దూకుడును అద్భుతంగా నిలువరించిన జొకోనే చాంపియన్‌గా నిలిచాడు. తనపై నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ మూడోసారి యూఎస్ ఓపెన్ టైటిల్ ఒడిసిపట్టాడు.

ఆద్యంతం దూకుడుగా..

వీరిమధ్య జరిగిన పోటీ మూడుసెట్ల పాటు సాగినా..ప్రతి పాయింట్‌కోసం జొకోవిచ్ చెమటోడ్చాల్సి వచ్చింది. తొలిసెట్‌లో డెల్‌పొట్రో మూడు సర్వీసులలో రెండు సర్వీసులను బ్రేక్ చేసిన జొకోవిచ్ 6-3తో తొలిసెట్‌ను దక్కించుకున్నాడు. ఇక రెండోసెట్లో ఇద్దరిమధ్య భీకర సమరం సాగింది. సుదీర్ఘర్యాలీలు ఆడుతూ ఇరువురూ ప్రతి పాయింట్‌కోసం యుద్ధమే చేశారు. తొలుత 3-1 స్కోరుతో జొకోవిచ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లినా డెల్‌పొట్కో3-3 సెట్ పాయింట్లతో స్కోరు సమం చేశాడు. 24 షాట్లపాటు ర్యాలీలు కొనసాగించిన జొకో చివరకు పాయింట్ దక్కించుకోగా..అనంతరం సాగిన గేమ్ ఏకంగా 20 నిమిషాలపాటు సాగింది. దాదాపు గంటన్నరకు పైగా సాగిన రెండోసెట్‌ను ట్రైబ్రేకర్‌లో జొకో దక్కించుకున్నాడు. చివరి సెట్‌లోనూ వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా సాగినా.. చివరకు జొకోవిచ్ 6-3తో సెట్‌తోపాటు చాంపిన్‌షిప్ దక్కించుకున్నాడు. మొత్తంమీద 8సార్లు జొకోవిచ్ యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరగా..మూడుసార్లు చాంపియన్‌గా నిలిచాడు. అమెరికా ఓపెన్‌లో 2011,2015లో చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

delpotro
అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ సాధించిన రికార్డును జొకోవిచ్ అందుకుంటాడు. ఫెదరర్(20), నాదల్(17)లతో పోలిస్తే అతని వయసు 31 కావడంతోపాటు వీరిద్దరూ గ్రాండ్‌స్లామ్స్ సాధించేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తున్నది. అతని ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది. నొవాక్, రఫా, ఫెదరర్ ఆటచూస్తూ నా కెరీర్‌ను మలుచుకున్నాడు. వారిలా నేను గ్రాండ్‌స్లామ్స్ సాధించనందుకు విచారంగా లేదు. వారితో కలిసి ఆడే అవకాశం దక్కినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.
-డెల్‌పొట్రో, అర్జెంటీనా

djokovic2
పీట్ సంప్రాస్ నా ఆరాధ్య ఆటగాడు. అతను రెండో వింబుల్డన్ ఆడిన సమయంలో అతని ఆటను టీవీలో చూశాను. అతని ఆటతీరు నన్ను టెన్నిస్‌ను ఎంచుకునేలా చేసింది. అతని స్ఫూర్తే నన్ను గ్రాండ్‌స్లామ్ విజయాలలో సంప్రాస్ సరసన నిలబెట్టింది. దిగ్గజ ఆటగాళ్లు ఫెదరర్, నాదల్‌తో కలిసి ఆడడంతోనే నేను సంపూర్ణ ఆటగాడిగా ఎదిగాను. ఇందుకు నేను వారికి రుణపడి ఉంటాను
- జొకోవిచ్, సెర్బియా

551

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles