కూర్పు కుదిరినట్లేనా?


Fri,March 15, 2019 12:44 AM

-ప్రపంచకప్ జట్టుపై స్పష్టత వచ్చిందన్న కోహ్లీ
-అయినా నాలుగో స్థానంపై వీడని సందిగ్ధత
-ధవన్ ఫామ్‌పై నీలి నీడలు
-తేలని రెండో వికెట్ కీపర్ పంచాయితీ

ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌నకు గట్టిగా మూడు నెలల సమయం కూడా లేదు. అందుబాటులో ఉన్న ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉన్నారా.. అంటే అదీ లేదు.. పోనీ కొత్త ఆటగాళ్లను పరీక్షించుకుందామంటే మ్యాచ్‌లు కూడా లేవు.. కనీసం ఐపీఎల్‌లో
రాణించిన వారికైనా అవకాశం ఇస్తారా అంటే ఆ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టమైన సంకేతాలిచ్చారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియా ప్రపంచకప్ జట్టు కూర్పు కుదిరిందా? ప్రయోగాల పేరు చెప్పి సొంతగడ్డపై ఆసీస్ చేతిలో రెండు సిరీస్‌లు చేజేతులా చేజార్చుకున్నారు. అయినా మెగా ఈవెంట్‌కు వెళ్లే ఆ 15 మంది ఎవరనే దానిపై స్పష్టత వచ్చిందా? వీటికి సమాధానం లభించాలంటే జట్టు ఎంపిక వరకు ఆగాల్సిందేనా?

Kohli
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: విదేశాల్లో భారత్ వరుసగా సిరీస్‌లు గెలిచినప్పుడు ఇదే ప్రపంచకప్ జట్టు అన్నారు. మహా అయితే ఒకటి, రెండు స్థానాలపై కసరత్తులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో వాటిని కూడా పూర్తి చేస్తాం.. అప్పట్లో విరాట్ చేసిన వ్యాఖ్యలివి. చెప్పినట్లుగానే ఆసీస్‌తో సిరీస్‌లో చాలా ప్రయోగాలు చేశారు.. కానీ ఏ ఒక్కటి విజయవంతం కాకపోగా కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. దీంతో కోహ్లీ ఇప్పుడు మాట మార్చి ప్రపంచకప్‌నకు సంబంధించిన ప్లాన్-ఏ సిద్ధంగా ఉందని చెబుతున్నాడు. అంటే కంగారూలతో సిరీస్‌లో ప్లాన్-బి విఫలమైందని పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు. దీనిని బట్టి తుది కూర్పుపై ఇంకా మేనేజ్‌మెంట్‌కు పూర్తి స్పష్టత రాలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో నాలుగో స్థానం ఎవరిది? రిజర్వ్ ఓపెనర్‌గా అవకాశం ఎవరికి ఇస్తారు? రెండో వికెట్ కీపర్ ఉంటాడా? లేడా? ఇలా ఈ సిరీస్‌లో సమాధానం దొరకని ఓ నాలుగైదు ప్రశ్నలకు విరాట్ ఏం జవాబిస్తాడో? చూడాలి.

నాలుగులో ఎవరు?

టీమ్‌ఇండియా బ్యాటింగ్ లైనప్‌లో స్పష్టమైన లోటు కనిపిస్తున్న స్థానం ఇది. ఎన్ని సిరీస్‌లు ఆడినా.. ఎంత మందికి అవకాశం ఇచ్చినా ఈ స్థానంలో ఎవరూ కుదురుకోవడం లేదు. దీంతో రవిశాస్త్రి ఓ అడుగు ముందుకేసి.. ప్రపంచకప్‌లో విరాట్ నాలుగో స్థానంలో ఆడతాడని చెప్పేశాడు. కానీ ఈ సిరీస్‌లో నాలుగో వన్డేలో ఈ స్థానంలో బరిలోకి దిగిన కోహ్లీ విఫలమయ్యాడు. ముందునుంచి అంబటి రాయుడుకు ఈ స్థానం కేటాయించినా.. న్యూజిలాండ్, ఆసీస్ గడ్డపై అతను విఫలంకావడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. కేఎల్ రాహుల్‌కు ఎక్కువ అవకాశం ఇస్తామని చెప్పినా.. అన్ని మ్యాచ్‌లు ఆడించలేకపోయారు. రిషబ్ పంత్, విజయ్ శంకర్‌ను పరీక్షించినా సక్సెస్ కాలేకపోయారు. అయితే రిజర్వ్ బెంచ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే గురించి కనీసం ఆలోచన కూడా చేయకపోవడం దురదృష్టకరం. దీంతో ఈ స్థానంపై ఇంకా డైలామా కొనసాగుతూనే ఉంది.

ధవన్ విఫలమైతే..

ప్రస్తుత లైనప్‌లో రోహిత్, ధవన్ మాత్రమే ఓపెనర్లు. ఈ సిరీస్‌లో శిఖర్ ఒకే ఒక్క శతకం చేశాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో మళ్లీ విఫలమయ్యాడు. ఒకవేళ ఇంగ్లండ్ గడ్డపై ఇది కొనసాగితే రిజర్వ్ ఓపెనర్‌గా ఎవర్ని పంపిస్తారు. ఓసారి రాహుల్ అంటారు... మరోసారి రిషబ్ పంత్ అటారు.. సమాధానం దొరకని ప్రశ్నగానే ఇది మిగిలిపోయింది. వీరిద్దర్ని కాదని రహానేకు ఏమైనా అవకాశం ఇస్తారా? మిగతా లైనప్‌లో విరాట్ (310) రెండు సెంచరీలతో సూపర్ ఫామ్‌లో ఉండగా, రోహిత్ (202) ఫర్వాలేదనిపిస్తున్నాడు. మిడిలార్డర్‌లో రా యుడు వైఫల్యం శేష ప్రశ్నగా మిగిలిపోతున్నది. కేదార్ జాదవ్‌లో నిలకడ లేదు. ధోనీ బ్యాటింగ్‌లోనూ అనిశ్చితి కొనసాగుతున్నది. విజయ్ శంకర్‌లో దూకుడు లేదు. మరి వీళ్లకు సరిపోయే ప్రత్యామ్నాయాలను సిద్ధం చేశారా? ఆల్‌రౌండర్‌గా శంకర్ స్థానంలో పాం డ్యాను తీసుకుంటామని స్పష్టత ఇచ్చినా.. ఈ మార్పుతో బ్యాటింగ్, బౌలింగ్ బలం సరిపోతుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Ambati-Rayudu

రెండో వికెట్ కీపర్ ఎవరు?

జట్టులో ధోనీ రెగ్యులర్ వికెట్ కీపర్. అతన్ని మించి ఆ స్థాయిలో కీపింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాళ్లు టీమ్‌ఇండియాలో దరిదాపుల్లో కూడా లేరు. కానీ.. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాలతో ధోనీ దూరమైతే రెండో వికెట్ కీపర్ ఎవరు? భవిష్యత్ తారగా అభివర్ణిస్తున్న రిషబ్ పంత్.. కంగారూలపై తేలిపోయాడు. అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్‌లో ఘోరంగా నిరాశపర్చాడు. కీలక సమయంలో క్యాచ్‌లు, స్టంపింగ్‌లు మిస్ చేయడంతో నాలుగో వన్డేలో ఆసీస్ భారీ స్కోరును ఛేదించింది. అతన్ని పక్కనబెడితే ఇప్పుడు భారత్‌కు ఉన్న మరో ప్రత్యామ్నాయం దినేశ్ కార్తీక్. టీ20 సిరీస్‌కు మాత్రమే అతనికి అవకాశం ఇచ్చి వన్డేలకు దూరం పెట్టారు. దీంతో అతన్ని తీసుకుంటారనే ఆశ సన్నగిల్లింది. ఇప్పుడు రిషబ్ విఫలమయ్యాడు కాబట్టి.. మళ్లీ కార్తీక్‌ను పిలుస్తారా? సెలెక్టర్ల ఆలోచన ఎలా ఉందో చూడాలి.

నాలుగో పేసర్ ఎవరు?

ఇంగ్లండ్ వెళ్లే జట్టులో ముగ్గురు పేసర్లుగా బుమ్రా, భువనేశ్వర్, షమీ కచ్చితంగా ఉంటారు. ఎందుకంటే అక్కడ స్పిన్నర్ల కంటే పేస్ బౌలింగ్ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ముగ్గుర్ని కాకుండా నాలుగో పేసర్‌గా ఎవర్ని తీసుకెళ్తారు. ఆసీస్‌తో సిరీస్ ముందువరకు ఉమేశ్ యాదవ్ ఫేవరెట్‌గా ఉండేవాడు. కానీ తొలి టీ20లో జట్టు ఓటమికి కారకుడయ్యాడు. చివరి ఓవర్‌లో 14 పరుగులను కాపాడలేకపోయాడు. దీంతో అతనిపై కోహ్లీ నమ్మకం పెడతాడా? రెండో టీ20లో సిద్ధార్థ్ కౌల్‌ను తీసుకున్నా.. కోటా పూర్తికాకముందే 45 పరుగులిచ్చాడు. తొలి రెండు వన్డేల్లో అతనికి ఆడే అవకాశం ఉన్నా తుది జట్టులో చోటు దక్కలేదు. మరి ఈ ఇద్దరిలో ఎవర్ని తీసుకుంటారన్న దానిపై నో క్లారిటీ.
Ravindra-Jadeja

జడ్డూ పరిస్థితి ఏంటీ?

ఈ సిరీస్‌లో జడేజా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో యూకే బెర్త్‌పై గ్యారంటీ లేకుండా పోయింది. స్పిన్ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలనుకుంటే జడేజాకు అవకాశం దక్కొచ్చు. స్పెషలిస్ట్‌గా స్పిన్నర్‌గా అయితే మాత్రం నో చాన్స్. ఎందుకంటే ఇప్పటికే కుల్దీప్, చాహల్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు రేసులో ఉన్నారు. అయితే చివరి రెండు వన్డేల్లో కుల్దీప్ పరుగులు ధారాళంగా ఇచ్చుకున్నాడు. సిరీస్ మొత్తంలో 10 వికెట్లే తీశాడు. బంతిని భిన్నంగా వేయడంలో చాహల్‌తో పోలిస్తే కుల్దీప్ ఓ మెట్టు పైనే ఉన్నాడు. దీనికితోడు బ్యాటింగ్ కూడా చేయగలడు. కాబట్టి కుల్దీప్ బెర్త్ పక్కా అయినా.. చాహల్, జడేజాలలో ఎవరి వైపు మొగ్గుతారో చూడాలి. వీటన్నింటిని విశ్లేషిస్తుంటే ఏప్రిల్ 20న జట్టును ప్రకటించే వరకు స్పష్టత రానట్లే.

510

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles