దాయాదితో ఆట కట్!


Tue,February 19, 2019 02:20 AM

Indian-team-bigsize

-క్రికెట్ మ్యాచ్‌లు కష్టమేనన్న రాజీవ్ శుక్లా
-ప్రత్యక్ష ప్రసారాల నుంచి తప్పుకున్న ఐఎంజీ
- పుల్వామా ఘటనపై క్రికెటర్ల ధ్వజం

సరిగ్గా మూడు నెలల తర్వాత ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌నకు తెరలేవబోతున్నది. లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లేదు కాబట్టి ఎలాంటి సమస్య లేదు. కానీ నాకౌట్ దశలో రెండు జట్లు తలపడాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ప్రస్తుతంనెలకొన్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్ రుగుతుందా? భారత్‌లో ఉగ్రదాడులతో సైనికులను పొట్టనపెట్టుకుంటున్న పాక్‌తో ఆడేందుకు మన ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? ఒకవేళ ఇవ్వకపోతే తదుపరి ప్రత్యామ్నాయాలు ఏమిటి? ఈ విషయంలో దేశం ఎలా స్పందిస్తుంది? ఆసక్తికరంగా మారిన ఈ అంశాలకు జవాబు దొరికేది ఎలా?
ఒకప్పుడు భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇరుదేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవి. దేశ ప్రధాని నుంచి కార్మికుల వరకు తమ పనులను వదిలేసుకుని మరీ మ్యాచ్‌ను తిలకించేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారా యి. పొరుగు దేశంతో మ్యాచ్ అంటే దేశం మొత్తం తిరగబడే పరిస్థితి వచ్చింది. 2008 ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు చేసుకున్న బీసీసీఐ.. పుల్వామా ఘటనతో దాయాది దేశంతో మ్యాచ్‌లకు ఫుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై కూడా ఇరుజట్ల మధ్య జరిగే మ్యాచ్‌లను రద్దు చేసుకోవాలని చూస్తున్నది. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే భవిష్యత్‌లో ఇక పాక్‌తో క్రికెట్ కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది మాజీ క్రికెటర్లు, బోర్డు పరిపాలకులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

ముంబై దాడితో మొదలు..
2008కి ముందు పాకిస్థాన్ ఎన్నిసార్లు భారత్‌పై దాడులకు దిగినా.. క్రికెట్‌ను మాత్రం ఆపిన దాఖల్లాలేవు. ఎక్కడ మ్యాచ్ జరిగినా సుహృద్భావ వాతావరణంలోనే ముగిసేది. ఆటగాళ్ల మధ్య వివాదాలు తలెత్తినా ఆ క్షణం వరకే ఉన్నాయి. బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన ఐపీఎల్‌లోనూ పాక్ ఆటగాళ్లకు అవకాశం కల్పించి తన సహృదయతను చాటుకుంది. దీనికితోడు భారత్‌తో మ్యాచ్‌లు ఆడటం పాక్‌కు అత్యవసరం. డబ్బులు, పేరు ప్రతిష్ఠలు కావాలంటే తప్పనిసరిగా బీసీసీఐ అండ ఉండాల్సిందే. కానీ 2008లో జరిగిన ముంబై ఉగ్రదాడి తర్వాత పరిస్థితి మొత్తం తలకిందులైంది. అప్పటి వరకు చూసి చూడకుండా వెళ్లిన భారత ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేయడంతో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను బీసీసీఐ రద్దు చేసుకుంది. కానీ అంతర్జాతీయ వేదికలపై మాత్రం మ్యాచ్‌లను కొనసాగించి అభిమానులను సంతృప్తిపరిచింది. అయితే అప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో తలెత్తిన కొన్ని పరిణామాల వల్ల బీసీసీఐ, పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య ఓ ఒప్పందం కుదిరింది. మళ్లీ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేలా ఇరుదేశాల బోర్డులు ఓ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. 2015-23 మధ్యలో ఆరు సిరీస్‌లు ఆడాలని నిర్ణయానికి వచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు సడలించకపోవడంతో బీసీసీఐ ఆ ఎంవోయూను పక్కనబెట్టింది.

నష్టపరిహారం కోసం..
ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బీసీసీఐ లొంగకపోవడంతో ద్వైపాక్షిక సిరీస్‌ల అంశాన్ని పీసీబీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మధ్యలో ఒకటి రెండుసార్లు పీసీబీ చైర్మన్లు భారత్ పర్యటనకు వచ్చి పెద్దలతో చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టడంతో కేసులు వేస్తామని బెదిరింపులకు దిగింది. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌తో మ్యాచ్‌లను రద్దు చేసుకుంటామని హెచ్చరించింది. అయినా బీసీసీఐ తన పట్టును సడలించకపోవడంతో ఇక చేసేదేమీలేక పీసీబీ.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఎంవోయూను ఉల్లంఘించినందుకు 70 మిలియన్ డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని హెచ్చరించింది. ఈ ఫిర్యాదు స్వీకరించిన ఐసీసీ రెండు దేశాల వాదనలు విన్న తర్వాత ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన పనిలేదని తీర్పు ఇచ్చింది. దీంతోపాటు కోర్టు కేసు ఖర్చులు కూడా బీసీసీఐకి చెల్లించాలని పీసీబీని ఆదేశించింది. దీంతో పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లకు శాశ్వతంగా తెరపడినట్లేనని భావిస్తున్న తరుణంలో.. పుల్వామా ఘటన మరో కఠినమైన నిర్ణయం తీసుకునేందుకు దోహదం చేయబోతున్నదా? అంటే ఔననే సమాధానమే వస్తున్నది.
sukla

పాక్‌తో ఆడేదే లేదు: శుక్లా


భవిష్యత్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడే ప్రసక్తే లేదని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చేసిన వ్యాఖ్యలతో మరింత బలం చేకూరింది. ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలా? వద్దా? అనేది కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని శుక్లా స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ పాక్‌పై ఎంతోకొంత సానుభూతి ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. క్రీడలను రాజకీయాలతో ముడిపెట్టకూడదని అనుకునేవాళ్లం. కానీ ఓ దేశం ఉగ్రవాదానికి స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంటే ఆ ప్రభావం క్రీడలపై కూడా కచ్చితంగా పడుతుంది. ఈ విషయంలో మేం చాలా స్పష్టతతో ఉన్నాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చే వరకు దాయాదితో మ్యాచ్‌లు ఆడే ముచ్చటే లేదు అని శుక్లా పేర్కొన్నారు. ప్రపంచకప్‌లో భారత్.. పాక్‌తో మ్యాచ్ ఆడుతుందా? అన్న ప్రశ్నకు శుక్లా సరైన సమాధానం ఇవ్వలేదు. మెగా ఈవెంట్‌కు ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో దానిపై మాట్లాడటం తగదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలన్నారు. ఇప్పటికైనా ఉగ్రవాదానికి పాక్ స్వస్తి పలుకాలని హితవు పలికారు. పుల్వామా ఘటనతో దేశంతో పాటు మాజీ క్రికెటర్లు, క్రికెట్ క్లబ్‌లు స్పందించిన తీరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అప్పట్లో ముంబైలో దాడి జరిగినా.. అక్కడే ఉన్న క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పాక్ క్రికెటర్ల చిత్రపటాలను తొలగించలేదు. కానీ పుల్వామా దాడితో ఇప్పుడు ఆల్‌రౌండర్ రెస్టారెంట్‌లో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, టీమ్ ఫొటోను తొలగించి జవాన్ల మృతికి సంఘీభావం తెలిపింది. ఇక పాక్‌కు కూత వేటు దూరంలో ఉండే మొహాలీలోనూ ఇదే సీన్ పునరావృతమైంది. స్టేడియంలో ఉన్న 15 మంది పాక్ క్రికెటర్ల ఫొటోలను తీసివేస్తూ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కఠిన నిర్ణయం తీసుకున్నది. ఈ సంఘటనలు కూడా పాక్‌తో క్రికెట్‌కు దూరమనే సంకేతాలిస్తున్నాయి.

పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల కుటుంబాలకు క్రికెటర్ మహ్మద్ షమీ ఆర్థిక సాయం ప్రకటించాడు. ఇలాంటి సందర్భం లో వారికి అండగా నిలువాలని కోరాడు.

996

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles