
హామిల్టన్: ఈ ఏడాది లార్డ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు కనబర్చిన క్రీడాస్ఫూర్తికి ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’ అవార్డు దక్కింది. ఈ మేరకు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘న్యూజిలాండ్ జట్టుకు ఈ అవార్డు పొందే అన్ని అర్హతలు ఉన్నాయి. తీవ్ర ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో కూడా కివీస్ ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. క్రికెట్‌కే వన్నెతెచ్చే అలాంటి తుదిపోరులో న్యూజిలాండ్ ప్లేయర్స్ ప్రదర్శించిన సంయమనం అమోఘం. జూలై 14న జరిగిన మ్యాచ్ గురించి ఇప్పటికీ చర్చించుకుంటున్నామంటే ఆ క్రీడాస్ఫూర్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు’ అని ఎంసీసీ అధ్యక్షుడు కుమార సంగక్కర పేర్కొన్నాడు. ఎంసీసీ, బీబీసీ సంయుక్త ఆధ్వర్యంలో గత ఆరేండ్లుగా (2013 నుంచి) ఈ అవార్డు నకిస్టోఫర్ మార్టీన్-జెన్కిన్స్)ను బహుకరిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 241 పరుగులు చేయగా.. లక్ష ఛేదనలో ఇంగ్లండ్ కూడా సరిగ్గా 241 పరుగులకే ఆలౌటైంది. అనంతరం నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా ‘టై’ కావడంతో మ్యాచ్‌లో ఎక్కువ బౌండ్రీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ నిబంధనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవడంతో పాటు.. మ్యాచ్‌లో అంపైరింగ్ నిర్ణయాలపై కూడా పలు ప్రశ్నలు తలెత్తాయి. మ్యాచ్ సందర్భంగా గప్టిల్ వేసిన త్రో బెన్ స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బంతి బౌండ్రీ దాటితే.. అంపైర్ ఆరు పరుగులు ఇచ్చాడు. నిబంధల ప్రకారం అప్పుడు 5 పరుగులే ఇవ్వాల్సి ఉన్నా.. కివీస్ ఆటగాళ్లు ఈ అంశంపై కనీసం నోరు మెదపలేదు. అంపైర్ నిర్ణయాన్ని శిరసావహించి చేతుల్లోకి వచ్చిన విశ్వకప్పును ఇంగ్లండ్‌కు అప్పగించారు.