అందినట్లే అంది..


Mon,February 11, 2019 02:56 AM

-ఇటు 2.. అటు 4 పరుగులు
-ఉత్కంఠ పోరులో భారత జట్ల ఓటమి
-సిరీస్‌లు ఎగురేసుకుపోయిన కివీస్
ఒకే రోజు.. ముందు.. వెనుకా.. న్యూజిలాండ్ గడ్డపై భారత క్రికెట్ జట్లకు చేదు అనుభవం ఎదురైంది. చరిత్రాత్మక పర్యటనకు ఘనమైన ముగింపు ఇవ్వాలనుకున్న రోహిత్ బృందం ఆఖర్లో బోల్తా కొడితే.. కౌర్‌సేన అందివచ్చిన అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది. ఇరుజట్లు స్ఫూర్తిదాయకమైన పోరాటం చేసినా.. ఫలితం మాత్రం ఆతిథ్య జట్లకు అనుకూలంగా వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌ల్లో ఆఖరి ఓవర్ వరకు విజయం భారత్ వైపే ఉన్నా.. చివర్లో చూపిన తెగువ సరిపోలేదు. కార్తీక్ (16 బంతుల్లో 33 నాటౌట్; 4 సిక్సర్లు ), కృనాల్ (13 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు 2 సిక్సర్లు) కసిదీరా కొట్టినా.. మందన (62 బంతుల్లో 86; 12 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి మెరిసినా అందినట్లే అందిన గెలుపు కాస్త స్వల్ప తేడాతో దూరమైంది. దీంతో కివీస్ గడ్డపై పొట్టి ఫార్మాట్‌లో తొలి టీ20 సిరీస్‌ను సాధించాలనుకున్న టీమ్‌ఇండియాకు భంగపాటు ఎదురుకాగా, క్లీన్‌స్వీప్‌ను అడ్డుకోవాలనుకున్న మహిళల జట్టు ఆశలు నెరవేరలేదు.

Vijay-Shankar

హామిల్టన్: గత మూడు నెలల నుంచి వరుస సిరీస్ విజయాలతో ఊపుమీదున్న భారత్ దూకుడుకు బ్రేక్ పడింది. బ్యాట్స్‌మెన్ వీరోచిత ప్రదర్శనలు చేసినా.. ఆదివారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో టీమ్‌ఇండియా 4 పరుగుల స్వల్ప తేడాతో కివీస్ చేతిలో ఓడింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఫలితంగా టీమ్‌ఇండియా వరుస తొమ్మిది సిరీస్‌ల విజయానికి అడ్డుకట్ట పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. కొలిన్ మున్రో (40 బంతుల్లో 72; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దుమ్మురేపాడు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మున్రోకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సీఫెర్ట్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.

మున్రో ముంచాడు..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోకపోవడం ఎంత తప్పో కెప్టెన్ రోహిత్‌కు తొలి ఓవర్‌లోనే తెలిసొచ్చింది. భువనేశ్వర్ తొలి ఓవర్‌లోనే సిక్సర్‌తో ఖాతా తెరిచిన మున్రో చివరి వరకు బాది వదిలేశాడు. ఖలీల్ వేసిన మూడో ఓవర్‌లో సీఫెర్ట్ ఓ సిక్స్, రెండు ఫోర్లతో 16 పరుగులు పిండుకున్నాడు. ఈ దెబ్బకు హార్దిక్, కృనాల్‌ను బౌలింగ్‌కు దించినా పరుగుల ప్రవాహం మాత్రం ఆగలేదు. ఆరో ఓవర్‌లో ఇద్దరు కలిసి రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదడంతో తొలి ఏడు ఓవర్లలో 11 రన్‌రేట్‌తో 79 పరుగులు వచ్చేశాయి. అయితే ఎనిమిదో ఓవర్‌లో కుల్దీప్ వచ్చి రావడంతోనే సీఫెర్ట్‌ను ఔట్ చేసి ఉపశమనం కలిగించాడు. తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

విలియమ్సన్ (21 బంతుల్లో 27; 3 ఫోర్లు) మెల్లగా ఆడినా.. ఓ ఎండ్‌లో మున్రో క్రమం తప్పకుండా ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. ఫలితంగా 12 ఓవర్లలో కివీస్ స్కోరు 118/1కి చేరింది. 13వ ఓవర్ తొలి బంతికి మున్రో ఇచ్చిన క్యాచ్‌ను స్కేర్ లెగ్‌లో ఖలీల్ వదిలిపెట్టాడు. ఆ వెంటనే ఓ ఫోర్, సిక్స్‌తో 17 పరుగులు రాబట్టిన మున్రో.. తర్వాతి ఓవర్ తొలి బంతికి కుల్దీప్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. 8 బంతుల తర్వాత విలియమ్సన్ కూడా ఔటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 55 పరుగులు జతయ్యాయి. ఇక గ్రాండ్‌హోమీ (16 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ (11 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు) ఓవర్‌కు రెండు, మూడు బౌండరీలు మధ్యలో సిక్స్‌లు బాదడంతో స్కోరు బోర్డు సునామీలా పరుగెత్తింది. నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించి గ్రాండ్‌హోమీ ఔటైనా.. చివర్లో టేలర్ (7 బంతుల్లో 14 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ఓ సిక్స్ బాదడంతో స్కోరు 200లు దాటింది.

శంకర్ జోరు

భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు సరైన శుభారంభం దక్కలేదు. ఐదో బంతికే ధవన్ (5) స్వీప్ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. కానీ వన్‌డౌన్‌లో విజయ్ శంకర్ మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. రోహిత్ (32 బంతుల్లో 38; 3 ఫోర్లు)తో కలిసి చకచకా ఫోర్లు బాదడంతో పవర్‌ప్లేలో 57 పరుగులు వచ్చాయి. సోధీ వేసిన ఎనిమిదో ఓవర్‌లో వరుస సిక్సర్లతో రెచ్చిపోయిన శంకర్.. తర్వాతి ఓవర్‌లోనే ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ధాటిగా ఆడిన రిషబ్ పంత్ (12 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్సర్లు) తొలి 10 బంతుల్లో 4, 6, 6, 6తో 23 పరుగులు సాధించాడు. మధ్యలో మిచెల్, సాంట్నెర్ పరుగులు కట్టడి చేయడంతో ఒత్తిడికి లోనైన పంత్ 13వ ఓవర్‌లో ఔటయ్యాడు. మూడో వికెట్‌కు 31 పరుగులు జతయ్యా యి. సిక్స్‌తో ఖాతా తెరిచిన హార్దిక్ పాండ్యా (11 బం తుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) మరో ఫోర్, సిక్స్ బాదినా.. రెండోఎండ్‌లో 14వ ఓవర్ ఆఖర్లో రోహిత్ ఆఫ్‌సైడ్ బం తిని వేటాడి వెనుదిరిగాడు. కానీ తర్వాతి ఎనిమిది బంతుల్లో భారత్‌కు కోలుకోలేని దెబ్బ తగిలిం ది. నాలుగు బం తుల తేడాతో హా ర్దిక్, ధోనీ (2) వెనుదిరగడంతో అప్పటివరకు మ్యాచ్‌లో ఆధిక్యంలో ఉన్న టీమ్‌ఇండియా ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో వచ్చిన కార్తీక్, కృనాల్ కండ్లు చెదిరే షాట్లతో విరుచుకుపడుతూ చేజారిన ఇన్నింగ్స్‌ను గాడిలోపెట్టారు. ముఖ్యంగా కృనాల్ సిక్స్, ఫోర్లతో రెచ్చిపోవడంతో 18 ఓవర్లలో జట్టు స్కోరు 183/6కి చేరింది.

ఆఖర్లో బోల్తా..

karthik
భారత్ గెలువాలంటే 12 బంతుల్లో 30 పరుగులు చేయాలి. క్రీజులో దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యా.. ఇద్దరూ హిట్టర్లే.. పొట్టి ఫార్మాట్‌లో ఇది పెద్ద లక్ష్యం కూడా కాకపోవడంతో... టీమ్‌ఇండియా గెలుపు ఖాయమే అనుకున్నారు. అనుకున్నట్లుగానే చెరో సిక్స్ బాదడంతో 19వ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. విజయ సమీకరణం 6 బంతుల్లో 16 పరుగులుగా మారింది.
ఇక రోహిత్‌సేన విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు.. కానీ డ్రామాను రక్తి కట్టించాల్సిన కార్తీక్ అతి విశ్వాసం మ్యాచ్‌నే చేజారేలా చేసింది. ఎలాగంటే.. ఆఖరి ఓవర్ వేసేందుకు సౌతీ బంతిని అందుకున్నాడు..
తొలి బంతికి కార్తీక్ రెండు పరుగులు తీశాడు... ఇక కావాల్సింది 5 బంతుల్లో 14 పరుగులు. రెండో బంతి వైడ్‌గా వేసినా.. కార్తీక్ ముందుకు రావడంతో సింగిల్ రాలేదు.. వైడూ ఇవ్వలేదు.. 4 బంతుల్లో 14 పరుగులు కావాలి.
మూడో బంతిని లాంగాన్‌లో లాఫ్టెడ్ షాట్‌గా మల్చడంలో కార్తీక్ లైన్ తప్పాడు.. కృనాల్ సింగిల్ కోసం అవతలి వైపు చేరుకున్నా.. అతి ఆలోచనతో కార్తీక్ పరుగు తీయలేదు... సమీకరణం 3 బంతుల్లో 14 పరుగులు. అయినా ఎక్కడో ఆశ.. కసితో కార్తీక్ ఏదో చేస్తాడని.. కానీ..
నాలుగో బంతి బౌన్సర్.. దీనిని ఊహించని కార్తీక్ సింగిల్ తీశాడు... మిగిలిన 2 బంతుల్లో 13 పరుగులు అవసరం.
కనీసం రెండు సిక్సర్లు బాదినా.. మ్యాచ్ డ్రాఅవుతుందనే ఆశ..!
ఐదో బంతి యార్కర్‌కి కృనాల్ సింగిల్.. మిగిలింది 1 బంతి 12 పరుగులు.. భారత్ పరాజయం ఖాయం.
షార్ట్ పిచ్‌గా వచ్చిన ఆరో బంతి వైడ్‌గా వెళ్లింది. కార్తీక్ ఫుల్ షాట్‌కు ప్రయత్నిం చి విఫలమయ్యాడు.. 1 బంతి 11 పరుగులు.. కార్తీక్ ఓవర్ కవర్స్‌లో బంతిని స్టాండ్స్‌లోకి పంపినా ప్రయోజనం లేకపోయింది. క్షణక్షణం ఉత్కంఠ కలిగించిన మ్యాచ్‌లో భారత్ గట్టెక్కలేకపోయింది.
newzeland
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదో గొప్ప విషయం. పరిస్థితులకు తగ్గట్టుగా బ్యాటింగ్ చేయడంపై దృష్టిపెట్టా. భారత్‌లాంటి జట్టుకు ఆడుతున్నప్పుడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆసీస్, కివీస్ సిరీస్‌ల్లో నేను చాలా నేర్చుకున్నా. బౌలింగ్ ఎక్కువగా చేయకపోయినా, భిన్న పరిస్థితుల్లో ఎలా వేయాలో తెలుసుకున్నా. ధోనీ, విరాట్, రోహిత్‌ను చూసి బ్యాటింగ్‌లో చాలా పరిణతి సాధించా. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే జట్టుతో పాటు వ్యక్తిగతంగా చాలా లాభం చేకూరేది. పరిస్థితులను తొందరగా ఆకళింపు చేసుకుని నిలకడగా ఆడటం చాలా ప్రధానం. ఇందులో కొంత వరకు సఫలమయ్యా. మొత్తానికి ఓ పరిపూర్ణమైన క్రికెటర్‌గా మారినందుకు చాలా సంతోషంగా ఉంది.
-విజయ్ శంకర్

స్కోరు బోర్డు


న్యూజిలాండ్: సీఫెర్ట్ (స్టంప్) ధోనీ (బి) కుల్దీప్ 43, మున్రో (సి) హార్దిక్ (బి) కుల్దీప్ 72, విలియమ్సన్ (సి) కుల్దీప్ (బి) ఖలీల్ 27, గ్రాండ్‌హోమీ (సి) ధోనీ (బి) భువనేశ్వర్ 30, మిచెల్ నాటౌట్ 19, టేలర్ నాటౌట్ 14, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 212/4. వికెట్లపతనం: 1-80, 2-135, 3-150, 4-193. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-37-1, ఖలీల్ అహ్మద్ 4-0-47-1, హార్దిక్ 4-0-44-0, కృనాల్ 4-0-54-0, కుల్దీప్ 4-0-26-2.

భారత్: ధవన్ (సి) మిచెల్ (బి) సాంట్నెర్ 5, రోహిత్ (సి) సీఫెర్ట్ (బి) మిచెల్ 38, శంకర్ (సి) గ్రాండ్‌హోమీ (బి) సాంట్నెర్ 43, రిషబ్ (సి) విలియమ్సన్ (బి) టిక్నెర్ 28, హార్దిక్ (సి) విలియమ్సన్ (బి) కుగ్గెలిన్ 21, ధోనీ (సి) సౌతీ (బి) మిచెల్ 2, కార్తీక్ నాటౌట్ 3, కృనాల్ నాటౌట్ 26, ఎక్స్‌ట్రాలు: 12, మొత్తం: 20 ఓవర్లలో 208/6.వికెట్లపతనం: 1-6, 2-81, 3-121, 4-141, 5-145, 6-145.బౌలింగ్: సాంట్నెర్ 3-0-32-2, సౌతీ 4-0-47-0, కుగ్గెలిన్ 4-0-37-1, టిక్నెర్ 4-0-34-1, సోధీ 2-0-30-0, మిచెల్ 3-0-27-2.

mandana
హామిల్టన్: అమ్మాయిలకు అదృష్టం అస్సలు కలిసి రాలేదు. అందినట్లే అందిన మ్యాచ్ చేజారిపోయింది. ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకుందామనుకున్న టీమ్‌ఇండియా పోరాడి ఓడింది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌కౌర్ సేన 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. కివీస్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. గత మ్యాచ్‌ల్లో లాగానే ఈసారి మన అమ్మాయిలు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. సహచరులు విఫలమవుతున్న చోట సూపర్ ఫామ్‌తో అలరిస్తున్న స్మృతి మందన(62 బంతుల్లో 86, 12ఫోర్లు, సిక్స్) మరోమారు అర్ధసెంచరీతో కదంతొక్కింది. 29 పరుగులకే ప్రియా పూనియా(1) వికెట్‌ను చేజార్చుకున్న టీమ్‌ఇండియాను..జెమీమా రోడ్రిగ్స్(21)తో కలిసి మందన గాడిలో పడేసింది. వీరిద్దరు కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు కీలక పరుగలు జత చేశారు. ముఖ్యంగా మంచి ఫామ్‌మీదున్న ముంబైకర్ మందన టీ20ల్లో ఎనిమిదో అర్ధసెంచరీని ఖాతాలో వేసుకుంది.

kiwis
మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించింది. వీరిద్దరి దూకుడు చూస్తే మ్యాచ్ మన చేతుల్లోనే ఉందనిపించింది. కానీ రోడ్రి గ్స్ నిష్క్రమణతో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన కెప్టెన్ కౌర్(2)మరోమారు నిరాశపరిచింది. విజయానికి 4.3 ఓవర్లలో 39 పరుగులు అవసరమైన దశలో సీనియర్ మిథాలీరాజ్(24 నాటౌట్), దీప్తిశర్మ(21 నాటౌట్) ఆకట్టుకున్నారు. వీరు గెలుపుపై ఆశలు రేపుతూ కివీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. కాస్ప్రెక్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ చివరి బంతికి గెలుపునకు 4 పరుగులు కావాల్సిన క్రమంలో మిథాలీ ఒక పరుగుకే పరిమితం కావడంతో ఓటమి వైపు నిలువాల్సి వచ్చింది. డివైన్(2/21)కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు సోఫీ డివైన్(72), కెప్టెన్ సాథర్‌వైట్(31) రాణింపుతో కివీస్ 20 ఓవర్లలో 161/7 స్కోరు చేసింది. 69 పరుగులకే సుజీ బేట్స్(24), రోవ్(12) వికెట్లను కోల్పోయిన కివీస్‌ను డివైన్, సాథర్‌వైట్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆఖర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్‌కు భారీ స్కోరు సాధ్యపడలేదు. దీప్తిశర్మ(2/28)కు రెండు వికెట్లు దక్కగా, జోషి, అరుంధతి, రాధా యాదవ్, పూనమ్‌యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న డివైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్: 20 ఓవర్లలో 161/7(డివైన్ 72, సాథర్‌వైట్ 31, దీప్తిశర్మ 2/28, మాన్సీ జోషి 1/27), భారత్: 20 ఓవర్లలో 159/4(మందన 86, మిథాలీరాజ్ 24 నాటౌట్, డివైన్ 2/21, కెర్ 1/26).

1075

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles