షమీ ఔట్.. సైనీకి పిలుపు


Tue,June 12, 2018 05:01 AM

shami
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌తో ఈనెల 14న మొదలయ్యే ఏకైక టెస్ట్‌కు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో నిర్వహించిన యో-యో ఫిట్‌నెస్ పరీక్షలో షమీ ఫెయిలయ్యాడు. దీంతో టెస్ట్ జట్టు నుంచి షమీని తప్పిస్తూ ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ ఢిల్లీ యువ బౌలర్ నవ్‌దీప్‌సైనీ అవకాశం కల్పించింది. గత రెండు దేశవాళీ సీజన్లలో తనదైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టిన ఈ 25 ఏండ్ల స్పీడ్‌స్టర్ ఓవరాల్‌గా 31 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు పడగొట్టాడు. వాస్తవానికి వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో పర్యటించే భారత ఎ జట్టుకు సైనీని ఎంపిక చేశారు. అయితే షమీ నిష్క్రమణతో ఖాళీ అయిన స్థానాన్ని సైనీతో భర్తీ చేశామని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆఫ్ఘన్‌తో టెస్ట్ కోసం సిద్ధమవుతున్న టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌కు నెట్స్‌లో బౌలింగ్ చేయాలని హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌తో పాటు రజ్‌నీశ్ గుర్బానీని కోరింది. మరోవైపు భారత ఎ జట్టుకు ఎంపికైన సంజూ శాంసన్ యో-యో పరీక్షలో విఫలమయ్యాడు. దీంతో శాంసన్ స్థానంలో యువ వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

saini

అంతా గంభీర్ వల్లే!

భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన నవ్‌దీప్‌సైనీ మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. 2013 వరకు టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడిన సైనీ తన కెరీర్ ఇంతలా మలుపు తిరుగడానికి కారణం ఢిల్లీ కెప్టెన్ గంభీర్ అని చెప్పాడు. నా ప్రతిభను గుర్తించి, సెలెక్టర్లను ఒప్పించి ఢిల్లీ జట్టు తరఫున ఆడేందుకు గంభీర్ అవకాశమిచ్చాడు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లోనూ సత్తాచాటాను. ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా టెన్నిస్ బంతితో వేసినట్లే వేయమంటూ గౌతీ ప్రోత్సహించడం కెరీర్ ఎదుగుదలకు కారణమైంది అని 25 ఏండ్ల సైనీ అన్నాడు.

988

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles