ఒసాకా సంచలనం


Mon,September 10, 2018 01:55 AM

-ఫైనల్లో సెరెనాపై అద్భుత విజయం
-గ్రాండ్‌స్లామ్ గెలిచిన తొలి జపాన్ మహిళగా రికార్డు
-గ్రాండ్ సలామ్
-కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన జపాన్ అమ్మాయి ఒసాకా
ఫైనల్లో సెరెనాపై సంచలన విజయం.. చైర్ అంపైర్‌ను దూషించిన అమెరికా స్టార్ ఓవైపు ఆటను ఔపోసన పట్టిన ధ్రువతార.. మరోవైపు కొత్త అడుగులు వేస్తున్న యువ తార.. ఓటమిని ఓ పట్టాన అంగీకరించని నైజం ఒకరిది.. విజయం విలువెంటో తెలియని అమాయకత్వం మరొకరిది.. రికార్డుల వెల్లువకు.. ఘనతల గొప్పతనానికి ప్రతీక సెరెనా.. పోరాట స్ఫూర్తికి.. నైపుణ్యం స్థాయికి పరాకాష్ట ఒసాకా.. అంచనాల్లేకపోయినా.. అద్భుతాలు చేస్తే సత్తా ఉన్నా.. ఎదురుపడితేనే గొప్ప అనుకునే స్థాయి నుంచి ఎదురించే స్థితికి ఎదిగిన జపాన్ యువ క్రీడాకారిణి నవోమి ఒసాకా.. యూఎస్ ఓపెన్‌లో మహాద్భుతం చేసింది. ఆటలో అమెరికన్ అనుభవమంతా లేని వయసుతో.. రాకెట్‌ను మంత్రదండలా మార్చి.. గ్రాండ్‌స్లామ్ క్వీన్‌గా పేరుగాంచిన నల్ల కలువను నేర్పుగా ఓడించి.. ఓ వివాదం వెంట మహోజ్వల విజయాన్ని సాధించింది. ఫలితంగా కెరీర్‌లో తొలి స్లామ్ టైటిల్‌తో టెన్నిస్‌కు గ్రాండ్‌గా సలామ్ చేసింది..!
Naomi-Osaka
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ ఫైనల్లో సరికొత్త సంచలనం నమోదైంది. హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆరుసార్లు చాంపియన్, అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌కు షాకిస్తూ.. జపాన్ యువ తార నవోమి ఒసాకా కొత్త విజేతగా ఆవిర్భవించింది. శనివారం అర్ధరాత్రి జరిగిన మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో 20వ సీడ్ ఒసాకా 6-2, 6-4తో 17వ సీడ్ సెరెనాపై గెలిచింది. దీంతో జపాన్ తరఫున తొలి గ్రాండ్‌స్లామ్ గెలిచిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన 20 ఏండ్ల ఒసాకా.. ఆసియా చరిత్రలో రెండో ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. గతంలో నా లీ (చైనా) ఫ్రెంచ్ ఓపెన్ (2011), ఆస్ట్రేలియా ఓపెన్ (2014) టైటిళ్లను గెలిచింది. ఓవరాల్‌గా కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ గెలిచి మార్గరెట్ కోర్టు ఆల్‌టైమ్ రికార్డును సమం చేయాలనుకున్న సెరెనా కలకు వివాదం రూపంలో అడ్డుకట్ట పడింది.

Naomi-Osaka2

ఏడుకు బ్రేక్..

గంటా 19 నిమిషాల పాటు జరిగిన ఫైనల్ అత్యంత వివాదాస్పదంగా ముగిసింది. వాగ్వాదం, మాటల యుద్ధం చోటు చేసుకోవడంతో సెరెనా.. చైర్ అంపైర్ కార్లోస్ రామోస్‌తో వాగ్వాదానికి దిగింది. దొంగ, అబద్దాల కోరు అంటూ బూతులు తిడుతూ.. కన్నీటి పర్యంతమవుతూ... చూపుడు వేలితో తీక్షణంగా హెచ్చరిస్తూ అంపైర్ వైపు దూసుకుపోయింది. ఓ దశలో అంపైర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని రిఫరీతో వాదిస్తూ భీష్మించుకుని కూర్చున్న సెరెనా.. కోపాన్ని అదుపు చేసుకోలేక మ్యాచ్‌ను చేజేతులా వదిలేసుకుంది. దీంతో కెరీర్‌లో ఏడో యూఎస్ టైటిల్ గెలువాలన్న ఆశ నెరవేర్చుకోలేకపోయింది.

Serena

సాదా.. సీదా..

తొలిసెట్‌లో సాదాసీదాగా ఆడిన సెరెనా.. ఒసాకా దూకుడుకు కళ్లెం వేయలేకపోయింది. మూడో గేమ్‌లో బ్రేక్ పాయింట్ వద్ద సెరెనా డబుల్ ఫాల్ట్ చేయడంతో ఒసాకా 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఐదో గేమ్‌లో సెరెనా 106 ఎంపీహెచ్ వేగంతో కొట్టిన సర్వ్‌ను జపాన్ అమ్మాయి అలవోకగా బ్రేక్ చేసింది. ఫలితంగా ఆధిక్యం 4-1కి పెరగడంతో ఒక్కసారిగా స్టేడియంలో నిశ్శబ్దం రాజ్యమేలింది. అప్పటివరకు ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసిన అమెరికన్.. ఆటతీరును మార్చుకోవడంతో తొలి బ్రేక్ పాయింట్ సాధించింది. కానీ 117 ఎంపీహెచ్ వేగంతో కొట్టిన సర్వీస్ విన్నర్ ఒసాకా వశం కావడంతో సెరెనా కోలుకోలేకపోయింది. తర్వాతి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకున్నా.. ఒసాకా 6-2తో సెట్‌ను చేజిక్కించుకుంది.

Carlos-Ramos

మూడు పాయింట్ల జరిమానా..

రెండోసెట్‌లో వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకోవడంతో చైర్ అంపైర్ రామోస్.. సెరెనాకు మూడు పాయింట్లు జరిమానా విధించాడు. రెండో గేమ్‌లో అమెరికన్ స్టార్.. తన కోచ్ ప్యాట్రిక్ మౌరటోగ్లోను సాయం అడగడాన్ని గమనించిన చైర్ అంపైర్ రామోస్ తొలి హెచ్చరిక జారీ చేశాడు. దీనిపై వాగ్వాదానికి దిగిన సెరెనా.. తాను ఎలాంటి సాయం తీసుకోలేదని వాదించింది. మూడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకుని, నాలుగో గేమ్‌లో మళ్లీ ఒసాకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఐదో గేమ్‌లో తన సర్వీస్‌లో సెరెనా.. రెండు డబుల్ ఫాల్ట్‌లతో పాటు బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌ను నెట్‌కు కొట్టింది. వెంటనే పట్టరాని కోపంతో రాకెట్‌ను నేలకు విసిరి కొట్టడంతో అంపైర్ రెండోసారి వార్నింగ్ ఇస్తూ ఓ పాయింట్ జరిమానా వేశాడు. దీంతో తర్వాతి గేమ్‌ను ఒసాకా 15-0తో మొదలుపెట్టింది.

Serena-2
పాయింట్ కోత పడటంతో ఆగ్రహంతో ఊగిపోయిన సెరెనా.. తాను కోచ్ సాయం తీసుకోలేదని మైక్‌లో ప్రకటించాలని కోరింది. రిఫరీని పిలిచి అంపైర్‌తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేసింది. కానీ.. అంపైర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. సెరెనా మ్యాచ్ మొదలుపెట్టినా.. ప్రత్యర్థి దాటికి చేతులెత్తేసింది. ఇక ఒసాకా 4-3 ఆధిక్యంలో ఉన్న దశలో సెరెనా.. మళ్లీ అంపైర్‌తో గొడవకు దిగింది. దొంగ, అబద్దాలకోరు అంటూ తీవ్రమైన పదజాలం వాడటంతో రామోస్ మూడో పెనాల్టీ విధించడంతో సెరెనా గేమ్‌ను చేజార్చుకుంది. స్కోరు 5-3 ఉన్న దశలో సెరెనా సర్వీస్‌ను నిలబెట్టుకున్నా.. వెంటనే తన సర్వీస్‌ను కాపాడుకున్న ఒసాకా చిరస్మరణీయం విజయాన్ని సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన ఒసాకాకు 3.8 మిలియన్ డాలర్ల (రూ. దాదాపు 25 కోట్లు)ప్రైజ్‌మనీ లభించింది.

యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాతో తలపడటం నా కల. అది ఇప్పుడు నెరవేరింది. స్కోరు 5-3తో ఉన్న దశలో నేను కొద్దిగా ఆందోళనకు గురయ్యా. ఆ సమయంలోనే గేమ్‌పై మరింత దృష్టిపెట్టాలని అనుకున్నా. ఎందుకంటే సెరెనా చాంపియన్. ఓటమిని అంత తొందరగా అంగీకరించదు. ఎలాంటి పరిస్థితులోనైనా పుంజుకుంటుంది. నేను టైటిల్ గెలువడం ఇప్పటికైతే కలగానే ఉంది. రాబోయే రోజుల్లో వాస్తవం అనిపిస్తుందేమో.
-ఒసాకా

870

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles