ఒసాకా వండర్ సెరెనా సూపర్


Sat,September 8, 2018 12:46 AM

-ఫైనల్లో ఇద్దరి అమీతుమీయూఎస్ ఓపెన్
Naomiosaka
ఎలాంటి అంచనాలు లేకుండానే అమెరికాఓపెన్‌లో అడుగుపెట్టింది. సంచలన ఆటతీరుతో ఒక్కోరౌండ్ అధిగమించినా తనపై పెద్దగా అంచనాలు లేవు.. సీడెడ్ ప్లేయర్లను ఓడిస్తున్నా..మరో రౌండ్ చేరడమే గొప్ప అన్నట్లుగా చూశారు.. కానీ 137 ఏండ్ల అమెరికా ఓపెన్ చరిత్రలో ఫైనల్ చేరుకున్న తొలి జపాన్ ప్లేయర్‌గా.. ఈ రికార్డును అందుకున్న రెండో ఆసియన్ మహిళగా రికార్డులు నెలకొల్పింది. ఆ అమ్మాయి నవోమి ఒసాకా ..అమోఘమైన ఆటతీరుతో సంచలనాల మోత మోగిస్తూ యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరింది.. మరోవైపు అమ్మగా మారినా..తనలో సత్తా తగ్గలేదని చాటుతూ అమెరికా థండర్ సెరెనా విలియమ్స్ రికార్డు స్థాయిలో 9వసారి యూఎస్ ఫైనల్ చేరింది. ఓపెన్ శకంలో 24 గ్రాండ్‌స్లామ్స్ సాధించిన తొలి టెన్నిస్ ప్లేయర్ సెరెనా నిలుస్తుందో లేదంటే తొలిగ్రాండ్‌స్లామ్ సాధించిన
జపాన్ వనితగా ఒసాకా నిలుస్తుందో తేలనుంది.

న్యూయార్క్: టెన్నిస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ జపాన్ యువ టెన్నిస్ ప్లేయర్ నవోమి ఒసాకా యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరింది. టోర్నీ ఆరంభం నుంచే అద్భుత ఆటతీరుతో కదం తొక్కుతూ తొలిగ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. 2013లో అంతర్జాతీయ టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన జపాన్ తార ఐదేండ్లలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరి అబ్బురపరుస్తున్నది. ఆరంభరౌండ్లలో తేలికైన ప్రత్యర్థులను ఎదుర్కొన్నా..క్వార్టర్ ఫైనల్లో సురెంకోపై వరుససెట్లలో విజయం సాధించి సెమీస్ చేరింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో అమెరికా టెన్నిస్ తార, గతేడాది రన్నరప్ మాడిసన్ కీస్‌పై విజయంతో సంచలనం సృష్టించింది. కార్లాసారెజ్ నవారో, సిబుల్కోవాలాంటి టాప్ ప్లేయర్లను ఓడించి సెమీస్ చేరిన కీస్.. 20 ఏండ్ల ఒసాకోను నిలువరించడంలో విఫలమైంది. తొలిసారి సెమీస్ ఆడుతున్న ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఒసాకా అద్భుతమైన గ్రౌండ్ స్ట్రోకులు.. సర్వీసులో కచ్చితత్వంతో అదరగొడుతూ 6-2,6-4 స్కోరుతో వరుససెట్లలో విజయం సాధించింది. ఫైనల్లో సెరెనా విలియమ్స్‌తో పోటీకి రెడీ అయింది.

ఫైనల్లో గ్రాండ్‌స్లామ్ క్వీన్

సెరెనా విలియమ్స్ రికార్డుస్థాయిలో 9వసారి యూఎస్ ఫైనల్లో ప్రవేశించింది. అమ్మగా మారినా మళ్లీ టెన్నిస్‌లో పునరాగమనం చేసిన సెరెనా వింబుల్డన్ తర్వాత వరుసగా రెండోగ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరి తన సత్తా చాటింది. వేడి, ఉక్కబోత వాతావరణాన్ని తట్టుకుంటూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఆకట్టుకుంటున్నది. శుక్రవారం లాత్వియా సంచలనం అనస్టీసియా సెవాత్సోవాపై 6-3,6-0 స్కోరుతో వరుససెట్లలో విజయంతో ఫైనల్ చేరుకుంది. 6సార్లు యూఎస్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలిచిన సెరెనా ఆటతీరుకు సెవాత్సోవా నిలువలేకపోయింది. తొలిసెట్‌లో ఆరంభంలో కాస్త ప్రతిఘటన ఇచ్చినా ..ఆ తర్వాత నామమాత్రపు ఆటతీరుతో సెరెనాకు పోటీ ఇవ్వలేకపోయింది. ఇక రెండోసెట్‌లో సెరెనా మరింత రెచ్చిపోయింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడి 6-0తో నెగ్గి సెట్‌తోపాటు మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్ చేరింది.

596

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles