ఆర్‌సీబీ ఏడో సారి..


Tue,April 16, 2019 02:34 AM

-ముంబై చేతిలో ఓటమి
-అదరగొట్టిన మలింగ, హార్దిక్
-డివిలీయర్స్, అలీ శ్రమ వృథా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తమ బోణీ గాలివాటమే అని నిరూపించింది. ఏడో మ్యాచ్‌లో తొలి విజయాన్నందుకున్న కోహ్లీసేనను మళ్లీ ఓటమి పలుకరించింది. లీగ్‌లో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు నిరాశపరిచింది. డివిలీయర్స్, అలీ అర్ధసెంచరీలతో గౌరవప్రదమైన స్కోరు అందుకున్న బెంగళూరు.. పసలేని బౌలింగ్‌లో ముంబైకి మ్యాచ్‌ను చేజార్చుకుంది. డికాక్, హార్దిక్ విజృంభణతో ముంబై మూడోస్థానానికి ఎగబాకగా, ఏడో ఓటమితో బెంగళూరు ప్లేఆఫ్ అవకాశాలను మొత్తంగా దూరం చేసుకుంది.
rcb
ముంబై: ఆర్‌సీబీని దురదృష్టం నీడలా వెంటాడుతూనే ఉన్నది. జట్టులో అరివీర భయంకరమైన బ్యాట్స్‌మెన్ ఉన్నా..ప్రత్యర్థి ముందు తలొగ్గుతూనే ఉన్నది. సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీసేన 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై..డికాక్(40), హార్దిక్ పాండ్యా(16 బంతుల్లో 37 నాటౌట్, 5 ఫోర్లు, 2సిక్స్‌లు) విజృంభణతో 19 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. చాహల్(2/27), అలీ(2/18) రెండేసి వికెట్లు దక్కాయి. తొలుత డివిలీయర్స్(51 బంతుల్లో 75, 6ఫోర్లు, 4సిక్స్‌లు), అలీ(50) అర్ధసెంచరీలతో ఆర్‌సీబీ 20 ఓవర్లలో 171/7 స్కోరు చేసింది. నాలుగు వికెట్లతో రాణించిన మలింగకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

ముంబై సమిష్టిగా:

నిర్దేశిత లక్ష్యఛేదన కోసం బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు డికాక్(40), రోహిత్‌శర్మ(28) మెరుగైన ఆరంభం దక్కింది. ముఖ్యంగా డికాక్ దూకుడుగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఉమేశ్ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి తన ఉద్దేశమేంటో చెప్పిన డికాక్..మలి ఓవర్లో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. రెండు ఫోర్లు, ఓ భారీ సిక్స్‌తో డికాక్ 16 పరుగులు పిండుకున్నాడు. మరోవైపు కెప్టెన్ కూడా బ్యాటు ఝులిపించడంతో కోహ్లీకి ఏం చేయాలో పాలుపోలేదు. వీరిద్దరు బౌండరీలతో దుమ్మురేపడంతో ఆరు ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు అలీ బ్రేక్‌లు వేశాడు. తొలి బంతికి రోహిత్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన అలీ..నాలుగో బంతికి డికాక్‌ను ఎల్బీగా పెవిలియన్ పంపాడు.

ఆ తర్వాత క్రీజులోకొచ్చిన ఇషాన్ కిషన్ సుడిగాలిలా చెలరేగాడు. వచ్చి రావడంతోనే నేగిని రెండు సిక్స్‌లు బాదిన కిషన్..చాహల్‌ను విడిచిపెట్టలేదు. సిక్స్‌తో స్కోరుబోర్డును ఉరికెత్తించిన ఈ ముంబై కుర్రాడు..షాట్ ఆడే ప్రయత్నంలో స్టంప్‌ఔటయ్యాడు. ఇషాన్ ఔట్ తర్వాత ముంబై రన్‌రేట్ ఒకింత మందగించింది. అయితే ఆఖర్లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా..బెంగళూరు బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. క్రీజులోకి వస్తూనే బౌండరీతో ఊపుమీద కనిపించిన హార్దిక్..నేగిని చితక్కొట్టుడు కొట్టాడు. 12 బంతుల్లో 22 పరుగులు అవసరమైన దశలో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లతో ముంబైకి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు.

ఏబీ, అలీ బాదేశారు:

ముంబైకి మెరుగైన లక్ష్యాన్ని నిర్దేశిద్దామనుకున్న ఆర్‌సీబీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బెహెన్‌డార్ఫ్(1/49) రెండో ఓవర్లో..కెప్టెన్ కోహ్లీ(8)..కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన డివిలీయర్స్(75), పార్థివ్(28)కు జతకలిశాడు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డుకు పరుగులు జతచేశారు. బెహెన్‌డార్ఫ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో పార్థివ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడు ఫోర్లు, ఓ భారీ సిక్స్‌తో 19 పరుగులు పిండుకోవడంతో పవర్‌ప్లే ముగిసే సరికి బెంగళూరు వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న తరుణంలో హార్దిక్ పాండ్యా దెబ్బ కొట్టాడు. మొయిన్ అలీ(50) రంగప్రవేశంతో ఇన్నింగ్స్ మరో మలుపు తీసుకుంది. అలీని అండగా చేసుకుని డివిలీయర్స్ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశాడు.

ఓవర్‌కు ఓ బౌండరీ చొప్పున ఏబీ చెలరేగాడు. దీపక్ చాహర్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో డివిలీయర్స్ ఫోర్ కొడితే తానేం తక్కువ కాదన్నటు అలీ సిక్స్‌తో ఊపులోకొచ్చాడు. ఇద్దరు పోటాపోటీగా ఆడటంతో ఆర్‌సీబీ స్కోరుబోర్డు జోరు అందుకుంది. బెహెన్‌డార్ఫ్ బౌలింగ్‌లో అలీ..రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 17 పరుగులు కొల్లగొట్టాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. భారీ స్కోరు ఖాయమనుకుంటున్న తరుణంలో మలింగ(4/31) తన ప్రతాపం చూపించాడు. భారీ షాట్ ఆడబోయిన అలీ..డీప్ స్వేర్ లెగ్‌లో హార్దిక్ చేతికి చిక్కడంతో మూడో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. దీంతో ఆర్‌సీబీ 25 పరుగుల తేడాతో ఆఖరి ఐదు వికెట్లు కోల్పోయింది.

స్కోరు బోర్డు

బెంగళూరు: పార్థివ్ పటేల్ (సి)సూర్యకుమార్(బి)హార్దిక్ 28, కోహ్లీ(సి)డికాక్(బి)బెహెన్‌డార్ఫ్ 8, డివిలీయర్స్(రనౌట్) 75, అలీ(సి)హార్దిక్(బి)మలింగ 50, స్టోయినిస్(సి)రోహిత్(బి)మలింగ 0, నాథ్(సి)డికాక్(బి)మలింగ 2, నేగి(సి)డికాక్(బి)మలింగ 0, ఉమేశ్ 0 నాటౌట్, సిరాజ్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 171/7; వికెట్ల పతనం: 1-12, 2-49, 3-144, 4-151, 5-169, 6-169, 7-169; బౌలింగ్: బెహెన్‌డార్ఫ్ 4-0-49-1, మలింగ 4-0-31-4, బుమ్రా 4-1-22-0, హార్దిక్ 3-0-21-1, చాహర్ 4-0-31-0, కృనాల్ 1-0-10-0.

ముంబై: రోహిత్‌శర్మ(బి)అలీ 28, డికాక్(ఎల్బీ)అలీ 40, సూర్యకుమార్ (సి)సైనీ(బి)చాహల్ 29, ఇషాన్ కిషన్ (స్టంప్/పటేల్)(బి)చాహల్ 21, కృనాల్(సబ్/మిలింద్)(బి)సిరాజ్ 11, హార్దిక్ 37 నాటౌట్, పొలార్డ్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19 ఓవర్లలో 172/5; వికెట్ల పతనం: 1-70, 2-71, 3-104, 4-129, 5-148; బౌలింగ్: ఉమేశ్ 2-0-25-0,సైనీ 3-0-34-0, సిరాజ్ 2-0-21-1, చాహల్ 4-0-27-2, నేగి 4-0-47-0, అలీ 4-0-18-2.
ipl-table

ipl-score

308

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles